ETV Bharat / state

భాగ్యనగర వాసులకు శుభవార్త.. ఇక రిజిస్ట్రేషన్‌ సమస్యకు చెక్‌!

author img

By

Published : Nov 2, 2022, 10:52 PM IST

KTR on GO 118: హైదరాబాద్‌ ఎల్​బీ నగర్‌ నియోజకవర్గం పరిధిలోని 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, యూఎల్​సీ సమస్యలకు సంబంధించి 22 ఏ సెక్షన్ సవరణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జీవో 118 ద్వారా నామమాత్ర రుసుముతో క్రమబద్దీకరిస్తామని స్పష్టం చేశారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో మన నగరం కార్యక్రమ వేదికగా ప్రభుత్వ ఉత్తర్వులపై కేటీఆర్ ప్రకటించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాస సర్కార్‌ పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.

KTR
KTR

KTR on GO 118: నగర వాసులకు శుభవార్త. 15ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌, యూఎల్‌సీ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపింది. ఆరు నియోజకవర్గాల పరధిలోని కొన్ని సర్వే నంబర్లను 1998లో 22ఏ (నిషేధిత భూముల) జాబితాలో చేర్చారు. 2008లో ఈ విషయం గుర్తించిన రిజిస్ట్రేషన్లశాఖ అప్పటి నుంచి ఈ సర్వే నంబర్లలోని భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో రిజిస్ట్రేషన్లు జరగక భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

22ఏ జాబితా నుంచి తమ భూములను తొలగించాలని బాధితుల కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 118 ద్వారా నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరిస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. గత నెల 28న విడుదలైన ప్రభుత్వ జీవో 118 ప్రతిని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు ప్రజల హర్షధ్వానాల మధ్య అందజేశారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో ‘మన నగరం’ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గజం రూ.250 చొప్పున ఇంటి స్థలాల భూములు రిజిస్ట్రేషన్‌ ద్వారా క్రమబద్దీకరణ చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. 100 నుంచి వెయ్యి గజాల వరకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. తాజా ఉత్తర్వుల ద్వారా ఎల్బీనగర్‌, నాంపల్లి, కార్వాన్‌, జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌ వంటి 6 నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మేలు జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని మొత్తం 44 కాలనీలకు ఈ క్రమబద్ధీకరణ వెసులుబాటు కలిగిందని ప్రకటించారు. 'మేం చేయగలిగిందే చెబుతాం.. ఇది మీ ప్రభుత్వం’ అని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు.

పేదలు, మధ్యతరగతి కుటుంబాల్లో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం ఎల్బీనగర్‌ చౌరస్తా ఎలా ఉండేదన్న కేటీఆర్.. ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందింది అని గుర్తు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.1200 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించామన్నారు. రూ.800 కోట్లు తాగు నీటి కోసం ఖర్చు చేశామని, నాలాల అభివృద్ధి కోసం మరో రూ.1030 కోట్లు వెచ్చించామని కేటీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.