ETV Bharat / state

Cabinet Sub Committee: 'నవతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించాలి'

author img

By

Published : May 6, 2022, 5:08 AM IST

Cabinet Sub Committee: కొత్త తరాన్ని సాగురంగం వైపు మళ్లించేలా వ్యవసాయశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... సిద్దిపేట జిల్లా ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో సమావేశమైంది. రాష్ట్రంలో సాగు రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై మంత్రులు చర్చించి... పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక సాగు విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని... ఇందుకోసం మరింత పరిశోధన అవసరమని అభిప్రాయపడ్డారు.

Cabinet
Cabinet


Cabinet Sub Committee: వ్యవసాయరంగంలో అనుసరించాల్సిన విధానాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశం... మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన శ్రీ కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు... వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చేరుకున్న మంత్రుల బృందం అక్కడ... మామిడి, శ్రీగంధం, నిమ్మ తోటలను పరిశీలించారు. అనంతరం ఆయిల్ ఫాం మొక్కలను నాటారు. ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన కేటీఆర్.. వాటిని పరిశీలించారు.

చైనాలో సాధ్యం.. మోదీ విఫలం: రైతుల ఆదాయం రెట్టింపు కేవలం చైనాలో మాత్రమే సాధ్యమైందని... ప్రపంచంలో మరెక్కడా సాధ్యం కాలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ విఫలమయ్యారన్నారు. దేశంలోని 60- 65 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడిందని... కానీ దేశ జీడీపీలో దాని వాటా 15 శాతం దాటడం లేదని కేటీఆర్ అన్నారు. సాగులో రైతుకు ఆదాయం పెంచే మార్గాలను ఆలోచించాలని... చైనా, ఇజ్రాయిల్‌లో అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా పంటలు యూనిట్‌గా శాస్త్రీయంగా కొత్త విధానం తీసుకురావాలన్నారు.

పర్యటనలు: వ్యవసాయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో ఉబర్, ఓలా తరహా సేవలు అందుబాటులోకి వస్తే... విప్లవాత్మక మార్పుకు నాంది అవుతుందన్నారు. రాష్ట్రంలో పప్పు, నూనెగింజల పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం చేయడం నామోషీ కాదన్న భావన మన యువతలో వచ్చేలా ప్రయత్నం చేయాలని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతువేదికల్లో ఐటీశాఖ సహకారంతో అన్నదాతలకు వ్యవసాయంలో మెళకువలు నిర్పిస్తామన్నారు. వ్యవసాయరంగంలో అనుసరించాల్సిన విధానాల రూపకల్పనలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం త్వరలో దేశవిదేశాల్లో పర్యటించనుంది.

ఇదీ చదవండి: 13 శస్త్రచికిత్సలు.. 100కు పైగా ఫ్రాక్చర్స్​.. వైకల్యాన్ని ఎదుర్కొని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.