ETV Bharat / state

Agri Film Festival - 2022: 'అన్నదాత' కార్యక్రమానికి 'బెస్ట్ లాంగ్వేజ్ ఫిల్మ్' అవార్డు

author img

By

Published : Mar 11, 2022, 9:58 PM IST

Agri Film Festival - 2022
అవార్టు స్వీకరిస్తున్న ఈటీవీ అన్నదాత ప్రోగ్రాం ఇంఛార్జ్ ప్రమీల

Agri Film Festival - 2022: దేశంలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ స్వప్నం త్వరలో నెరవేరబోతుందని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు బీసీ పాటిల్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్​లో జరిగిన మొదటి "అగ్రి ఫిలిం ఫెస్టివల్ - 2022"కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగులో ఈటీవీ అన్నదాతలో ప్రసారమైన ఉయ్యూరులో రొయ్యల సాగులో ఆటోమేటిక్ ఫీడర్ ఆవిష్కరణ ద్వారా లాభాలు అర్జిస్తున్న యువ రైతు కథనానికి ఉత్తమ పురస్కారం వరించింది.

Agri Film Festival - 2022: గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా రైతుల ఇబ్బందులను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు బీసీ పాటిల్ పేర్కొన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్​లో జరిగిన మొదటి "అగ్రి ఫిలిం ఫెస్టివల్ - 2022"కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈటీవీ అన్నదాత కార్యక్రమానికి అవార్డు

తెలుగులో ఈటీవీ అన్నదాతలో ప్రసారమైన ఉయ్యూరులో రొయ్యల సాగులో ఆటోమేటిక్ ఫీడర్ ఆవిష్కరణ ద్వారా లాభాలు అర్జిస్తున్న యువ రైతు కథనానికి ఉత్తమ పురస్కారం వరించింది. ఈ పురస్కారం కర్ణాటక మంత్రి చేతుల మీదుగా స్వీకరించిన అన్నదాత ప్రోగ్రామ్ ఇంఛార్జి ప్రమీల స్వీకరించారు. దేశవ్యాప్తంగా 10 భాషల నుంచి మొత్తం వ్యవసాయ లఘు చిత్రాలు సంబంధించి 273 ఎంట్రీలు రాగా సూక్ష్మంగా పరిశీలించి 16 ఉత్తమ కథనాలను ఎంపిక చేశారు.

జమ్మూ నుంచి డోంగ్రి భాషలో ప్రశాంత్ బక్షి రూపొందించిన స్ట్రాబెర్రీ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు ఉత్తమ పురస్కారం లభించింది. జ్యూరీ పుర్కారాల్లో పర్యావరణహిత లింగాకర్షక బుట్టల వినియోగంపై రూపొందించిన లఘుచిత్రం, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల క్రమబద్ధీకరణ, నిర్వహణపై కథనం, స్మార్ట్ అగ్రికల్చర్‌పై చిత్రీకరించిన లఘుచిత్రం... ఇలా వరుసగా మూడు ఉత్తమ చిత్రాలకు 50, 30, 15 వేల రూపాయల చొప్పున నగదు, ప్రశంస పత్రాలను మంత్రి అందజేశారు.

పోలీసు ఉద్యోగం వదిలేసి వచ్చా

కర్ణాటకలో వ్యవసాయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చానని.. పోలీసు అధికారి ఉద్యోగం వదిలేసి 2004లో రాజకీయాల్లోకి వచ్చి సేద్యంలో యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించానని తెలిపారు. యడ్యూరప్ప హయాంలో తనకు అటవీ శాఖ ఇస్తే వద్దని కోరి వ్యవసాయ శాఖ తీసుకున్నానని చెప్పారు. రైతులే నిజమైన కథానాయకులని... రైతులేనిదే రాజ్యం లేదన్నారు. సీఎం వద్ద తాను చేసిన ప్రతిపాదన మేరకు రైతుల పిల్లలకు విద్యా సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, డిగ్రీ, పీజీ, ఇతర ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్న దృష్ట్యా కోటి మంది రైతుల పిల్లలు లబ్ధిపొందుతున్నారన్నారు. రైతుల ఇబ్బందులు స్వయంగా తెలుసుకునేందుకు "రైతులతో ఒక రోజు" కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్రశేఖర, కర్ణాటక వ్యవసాయ శాఖ కమిషనర్ నందిని కుమారి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎండీ డాక్టర్ కె.కేశవులు, టీఎస్ అగ్రోస్ సంస్థ ఎండీ కె.రాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.

'నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చా. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల బాధల గురించి నాకు తెలుసు. వారికోసమే నేను వ్యవసాయశాఖను తీసుకున్నా. రైతుల ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నాను. వ్యవసాయ కుటుంబాల్లో పిల్లలకు విద్యాసంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.' - బీసీ పాటిల్, కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి

'అన్నదాత కార్యక్రమానికి బెస్ట్ లాంగ్వేజ్ ఫిల్మ్​గా మేనేజ్ వాళ్లు అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇదీ రైతుల విజయం. ఈ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అన్నదాత కార్యక్రమం గౌరవనీయులైన మా ఛైర్మన్ రామోజీ రావు మానస పుత్రిక. అన్నదాతలకు సేవ చేయాలన్న సంకల్పం ఆయన ఆశయం అన్నదాత ద్వారా నెరవేరింది. భవిష్యత్తులో రైతుల కోసం ఈ కార్యక్రమాన్ని రైతులు బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నా.' - ప్రమీల, ఇంఛార్జి, అన్నదాత ప్రోగ్రాం, ఈటీవీ

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.