ETV Bharat / state

ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్​లు అడ్డుకోవద్దు: జగ్గారెడ్డి

author img

By

Published : May 14, 2021, 5:09 PM IST

ఏపీ నుంచి హైదరాబాద్​కు వస్తున్న అంబులెన్స్​లు ఆర్టీసీ బస్సులు కావని.. వాటిని ఆపితే ప్రాణాలు పోయే ప్రమాదముందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెరాస ప్రభుత్వానికి సూచించారు. రాజకీయాలకతీతంగా కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

mla jaggaredy latest news
తెరాస ప్రభుత్వానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచన

ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దులో అడ్డుకోరాదని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మానవత్వంతో వ్యవహరించి అంబులెన్స్​లు రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతివ్వాలని కోరారు. ​తెలంగాణ రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకురాకుండా అంబులెన్స్‌లను రాష్ట్రంలోకి రానివ్వాలని తెలిపారు. అధిష్ఠానం ఆదేశానుసారం తాను తన నియోజక వర్గంలో కరోనా రోగులకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కబలిస్తున్న కరోనా వైరస్‌ ఉద్ధృతిని నిలువరించేందుకు రాజకీయాలకు అతీతంగా పని చేయాలని సూచించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదన్న ఆయన.. జనం ఇబ్బందులను పట్టించుకోవాలని సూచించారు. రెమ్​డెసివిర్‌ ఇంజెక్షన్లను సమకూర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ఈ ఇంజక్షన్ లభించక... ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోతున్నారన్నారు.

పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేంద్రంతో మాట్లాడి రెమ్​డెసివిర్‌ కొరత లేకుండా చూడొచ్చు కదా.. అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కరోనా రోగుల అవసరానికి హైదరాబాద్‌ గాంధీ భవన్​లో రెండు అంబులెన్స్​లను అందుబాటులోకి తెస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి: కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.