CM KCR Meets Chinna Jeeyar Swamy: చినజీయర్‌ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్.. ఆ విషయంపైనే చర్చ!

author img

By

Published : Oct 11, 2021, 12:43 PM IST

Updated : Oct 11, 2021, 7:48 PM IST

cm-kcr-met-chinjiyar-swami-at-muchhinthal-ashram

12:40 October 11

చినజీయర్‌ స్వామిని కలిసిన సీఎం

చినజీయర్‌ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో త్రిదండి శ్రీరామనుజ చినజీయర్ స్వామిని కలిశారు. సతీమణి శోభ, కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ జీవా ఆశ్రమానికి వెళ్లారు. వేదపండితులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కించిన జీయర్‌ స్వామి... అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.  

యాదాద్రి పునఃప్రారంభంపై చర్చ

జీవా ప్రాంగణంలోని కుటీరంలో చినజీయర్‌ స్వామితో  కేసీఆర్‌ సమావేశమయ్యారు. భగవత్‌ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు, ఫిబ్రవరిలో జరగబోయే ప్రారంభోత్సవ ప్రాజెక్టు వివ‌రాల‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ విషయమై కూడా చర్చించారు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభం విషయమై కూడా ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఆలయాన్ని నవంబరు నెలాఖరు లేదా డిసెంబరులో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ప్రారంభోత్సవ ముహూర్తం, ప్రారంభ సందర్భంగా చేపట్టాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కేసీఆర్, జీయర్ స్వామి చర్చించినట్లు తెలిసింది.

మొక్కలు నాటిన కేసీఆర్​, చినజీయర్​ స్వామి

అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామి జమ్మి మొక్కలు నాటారు. జీయర్ స్వామిని కలిసేందుకు కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని జీవా ఆశ్రమానికి వెళ్లారు. స్వామితో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని జమ్మి మొక్కను నాటారు. 

పండుగలో జమ్మి చెట్టు భాగం

"వృక్షో రక్షతి రక్షిత:” అని పెద్దలు చెబితే ఆధునిక మానవుడు చెట్లను కొట్టేస్తూ... కొండలను తవ్వేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడని చినజీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారని చెప్పారు. భగవంతుడే జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి ఆరాధన చేసి, తమ ఆయుధాలను చెట్టుపై పెట్టి పూజించి మనకు పండుగలో చెట్టును భాగం చేశారని వివరించారు. ఈ కారణంగానే పూర్వీకులు జమ్మిని రాణిగా పిలిచారని, దోషాలను శమింపచేసేదిగా జమ్మికి ప్రాధాన్యత కల్పించారని పేర్కొన్నారు.  

ఎంపీ సంతోష్​కు అభినందనలు

అనాదిగా పూర్వీకులు అందించిన గొప్ప సదాశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా కోట్లాది మొక్కలు నాటిస్తున్నారని చినజీయర్​ అభినందించారు. హైందవ సంప్రదాయంలో ప్రాధాన్యత కలిగిన జమ్మి చెట్టును జాతీయస్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న సదాశయానికి శ్రీమన్నారాయణమూర్తి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తు కార్యక్రమాలు దిగ్విజయం కావాలని ఆశీర్వదించారు. స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తానని ఎంపీ సంతోష్​ అన్నారు.  

ఇదీ చూడండి:  Yadadri Temple News: యాదాద్రిపై ప్రధాని ప్రశంసలు.. పునఃప్రారంభంపై సీఎం క్లారిటీ

Last Updated :Oct 11, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.