ETV Bharat / state

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

author img

By

Published : Mar 19, 2022, 7:48 PM IST

Updated : Mar 19, 2022, 9:01 PM IST

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

19:46 March 19

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

మల్లు స్వరాజ్యం ఆత్మకథ
మల్లు స్వరాజ్యం ఆత్మకథ

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఎం సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం తుది శ్వాస విడిచారు. వయోభారంతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మల్లు స్వరాజ్యం ఆరోగ్యం క్షీణించడంతో 20 రోజుల క్రితం కుటుంబసభ్యులు బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు.

స్వరాజ్యం పేదల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించారు. మల్లు స్వరాజ్యం మరణ వార్తతో సీపీఎం శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. మల్లు స్వరాజ్యం పార్ధీవ దేహాన్ని ఉదయం వరకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలోనే భద్రపర్చనున్నారు. ఉదయం ఆరు గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్​కు తరలిస్తారు. పార్టీ నాయకులు, శ్రేణుల సందర్శనార్థం 9గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం పార్ధీవ దేహాన్ని నల్గొండకు తరలించనున్నారు. నల్గొండ సీపీఎం కార్యాలయంలో సంతాప సభ అనంతరం పార్ధీవ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వనున్నట్లు సీపీఎం రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఆమె తన మరణాంతరం పార్ధీవదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయాలని కోరినట్లు తెలిపారు.

భూస్వామి కుటుంబంలో జననం

భూస్వాముల కుటుంబంలో పుట్టిన మల్లు స్వరాజ్యం.. బాధితులు, పీడితులవైపే ఎప్పుడూ నిలిచేవారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడ్డారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సొంత బాబాయినే ఎదురించారు స్వరాజ్యం. ఎర్ర జెండాను విడవ‌కుండా, భుజానికేసిన సంచిని మ‌ర‌వ‌కుండా పేద ప్రజ‌ల‌ కోసం పోరాడారు కామ్రేడ్ స్వరాజ్యం. నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిట సింహ స్వప్నమై నిలిచారు. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి.. నైజాం సర్కారును గడగడలాడించారు. ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో అప్పటి పాలకులు ఆమె ఇంటిని పూర్తిగా దహనం చేశారు. స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతలూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం.. గొప్ప సాహస యోధురాలు. స్వాతంత్య్రోద్యమంలో, సాయుధ రైతాంగ పోరాటంలోనూ పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల్లో తన మాటలతో, పాటలతో చైతన్యం కల్పించారు. జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకున్నారు.

ఆమె జీవితం ఒక మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ

అప్పటి నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించారు మల్లు స్వరాజ్యం. భీమ్‌రెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు కలిగిన సంతానమే స్వరాజ్యం. ఈమె తోడబుట్టిన అన్న... తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, అక్క శశిరేఖ ఉండగా మూడో సంతానంగా స్వరాజ్యం జన్మించారు. అనంతరం చెల్లెలు సరస్వతి, తమ్ముడు రాజకీయ కురువృద్ధుడు భీమ్ రెడ్డి కుశలవరెడ్డి ఉన్నారు. వారిది భూస్వామ్య కుటుంబం. పదేళ్ల వయస్సు నుంచే మల్లు స్వరాజ్యం మాగ్జిమ్‌ గోర్కీ రచనలు చదివేవారు. పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యవస్థను చూసి చలించేవారు. ఆమెకు 11 ఏళ్లు ఉన్నప్పుడు.. కట్టుబానిసలకు స్వస్తి పలకాలని ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపుతో ప్రజా జీవితం ప్రారంభించారు. వివిధ కులాలు, వర్గాల నుంచి వచ్చిన కార్మికులకు బియ్యం పంపిణీ చేయడంతో ఆమె సేవా జీవితం ఆరంభమైంది. అన్న భీంరెడ్డి న‌ర‌సింహారెడ్డితో క‌లిసి పేద‌ల ప‌క్షాన పోరాడాల‌ని నిర్ణయించుకున్నారు. ఆ స్ఫూర్తితో నాటి నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. రజాకార్ల పాలిట సింహస్వప్నమై నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. చిన్నతనంలోనే ప్రజాజీవితంలో అడుగుపెట్టిన ఆమె... ఆనాడు తనలో ఏ నిప్పు రవ్వ రాజుకుందో చివరి వరకూ ఆ జ్వాల అలాగే ఎగిసిపడుతూ వచ్చింది. నా గొంతే నాకు తుపాకి తూటా అంటారామె. ఆమె జీవితం ఒక మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ.

ఆమె పోరాటం వర్ణణాతీతం

తుపాకీ చేత‌ప‌ట్టి జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన‌ మల్లు స్వరాజ్యం.. ఒక దళానికి కమాండర్‌గా ముందుండి న‌డిచారు... ద‌ళాన్ని న‌డిపించారు. ఆ సమయంలో ఆమెను ప‌ట్టించిన వారికి 10 వేల బహుమ‌తి ప్రక‌టించింది అప్పటి నిజాం ప్రభుత్వం. కానీ దేనికీ భ‌య‌ప‌డ‌కుండా పేదల పక్షాన, పీడితుల పక్షానే నిలిచి కలబడ్డారు. త‌న ఉద్యమ స‌హ‌చ‌రుడైన మ‌ల్లు వెంక‌ట న‌ర‌సింహా రెడ్డిని వివాహం చేసుకున్నారు. అటు భర్త... ఇటు తాను పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన తీరు వర్ణనాతీతం. కాగా ఆమె భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి అనారోగ్యంతో 2004, డిసెంబర్ 25న మృతి చెందారు. వీరికి ముగ్గురు సంతానం. ప్రథముడైన మల్లు గౌతమ్ రెడ్డి హోమియోపతి డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం మిర్యాలగూడ సీపీఎం పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. రెండో సంతానం పాదూరి కరుణ. ఈమె సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడో వారైన మల్లు నాగార్జున రెడ్డి సీపీఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా ఉన్నారు.

కీలక పదవులు చేపట్టిన స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లో రెండు పర్యాయాలు సీపీఎం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 1985, 89లో ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె పోరాటం పేద ప్రజల సంక్షేమంపైనే కొనసాగింది. సీపీఎం పార్టీలో అఖిల భారత ఉపాధ్యక్షురాలిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా, ఇలా ఎన్నెన్నో కీలకమైన పదవుల్లో ఆమె కొనసాగారు. 92 ఏళ్ల వయస్సున్న స్వరాజ్యం.. మొన్నామొన్నటి వరకు కూడా సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగారు. వామపక్ష భావాలతో, మహిళ ఆధ్వర్యంలో మొదలైన పత్రిక 'చైతన్య మానవి' సంపాదకవర్గంలో ఈమె ఒకరు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు.

ఇదీ చదవండి:

Last Updated :Mar 19, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.