ETV Bharat / state

Heavy Rains in Telangana : వరంగల్​లో "2018" మూవీ దృశ్యాలు.. మీరు చూసేయండి!

author img

By

Published : Jul 25, 2023, 7:32 PM IST

Warangal Weather Report Today : భారీ వర్షాలతో వరంగల్ జిల్లా తడిసిముద్దైంది. జిల్లాలోని వాగులు వంకలూ పొంగి ప్రవహించగా.. వరదనీరు రహదారులపైకి వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో ఓ గిరిజనుడు గల్లంతయ్యాడు. మరోవైపు.. ఓరుగల్లు నగరంలో లోతట్టు కాలనీలు జలమయమై.. వర్షపు నీరు ఇళ్లలోకి చేరటంతో ముంపు బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.

heavy rains in warangal
heavy rains in warangal

భారీ వర్షాలకు జలమయమయిన రహదారులు

Heavy Rains in Telangana : ఏకధాటిగా కురిసిన వర్షం వరంగల్‌లోని లోతట్టు కాలనీలను జలమయం చేసింది. నగర వీధులన్నీ ఏరులుగా తలపించగా.. మోకాల్లోతు పైగా వచ్చిన వరదతో ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు వీడని ముసురుతో పలు కాలనీల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. సమీప నాలాలు పొంగి ప్రవహించాయి. ఎస్​ఆర్​నగర్, సాయిగణేష్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎంహెచ్​నగర్, శివనగర్‌ కాలనీల్లోని ఇళ్లు చెరువయ్యాయి. బియ్యం, పప్పు, ఉప్పు, ఇతర సామగ్రి తడిసిపోవటంతో.. బాధితుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. వర్షపునీటిలో చిక్కుకున్న వివేకానందకాలనీ, సుందరయ్యనగర్‌, సాయిగణేశ్‌ కాలనీల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్న మంత్రి.. పునరావాసానికి తరలించాలని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి.. రెస్క్యూటీం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు.

గ్రామాల్లో విద్యుత్​ సరఫరాకి అంతరాయం : వరంగల్ల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాగులు వంకలూ ఉప్పొంగుతుండగా.. జిల్లాలోని చెరువులు అలుగులు పారుతున్నాయి. భారీ వర్షంతో పంథిని వద్ద ఊర వాగు ఉప్పొంగడంతో వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపైకి ఆరడగుల మేర వరద నీరు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడిగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వర్ధన్నపేట శివారులో ఆకేరు వాగు ఉథృతంగా ప్రవహించగా.. రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోని లోతట్లు ప్రాంతాలు జలమయంగా మారాయి. గత రాత్రి నుంచి వర్షం కురవడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేట మండలం ఇల్లందలో తరచూ వరదనీరుతో ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు.

Heavy Rains in Narsampeta : నర్సంపేట మండలంలోని మాధన్నపేట చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తుంది. నెక్కొండ మండలంలో వట్టెవాగు పొంగిపొర్లుతుండడంతో నెక్కొండ, పత్తిపాక.. నెక్కొండ, గుండ్లపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల వాగు పొంగి పొర్లుతుండడంతో నెక్కొండ, గూడూరు మండలాలకు సంబంధాలు తెగిపోయాయి. చెన్నారావుపేట మండలంలో ముగ్ధంపురం చెరువు పొంగడంతో నర్సంపేట- చెన్నారావుపేట రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్ వే మీద నుంచి నీరు ఉధృతంగా ప్రవహించటంతో నర్సంపేట చెన్నారావుపేట, నెక్కొండ మీదుగా అన్నారం, తొర్రూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట మండలం గురిజాల పెద్దచెరువు ప్రమాదకర స్థాయిలో మత్తడి పోస్తుండడంతో నర్సంపేట నుంచి గురిజాల మీదుగా పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురిజాల పెద్ద చెరువు సమీపంలోని లోలెవల్ కాజ్‌వే వద్ద ఉన్న తాడిచెట్టు విద్యుత్ తీగలపై విరిగి పడడంతో ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు స్తంభాలు నేలకూలాయి. స్థానికుల అప్రమత్తంతో ప్రమాదం తప్పింది.

Warangal Rains : ఊరు ఏరయ్యింది.. ఏరు హోరెత్తింది.. వాగూవంకా ఏకం చేస్తూ ఉప్పొంగింది

గ్రామాలకి మధ్య స్తంభించిన రాకపోకలు : మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరు, ఆకేరు, పాలేరు పాకాల, వట్టి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో అతి పెద్దదైన బయ్యారం పెద్ద చెరువు అలుగు పారుతోంది. వట్టి వాగు పొంగి ప్రవహిస్తుండడంతో బయ్యారం.. మొట్లతిమ్మాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుర్తురు పెద్ద చెరువు ఉద్ధృతికి తొర్రూరు - నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కేసముద్రం మండలం అర్పణపల్లి శివారులో బ్రిడ్జిపై నుంచి వాగు పొంగుతుండటంతో కేసముద్రం, గూడూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు, తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ఆకేరు, పాలేరు వాగుల ఉద్ధృతిని జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.

కొనసాగుతున్న రెడ్ అలర్ట్​ : భూపాలపల్లి జిల్లాలో ఘనపూర్ మండలం మోరంచ వాగు ఉద్ధృతికి కొండాపురం, అప్పయ్యపల్లి, సీతారాంపూర్ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేగొండ మండలంలో కల్వర్టుపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సుల్తాన్‌పుర్- గోరికొత్తపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలో గల 6 జిల్లాల కలెక్టర్లు, సీపీ, ఎస్పీ, ఇతర అధికారులతో పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పిన మంత్రి.. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని దిశానిర్దేశం చేశారు.

"లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. అందువల్ల వరద నీరు ఎక్కువగా నిలిచిపోయింది. గతంలో డ్రైనేజ్​ వాటర్​ సక్రమంగా వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. దాన్ని త్వరలో పూర్తి చేస్తాం. ప్రజలకి ధైర్యం చెప్పేందుకే వచ్చాను. పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశాం. నీళ్లలను వెంబడే తరలించే ఏర్పాట్లు చేస్తాం." - ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.