ETV Bharat / state

కాళేశ్వరం అద్వితీయం... కొండపోచమ్మకు గోదావరి పరుగులు

author img

By

Published : May 29, 2020, 1:56 PM IST

Updated : May 29, 2020, 2:02 PM IST

కొండపోచమ్మ జలాశయాన్ని చేరిన గోదారమ్మ
కొండపోచమ్మ జలాశయాన్ని చేరిన గోదారమ్మ

ప్రాజెక్టుల పునరాకృతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల్లో అత్యంత కీలకమైంది, క్రియాశీలకమైంది, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. రికార్డు సమయంలో చరిత్రను తిరగరాస్తూ పనులను పూర్తి చేసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దశలవారీగా ఫలాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం కొండపోచమ్మ జలాశయం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకాన్ని కొత్త రాష్ట్రం తెలంగాణ మూడేళ్లలోనే పూర్తి చేసింది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు అత్యంత ఎత్తుకు చేరుకున్నాయి. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి గోదావరి నీటిని తరలించి అక్కడ్నుంచి మిడ్ మానేర్ మీదుగా ఇటీవల ప్రారంభించిన రంగనాయక్ సాగర్​కు జలాలు తరలించారు. అనంతరం 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మలన్నసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి.

15 టీఎంసీలతో కొండపోచమ్మ!

ఈ ప్రాజెక్టుకు పై భాగంలో సుమారు 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ ప్రాజెక్టును నిర్మించారు. రూ.1772 కోట్ల వ్యయంతో నిర్మించిన జలాశయంలో 4600 ఎకరాల భూమిని సేకరించారు. 4 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 15.8 కిలోమీటర్ల మేర జలాశయం చుట్టూ కట్ట నిర్మించారు.

మేడిగడ్డ నుంచి..

మేడిగడ్డ వద్దనున్న లక్ష్మి ఆనకట్ట నుంచి మర్కూక్​ పంప్​హౌజ్​ వరకు చేరుకునే జలాలు సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఇక్కడ్నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్​కు గోదావరి జలాలు సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తుకు తరలివస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తైన ఈ ప్రాంతానికి చేరిన జలాలు మిగతా జలాశయాలు, కాల్వలకు గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా వెళ్తాయి. అన్నారం, సుందిళ్ల, నందిమేడారం, గాయత్రి, అనంతగిరి, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, అక్కారం, మర్కూక్ పంప్ హౌజ్​ల్లోని పంపుల ద్వారా అంచెలంచెలుగా నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు.

గోదావరమ్మను ఒడిసిపట్టిన కొండపోచమ్మ!

చుక్కాపూర్​ పంప్ హౌజ్ నుంచి అక్కారం పంప్​ హౌజ్ వరకు 6 మోటర్ల ద్వారా నీటిని తరలించారు. తొలుత అక్కారం పంప్​హౌజ్ నుంచి మర్కూక్ పంప్ హౌజ్​కు చేరుకున్న గోదారి జలాలు.. కొండపోచమ్మ సాగర్‌లోకి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం ఆవిష్క్రృతమైంది.

మెతుకు సీమ సస్యశ్యామలం

మెతుకు సీమ (ఉమ్మడి మెదక్ జిల్లా)ను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జలాశయం నిర్మించింది. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు గోదావరి జలాలు 214 కిలోమీటర్లు మేర ప్రవహిస్తుంది. కొండపోచమ్మ సాగర్‌లోకి నీరు చేరికతో తుది, 10వ దశ ఎత్తిపోతల నిర్మాణం పూర్తైంది.

కొండపోచమ్మ నుంచే హైదరాబాద్​కు..

హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాల కోసం కేశవాపూర్ వద్ద నిర్మించే జలాశయానికి కూడా కొండ పోచమ్మసాగర్ నుంచే నీరు వెళ్తుంది. సిద్దిపేట, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు కొండ పోచమ్మ ప్రాజెక్టు సాగు నీరు అందించనుంది.

ఇవీ చూడండి : అక్కారం పంప్​హౌజ్​ నుంచి మర్కూక్​కు నీటి విడుదల

Last Updated :May 29, 2020, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.