ETV Bharat / state

BANDI SANJAY: 'ఉప ఎన్నికల కోసమే దళిత సాధికారత డ్రామా'

author img

By

Published : Jun 29, 2021, 5:46 AM IST

BANDI SANJAY: 'ఉప ఎన్నికల కోసమే దళిత సాధికారత డ్రామా'
BANDI SANJAY: 'ఉప ఎన్నికల కోసమే దళిత సాధికారత డ్రామా'

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉప ఎన్నికల కోసమే దళిత సాధికారత డ్రామా ఆడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. దళితులకు గతంలో ఇచ్చిన హామీలు ఏమి కూడా నెరవేర్చని సీఎం కేసీఆర్ దళితుల సాధికారతపై సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు.

గ్రామాలు అభివృద్ధికి నోచుకోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్‌ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట, అక్కన్నపేట, పంతులుతండా, కుందన్‌వానిపల్లి, గండిపల్లి, రామవరం, మల్‌చెర్వుతండా, రేగొండ, గోవర్ధనగిరి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి సమస్యలు తెల్సుకున్నారు. ప్రజలకు భరోసా కల్పించడానికి గ్రామాల బాట పట్టానన్నారు. ఐదేళ్లుగా రేషన్‌కార్డులు లేక పేదలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉప ఎన్నికలు రాగానే రేషన్‌కార్డులు గుర్తుకువచ్చాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఒకమాట, ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడుతున్నారన్నారు.

అక్కన్నపేట పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సందర్శించారు. పలు గ్రామాల్లో హైమాస్ట్‌ లైట్లు, శీతల శవపేటికలను అందించేందుకు హామీ ఇచ్చారు. దళితుల సంక్షేమానికి భాజపా కట్టుబడి ఉందని, మంచి కోసం చేసే ఏ పనినైనా తమ పార్టీ స్వాగతిస్తుందని ఆయన అన్నారు. పలువురు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు.

ఏ హామీ నెరవేర్చలేదు

దళితులకు గతంలో ఇచ్చిన హామీలు ఏమి కూడా నెరవేర్చని సీఎం కేసీఆర్ దళితుల సాధికారతపై సమావేశం నిర్వహించడం విడ్డూరంగా ఉంది. దళిత సాధికారతపై నమ్మకం లేదు. అది దళితుల సమావేశమా, అఖిలపక్ష సమావేశమా, మంత్రుల సమావేశమా లేక ఎమ్మెల్యేల సమావేశమా. దళిత సంక్షేమానికి భాజపా కట్టుబడి ఉంది. ఉప ఎన్నికల కోసమే దళిత సాధికారత డ్రామా ఆడుతున్నారు. గిరిజన తండాల అభివృద్ధి కుంటుపడింది. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా చెప్పుకుంటూ సీఎం కేసీఆర్ పబ్బం గడుపుతున్నారు. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి: REVANTH REDDY: 'సోనియా, రాహుల్​ గాంధీల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.