ETV Bharat / state

Niranjan reddy: 'నానో యూరియాతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు'

author img

By

Published : Jul 31, 2021, 5:07 PM IST

nano urea
నానో యూరియా

గుజరాత్​లోని కలోల్​లో ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి సందర్శించారు. ఎరువుల వాడకంలో సంప్రదాయ పద్ధతుల వల్ల నష్టపోతున్న రైతులకు నానో ఎరువులు దోహదపడతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ల స్థాపనకు ఇఫ్కో యాజమాన్యం వద్ద ప్రతిపాదనలు తెచ్చారు.

ఇఫ్కో(భారత రైతుల సహకార సంస్థ) ఆవిష్కరణ... నానో యూరియా సాధారణ రైతుబిడ్డ విజయం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కలోల్‌లో ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఇఫ్కో వైస్ ఛైర్మన్, జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ అధిపతి ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేష్ రాలియా ఘనస్వాగతం పలికారు.

nano urea, iffco
ఇఫ్కో బృందంతో మంత్రి నిరంజన్​ రెడ్డి

విప్లవాత్మక మార్పునకు శ్రీకారం

ఇఫ్కో యూనిట్‌లో రోజుకు లక్షా 50 వేల నానో యూరియా బాటిళ్ల ఉత్పత్తిని మంత్రి పరిశీలించారు. రోజుకు 67 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం తీరు తిలకించారు. దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యం వద్ద మంత్రి ప్రతిపాదించగా... ఈ అంశం ఇఫ్కో బోర్డు సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వపరంగా భూమితోపాటు ఇతర సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అండతో అన్ని రకాల సహకారాలు అందిస్తామని నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు. కశ్మీర్- కన్యాకుమారి, ముంబయి- విజయవాడ, కోల్‌కతా జాతీయ రహదారులు సౌలభ్యం సహా మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎరువుల వాడకంలో సాంప్రదాయ పద్ధతుల వల్ల నష్టపోతున్న రైతులను నానో ఎరువుల వైపు మళ్లిస్తే విప్లవాత్మక మార్పు మొదలవుతుందని నిరంజన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

nano urea, iffco
నానో యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్​ రెడ్డి

నానో టెక్నాలజీదే

500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియాను 127 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే ఎకరాకు సరిపోతుందని... కేవలం రూ. 240 రూపాయలకు లభించే ఈ సీసా వల్ల ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున రాయితీ భారం తప్పుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇఫ్కో ప్రపంచంలోనే అతిపెద్దది... మనది కావడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఇఫ్కో సంస్థ పరిశోధనల నుంచి ప్రపంచ పేటెంట్ కలిగిన నానో యూరియా రావడం, దానిని ప్రపంచానికి అందించడం.. మన దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుందని తెలిపారు. ఇది వ్యవసాయంలో ఎరువుల వాడకంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుందని... భవిష్యత్తు అంతా నానో టెక్నాలజీదేనని స్పష్టం చేశారు.

నానో యూరియాతో భూసారం పెరగడంతోపాటు పంట దిగుబడి శాతం సాధారణం కన్నా 8 శాతం అధికంగా ఉంటుందని పరిశోధనల్లో తేలిందని మంత్రి ప్రకటించారు. నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త రమేష్ రాలియాను మంత్రి అభినందించారు. శాస్త్రవేత్తలు, అధికారులను సన్మానించారు.

ఇదీ చదవండి: RS PRAVEEN KUMAR: 'లక్షల మంది గుండెల్లో నేనున్నా.. ఏం చేస్తారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.