ETV Bharat / state

పీసీసీ ఈసీ సభ్యురాలిగా కొండా సురేఖ రాజీనామా.. ఆ పదవి ఇస్తానని రేవంత్ హామీ

author img

By

Published : Dec 11, 2022, 5:23 PM IST

Updated : Dec 11, 2022, 7:14 PM IST

Konda Surekha letter to Revanth reddy: తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుత్వానికి రాజీనామా చేసిన కొండా సురేఖ జూబీహిల్స్‌లో రేవంత్‌ నివాసానికి వెళ్లి తన అసంతృప్తిని వెలిబుచ్చారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయాన్ని... ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో కూడా సురేఖ మాట్లాడినట్లు తెలుస్తోంది. తాను ఏఐసీసీతో మాట్లాడి... సాధ్యమైనంత వరకు రాజకీయ వ్యవహారాల కమిటీలో అవకాశం కల్పించేటట్లు చూస్తానని రేవంత్‌ హామీ ఇచ్చినట్లు సురేఖ తెలిపారు.

konda surekha
konda surekha

Konda Surekha letter to Revanth reddy: పీసీసీ కార్యనిర్వాహక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి, కొండా సురేఖ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో రేవంత్‌ రెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. అదేవిధంగా తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయాన్ని... ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో కూడా సురేఖ మాట్లాడినట్లు తెలుస్తోంది.

34 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నతాను.. మాజీ మంత్రి అని కూడా చూడకుండా కార్యనిర్వాహక సభ్యురాలిగా అవకాశం కల్పించిన విషయాన్ని బోసురాజుకు వివరించినట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ విషయాన్నితీసుకెళ్తానని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో కూడా ఈ విషయం మాట్లాడుతానని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. తాను ఏఐసీసీతో మాట్లాడి... సాధ్యమైనంత వరకు రాజకీయ వ్యవహారాల కమిటీలో అవకాశం కల్పించేటట్లు చూస్తానని రేవంత్‌ హామీ ఇచ్చినట్లు కొండా సురేఖ తెలిపారు.

అంతకుముందు.. ఇటీవల ఏఐసీసీ నియమించిన పీసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యత్వానికి కాంగ్రెస్ నేత కొండా సురేఖ రాజీనామా చేశారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ పంపించారు. ప్రదేశ్ కమిటీలో ఏఐసీసీ చేసిన సభ్యుల ఎంపిక అసంతృప్తిని కలిగించాయని తెలిపారు. తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీలో తన పేరు లేకపోవడమే కాదు.. వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ నాయకుడి పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందని పేర్కొన్నారు.

రాజకీయ వ్యవహారాల కమిటీలో జూనియర్లకు స్థానం కల్పించారని తనను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నానని కొండా సురేఖ అన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ రాజకీయ బతుకుదెరువు కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో నిండిపోయిందని విమర్శించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కానీ వాళ్లను నామినేట్ చేసిన కమిటీలో.. తనను నామినేట్ చేయడం అవమాన పరిచినట్లుగా భావిస్తున్నాని తెలిపారు.

తనకు పదవుల కంటే ఆత్మాభిమానం ముఖ్యమని.. ఇకపై కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్య కార్యకర్త మాదిరి కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు. తమ కుటుంబం 34 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా తమల్ని అభిమానించే వారున్నారని అన్నారు. తాను, తన భర్త వరంగల్‌ తూర్పు, పరకాల నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటామని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 11, 2022, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.