ETV Bharat / state

ఫీజుల చెల్లింపుపై 10 లక్షల మంది తల్లిదండ్రుల వెనకడుగు

author img

By

Published : Oct 2, 2020, 6:51 AM IST

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న లక్షల మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం చదువుకు దూరమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న ప్రైవేటు పాఠశాలలకు ఆన్‌లైన్‌ విద్య అందించే స్థోమత లేకపోవడం.. ఒకవేళ యాజమాన్యాలు ముందుకొచ్చినా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న కారణంగా నాలుగు నెలలుగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు విద్యాబోధన దూరమైంది.

corona effect on students education
ఫీజుల చెల్లింపుపై 10 లక్షల మంది తల్లిదండ్రుల వెనకడుగు

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న లక్షల మంది విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం చదువుకు దూరమయ్యారు. కార్పొరేటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, మరికొన్ని రాష్ట్ర విద్యాశాఖ గుర్తింపు ఉన్న ప్రైవేటు పాఠశాలలు జూన్‌ నుంచే ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాయి. వాటిలో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది ఉన్నత, మధ్యతరగతి పిల్లలే ఉంటారు.

సర్కారు పాఠశాలల్లో సెప్టెంబరు 1 నుంచి వారానికి అయిదు రోజులపాటు టీవీల ద్వారా పాఠాలను ప్రసారం చేస్తున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందల చిన్న ప్రైవేటు పాఠశాలల్లో చదివే పేద, దిగువ మధ్యతరగతి, కొందరు మధ్యతరగతి పిల్లలకు మాత్రం పాఠాలు చేరడం లేదు. ఈ పాఠశాలలకు ఆన్‌లైన్‌ విద్య అందించే స్థోమత లేకపోవడం.. ఒకవేళ యాజమాన్యాలు ముందుకొచ్చినా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న కారణంగా నాలుగు నెలలుగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకు విద్యాబోధన దూరమైంది.

60-70 శాతం పాఠశాలల్లో పాఠాలు ప్రారంభించినా..

రాష్ట్రవ్యాప్తంగా జులై నాటికి 60-70 శాతం ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాయి. 15-30 రోజులపాటు రోజుకు దాదాపు రెండు గంటలు తరగతులు నడిపిన అనంతరం ఫీజులు అడిగాయి. ఫీజులు చెల్లించేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చలేదు. కొన్ని యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ లింకు ఇస్తామని తేల్చిచెబుతున్నాయి. ఫీజుల కోసం ఫోన్లు చేస్తుండటంతో చాలామంది ఆన్‌లైన్‌ చదువుకు మొగ్గు చూపడం లేదు. కొన్ని పాఠశాలల్లో నెల రోజుల్లోనే బోధన నిలిపివేశారు.

'ఆన్‌లైన్‌లో 50 శాతం కూడా చదువు నేర్చుకోవడం కష్టం. 100 శాతం ఫీజు ఎందుకని ఎక్కువమంది భావిస్తున్నారు' అని నిజామాబాద్‌ జిల్లా వర్నికి చెందిన ఓ పాఠశాల యజమాని జనార్దన్‌ చెప్పారు. తమ పాఠశాలలో 30-40 శాతం మందే ఆన్‌లైన్‌లో పాఠాలకు లింకు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాలు, మరికొన్ని మండల కేంద్రాల్లో కలిపి 60 శాతం బడులే ఆన్‌లైన్‌ పాఠాలు నడుపుతున్నట్లు పాఠశాలల సంఘాల అంచనా.

'మా పిల్లలు 2, 6 తరగతులు చదువుతున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలకు ఫీజు చెల్లించడం ఇష్టం లేదు. ఒకవేళ పాఠశాల తెరిచినా అక్కడ ఒక్కటే శౌచాలయం ఉంది. కరోనా తీవ్రతను బట్టి పిల్లలను బడికి పంపించడంపై నిర్ణయం తీసుకుంటాను' అని కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఒకరు చెప్పారు. పాఠశాలలు తెరుచుకోకపోవడంతో పాఠ్యపుస్తకాలనూ చాలామంది కొనలేదు. మొత్తం పుస్తకాల్లో సుమారు 14 శాతం మాత్రమే అమ్ముడుపోయాయని ప్రైవేటు ముద్రణదారులు తెలిపారు. ప్రతి విద్యార్థి ఆన్‌లైన్‌ విధానంలోనైనా చదువుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తే చాలామంది ముందుకు వస్తారని తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదల సతీశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో పరిస్థితి ఇలా..

  • మొత్తం ప్రైవేటు పాఠశాలలు: 11 వేలు (అన్ని బోర్డుల పరిధిలోనివి)
  • విద్యార్థుల సంఖ్య: 32 లక్షలు
  • ఆన్‌లైన్‌ తరగతులు నడుపుతున్నవి: దాదాపు 7 వేలు
  • వాటిల్లో విద్యార్థులు: దాదాపు 25 లక్షలు (వీరిలోనూ 10-15 శాతం మంది ఆన్‌లైన్‌ లింకు తీసుకోలేదు)
  • చదువుకు దూరంగా ఉన్నవారు: సుమారు 10 లక్షల మంది

గత ఏడాదికి సంబంధించిన బకాయి ఫీజులు అడిగితే విద్యార్థుల తల్లిదండ్రులు డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని ప్రభుత్వం చెప్పింది. అయిదు నెలలు గడిచినా రుసుములు చెల్లించండని చెప్పడం లేదు. దాంతో తల్లిదండ్రులూ ఫీజులు చెల్లించడం లేదు. చాలామంది తమ పిల్లల్ని సొంతూళ్లకు పంపించారు. పదో తరగతి వారిని మాత్రం చదివిస్తున్నారు. ప్రతి పాఠశాల ఆన్‌లైన్‌ బోధనను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం సూచించలేదు.

డాక్టర్‌ జేఎస్‌ పరంజ్యోతి, సలహాదారు, ట్రస్మా

జూన్‌ నెలాఖరులో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాం. ఇప్పటికీ 10-15 శాతం మంది విద్యార్థులే హాజరవుతున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేకపోవడం ఒక కారణం. ఆన్‌లైన్‌ పాఠాలకు హాజరైతే ఫీజు చెల్లించాల్సి వస్తుందని కొందరు పంపించడం లేదు. పదో తరగతిలో మాత్రం 90 శాతం మంది ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. బడులు తెరిస్తేనే పంపిస్తామని ఎక్కువ మంది తల్లిదండ్రులు చెబుతున్నారు.

-శ్రీకాంత్‌రెడ్డి, స్లేట్‌ హైస్కూల్‌ యజమాని, జన్నారం, మంచిర్యాల జిల్లా

ఇదీ చదవండిః రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భజలమట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.