ETV Bharat / state

ఈ గట్టున గర్భిణి.. ఆ గట్టున అంబులెన్స్​.. మధ్యలో వాగు

author img

By

Published : Sep 26, 2020, 11:51 AM IST

flooded pond in vikarabad district
వికారాబాద్ జిల్లాలో వాగు సమస్యలు

ఒక గట్టున పురిటి నొప్పులతో మహిళ.. మరో గట్టున 108 వాహనం.. మధ్యలో వాగు.. ఇదీ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పరిస్థితి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లడం వల్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పురిటి నొప్పలుతో బాధపడుతున్న ఓ మహిళను స్ట్రెచర్​ సాయంతో స్థానికులు వాగు దాటించారు.

వికారాబాద్​ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో తాండూరు నియోజకవర్గంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బషీరాబాద్ మండలంలోని జీవంగి గ్రామానికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో బాధపడటం వల్ల ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. మార్గ మధ్యలో వాగు ఉద్ధృతంగా పొంగుతుండటం వల్ల మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లడం కష్టంగా మారింది.

వాగుకు ఓ గట్టు పురిటి నొప్పులతో మహిళ బాధపడుతుంటే.. మరో గట్టున ఆమె కోసం అంబులెన్స్ ఉంది. స్థానికులు వాగు దాడి ఆంబులెన్స్ వద్దకు వెళ్లి స్ట్రెచర్​ను తీసుకొచ్చారు. గర్భిణిను స్ట్రెచర్​లో వాగు దాటించి అంబులెన్స్​​లో ఆసుపత్రికి తరలించారు.

అత్యవసర పరిస్థితులు వస్తే బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఉందని.. ప్రభుత్వం స్పందించి తమకు ఓ మార్గం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి తమకు ఇవే ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.