ETV Bharat / state

'తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా చర్యలు తప్పవు'

author img

By

Published : Jun 29, 2020, 3:08 PM IST

పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న ధ్యేయంతో... నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కరోనా సంక్షోభంతో మూడు నెలలుగా జరుగుతున్న నష్టాన్ని... పూడ్చుకోవాల్సిన అవసరముందన్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన ఆయన... వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Minister ktr tour in union nalgonda
తప్పు చేస్తే.. ముందు సొంత పార్టీవారి పైనే చర్యలు: కేటీఆర్

తప్పు చేస్తే.. ముందు సొంత పార్టీవారి పైనే చర్యలు: కేటీఆర్

ప్రజల, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టేవారి పట్ల నిర్దయగా ఉండాలని... పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా చర్యలు తీసుకోవాల్సి వస్తే... తమ పార్టీ వారిపైనే ఉండాలని సూచించారు. నల్గొండ జిల్లా చిట్యాల, సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పురపాలికల్లో మంత్రి పర్యటించారు. చిట్యాల విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించి.. సీసీ రహదారులు, వైకుంఠధామం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు ఇప్పటికే నిధులు కేటాయించామని... ఇక పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల నిర్మాణాల్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లోనూ... ఎక్కడా సంక్షేమం ఆగకుండా ముఖ్యమంత్రి దృష్టి సారించారని కేటీఆర్ తెలియజేశారు.

హామీలు నెరవేర్చే పనిలో...

హుజూర్​నగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే లక్ష్యంలో భాగంగా.. కేటీఆర్ పర్యటించారు. నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. స్థానిక సిమెంటు పరిశ్రమల్లో యువతకు ఉపాధి లభించేలా.. నైపుణ్యాభివృద్ధి కేంద్రం సహా పట్టణ పార్కు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు గాను ఒక్కో మండలానికి రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. కోటిన్నర.. 134 గ్రామ పంచాయతీలకు రూ. 26 కోట్ల 80 లక్షలు అందిస్తున్నామని మంత్రి ప్రకటించారు.

బుల్లెట్​ రైల్..

మిగతా హామీలైన గిరిజన సంక్షేమ పాఠశాల, బంజారా భవన్, పాలిటెక్నిక్ కళాశాలతో పాటు మఠంపల్లి మండలంలో పారిశ్రామిక పార్కుకు శ్రీకారం చుడతామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైలు తిరిగితే... పెద్దయెత్తున అభివృద్ధి సాధ్యపడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి: 'మళ్లీ కరోనా పరీక్షలు.. లాక్​డౌన్​పై మంత్రివర్గంలో నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.