Dharani: పాసుపుస్తకాల కోసం అయిదు లక్షల మంది ఎదురుచూపు

author img

By

Published : Sep 16, 2021, 8:17 AM IST

Dharani

ఒకరి పేరున అదనంగా నమోదైన భూమిని తిరిగి అర్హుడైన రైతుకు అప్పగించి సమస్యను పరిష్కరించడం అధికారుల విధి. దీనికి బదులు ధరణి పోర్టల్‌ వేదికగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారానే భూ యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయంటూ అధికారులు సూచిస్తుండటం... సమస్య జటిలంగా మారిన తీరుకు అద్దం పడుతోంది.

రాష్ట్రంలో భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) అనంతరం భూసమస్యలు ఎక్కువవుతున్నాయి. యాజమాన్య హక్కుల సమస్యలను నేరుగా పరిష్కరించాల్సినచోట కొద్దిరోజులు వాట్సప్‌, మెయిల్‌, మరికొద్ది రోజులు మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ రెవెన్యూశాఖ రైతులను ఇబ్బందులు పెడుతోంది. 2017 సెప్టెంబరులో ప్రభుత్వం ఎల్‌ఆర్‌యూపీ కార్యక్రమం పేరుతో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఐదేళ్లు గడుస్తున్నా సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. పార్ట్‌-బి రైతులతో పాటు మ్యుటేషన్లు, వివిధ సమస్యలతో పుస్తకాలు అందనివారు దాదాపు 5 లక్షల మంది ఉంటారని తాజా అంచనా. భూపరిపాలన అనేది రెవెన్యూశాఖ విధుల్లో కీలకం. కానీ, ఇప్పుడు రాబడే ప్రధానంగా మారింది. గతేడాది నుంచి నిర్దిష్ట రుసుంతో ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు తహసీల్దారు నుంచి జిల్లా కలెక్టర్‌, సీసీఎల్‌ఏ వరకు భూసమస్యలపై దృష్టి సారించేవారు. ఇతరుల ప్రమేయం లేకుండా భూలావాదేవీలు జరగాలని ప్రభుత్వం ధరణిని ఏర్పాటు చేయడం మేలైనప్పటికీ సమస్యలను పరిష్కారానికి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్‌కు మాత్రమే ఈ బాధ్యతను అప్పగించడంతో గ్రామాల రైతులు నిత్యం జిల్లా కేంద్రం చుట్టూ తిరగలేకపోతున్నారు.

ఖమ్మం జిల్లాలో దాదాపు 2 వేల మంది రైతుల సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో చేరాయి. వారికి కొత్త పాసుపుస్తకం ఉంది. రైతుబంధు కూడా వస్తోంది. కొందరు భూముల విక్రయానికి మీసేవా కేంద్రానికి వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది.

కె.మడప్ప

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్‌ గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కె.మడప్ప. ఈయనకు 80, 121, 122 సర్వే నంబర్లలో 4.30 ఎకరాల భూమి ఉంది. కొత్త పాసుపుస్తకాల జారీ సమయంలో మరో 1.06 ఎకరాలు అదనంగా చేర్చి 5.36 ఎకరాలున్నట్లు ఇచ్చారు. ఈ విషయాన్ని మడప్ప అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు తప్పును సరిచేయ కుండా... మడప్ప భూమి మొత్తానికి కోతపెట్టి, అదే ఊరికి చెందిన రైతు యాదుల్లాకు 5.36 ఎకరాలకు పట్టా జారీ చేశారు. దీన్ని సరిదిద్దాలంటూ 2019 నుంచి మడప్ప అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ముప్పై ఏళ్ల కిందట ఓ యజమాని నుంచి కొందరు రైతులు 53 ఎకరాలు కొనుగోలు చేయగా కొత్త పాసుపుస్తకాల జారీలో పాత యజమాని పేరే ఉంది. ఈ సమస్య మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌సాగర్‌ మండలం అంకిళ్ల రైతులది.

ఇవీ ప్రధాన సమస్యలు

  • ప్రభుత్వ భూములున్న సర్వే నంబర్లలోని రైతుల భూములు నిషేధిత జాబితాలో (22ఎ) పెట్టారు. ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఈ తరహావి వేలాదిగా ఉన్నాయి.
  • భూసేకరణ ప్రక్రియలో ఒక సర్వే నంబరులో కొంత భూమిని సేకరించాక మిగిలిన భూమిని కూడా బ్లాక్‌ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఈ సమస్యలు ఉన్నాయి.
  • ఇద్దరు రైతులు కలసి కొన్న భూమిని విక్రయించుకోలేని పరిస్థితి. సంయుక్త రిజిస్ట్రేషన్‌కు ధరణిలో అవకాశం కల్పించడం లేదు.
  • ధరణిలో కొత్తగా మ్యుటేషన్‌ పూర్తిచేస్తున్న భూములకు లింక్‌ డాక్యుమెంట్‌ నంబరు ఉండటం లేదు.
  • భూముల సర్వే సంఖ్యలు, సరిహద్దుల కొలతలు తప్పుగా ఉన్నా వాటిని మార్చుకోవడానికి వీలుండటం లేదు. కలెక్టర్లకు దరఖాస్తు చేసినా స్పందన కనిపించడం లేదు.
  • భూయజమాని మరణిస్తే గతంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఉమ్మడిగా విక్రయించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు చట్టబద్ధమైన హక్కుదారుడు మాత్రమే విక్రయించేలా మార్పు చేశారు. చట్టబద్ధతకు వారసులు ఇబ్బంది పడుతున్నారు.
  • ధరణిలో ఇప్పటికీ పలు సర్వే నంబర్లు కనిపించడం లేదు. ఆ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ సమస్య ఉంది.
  • వారసత్వ బదిలీ ప్రక్రియలో ప్రతి సర్వే నంబరును రెండుగా చేస్తున్నారు. వారసుల వీలును బట్టి చేరో సర్వే నంబరు తీసుకోవాలనుకుంటే ఆ మార్గం ధరణిలో లేదని అధికారులు తిరస్కరిస్తున్నారు.
  • పట్టా భూమికి మాత్రమే పాసుపుస్తకం జారీ చేసిన అధికారులు ఎసైన్డ్‌ విస్తీర్ణాన్ని ఎక్కించడం లేదంటూ జిల్లాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి.
  • ఇనామ్‌, ఎసైన్డ్‌ భూముల సర్వే నంబర్లు, ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉండగా ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు.
  • 20 ఏళ్ల కిందట మాజీ సిపాయిలకు ప్రభుత్వం కేటాయించిన భూమి చేతులు మారినా రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. ఆ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

ఇదీ చూడండి: మద్దతు ధరతోనే.. రైతు భద్రతకు రాజమార్గం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.