ETV Bharat / state

ktr: 'జేఎన్​యూ గోడలపై రాసిన ఆ కొటేషన్ నన్ను రాజకీయాలవైపు నడిపింది'

author img

By

Published : Aug 17, 2021, 4:56 PM IST

Updated : Aug 18, 2021, 7:16 AM IST

minister-ktr-participating-in-question-and-answer-team-with-geetam-students
minister-ktr-participating-in-question-and-answer-team-with-geetam-students

దిల్లీలోని జేఎన్​యూ గోడలపై రాసిన ఓ వ్యాక్యం.. తనను రాజకీయాల వైపు నడిపించిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఐఏఎస్​ అధికారిగా చూడాలని తన తండ్రి కేసీఆర్​ అనుకున్నారని.. కానీ.. తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. గీతం విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు... జాతీయ అంతర్జాతీయ అంశాలను ఉదహరిస్తూ సమాధానాలు చెప్పారు.

'జేఎన్​యూ గోడలపై రాసిన ఆ వ్యాక్యం నన్ను రాజకీయాలవైపు నడిపింది'

యూపీఎస్‌సీ పరీక్షలు సిద్ధమవ్వాలని నాన్న సూచనతో తొలుత దిల్లీకి వెళ్లాను. అక్కడ జేఎన్‌యూ విశ్వవిద్యాలయం గోడల మీద రాసిన ప్రజాస్వామ్యాన్ని రాజకీయాలు నిర్ణయిస్తున్నప్పుడు భవిష్యత్ రాజకీయాలను నువ్వు నిర్ణయించు అన్న మాటలు నా ఆలోచన విధానంలో మార్పునకు దోహదం చేశాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వ నిర్ణయాలే ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 2006లో నాన్న యూపీఏ నుంచి వైదొలగడం, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. నాన్నకు చెప్పకుండానే నా ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాను. 2009లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి సిరిసిల్ల నుంచి పోటీచేసినపుడు కేవలం 171 ఓట్ల తేడాతోనే గెలిచాను. తదనంతరం 2010లో వచ్చిన ఉప ఎన్నికల్లో 89వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించాను. ఓట్ల రూపంలో స్వరాష్ట్ర కాంక్షను దేశానికి తెలంగాణ ప్రజలు ఘనంగా చాటిచెప్పారు. తెలంగాణ ఇస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం తప్పక అమలుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదే సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మంత్రిగా పనిచేశాను. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి మంత్రిగా సేవలందించాను. ఇదీ నా రాజకీయ ప్రస్థానం.

-కేటీఆర్​, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి

యూపీఎస్ పరీక్షలకు తన తండ్రి కేసీఆర్ సూచనతో ముందు దిల్లీకి వెళ్లానని.. అప్పుడు జేఎన్​యూ విశ్వవిద్యాలయం గోడల మీద రాసిన.. " ప్రజాస్వామ్యాన్ని రాజకీయాలు నిర్ణయిస్తున్నప్పుడు.. భవిష్యత్ రాజకీయలను నువ్వు నిర్ణయించు".. అన్న వాక్యాలు తన ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చాయని కేటీఆర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్రల్లో ఉన్న ప్రభుత్వాలే సామాన్యుని జీవితాన్ని నిర్ణయిస్తున్నాయన్నారు. యూపీఏ నుంచి కేసీఆర్ బయటికి వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు.. తన తండ్రికి చెప్పకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయడం ప్రారంభించానన్నారు. గీతం విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన రాజకీయ ప్రస్థానం గురించి విద్యార్థులకు వివరించారు.

ఏడేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతి

తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు.. వాటి ప్రభావం గురించి కేటీఆర్... విద్యార్థులకు వివరించారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక అనుమానాలు, సమస్యలు ఉన్నాయని.. ఏడేళ్లలో సవాళ్లను అధిగమించామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా... రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని మూడున్నర సంవత్సరాల్లో నిర్మించామని... రైతుబంధు ద్వారా రైతు ఆత్మహత్యలు నివారించామని.. సంక్షేమ పథకాలు, నీటి పారుదల ప్రాజెక్టుల వల్ల వలసలు సైతం తగ్గాయని వెల్లడించారు. దేశంలో వరి అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని విద్యార్థులకు తెలిపారు.

దేశానికే ఆదర్శంగా..

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు వంటి అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వచ్చే ఐదారేళ్లలో రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు చేసిన నిధుల వల్ల ఎకనామీ అభివృద్ధి చెందుతుందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95శాతం రిజర్వేషన్

ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఉపాధి కల్పనని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి టీఎస్ ఐపాస్​తో పరిశ్రమల స్థాపనకు సులభతర విధానాన్ని తీసుకొచ్చామన్నారు. దీని వల్ల ఏడేళ్లలో 2.2లక్షల కోట్లు పెట్టుబడులు రావడంతో పాటు.. 15లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన పెడితే అవి వెనక్కిపోతున్నాయని తెలిపారు. జోనల్ వ్యవస్థ పూర్తైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.

చివరిగా ఒక్కమాట..

ఓటమికి భయపడొద్దని.. ఓటమిని సైతం సెలబ్రేట్ చేసుకోవాలని.. విజయం సాధించే వరకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు.

ఇదీ చూడండి: KTR TWEET: బండి సంజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

Last Updated :Aug 18, 2021, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.