ETV Bharat / state

Project madad: ఎన్ని వేవ్​లు వచ్చినా.. కొవిడ్​ను ఎదుర్కోవడానికి ఆ గ్రామం రెడీ.!

author img

By

Published : Aug 21, 2021, 10:31 AM IST

కరోనా రెండు, మూడు దశలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఎంతో మంది ప్రాణాల్ని బలితీసుకున్నాయి. కానీ ఆ గ్రామస్థులు మాత్రం భయపడలేదు. కొవిడ్​ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వారి గ్రామంలో కరోనాతో ఒక్కరు మాత్రమే చనిపోయారంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇదేంటి ఇకముంది ఎన్ని దశలు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధమని చెబుతున్నారు. అంతలా వారు జాగ్రత్తలు పాటించారు. వారి విజయ రహస్యంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

rajanna peta
రాజన్న పేట

కొవిడ్‌ను తట్టుకుని తిరిగి పూర్వస్థితికి రాగల సామర్థ్యం ఉన్న గ్రామంగా రాజన్నపేట ప్రాచుర్యం పొందుతోంది. విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి డాక్టర్ల బృందం సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం ఇప్పుడు కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి యథాస్థానంలో నిలబడే స్థాయికి చేరింది. ఇక ముందు ఎన్ని కరోనా దశలు వచ్చినా మేం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న విశ్వాసం గ్రామప్రజల్లో కనిపిస్తోంది. మన కంటే ముందే అమెరికా కరోనా వల్ల గడ్డు పరిస్థితులను చవి చూసింది. అమెరికాలో కొవిడ్ చికిత్స, నిర్వహణలో తమ అనుభవాలు మాతృదేశానికి అందించాలని అక్కడ స్థిరపడిన 15మంది తెలుగు వైద్యులు, ఇతర ప్రాంతాల్లోని తమ మిత్రులతో కలిసి 'ప్రాజెక్ట్ మదద్'ను ప్రారంభించారు.

rajanna pet
వర్చువల్​లో సమావేశమై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న ప్రాజెక్ట్​ మదద్​ సిబ్బంది

మే, జూన్, జులై మాసాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 1500 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అధికారులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు అమెరికా నుంచి 'జూమ్' ద్వారా వారంలో రెండుసార్లు వర్చువల్ విధానంలో కొవిడ్‌ను ఎదుర్కోవాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో పది కంటే ఎక్కువ కేసులు బయటపడిన తెలంగాణలోని రాజన్నపేట గ్రామాన్ని కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు.

rajanna peta
ఇంటింటికీ మాస్కుల అందిస్తున్న ఆశా వర్కర్లు

ఐదంచెల వ్యూహంతో

కొవిడ్​ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు "ప్రాజెక్ట్ మదద్" అనేక ప్రయోగాలను చేసింది. సాంకేతిక పరిజ్ఞానం విరివిగా ఉపయోగించింది. చివరకు ఐదు అంచెల వ్యూహం అమలు చేసింది. అందులో భాగంగా గ్రామీణ వైద్య సహాయకుల్లో కరోనాపై అవగాహన, ఆత్మస్థైర్యం నింపడం, గ్రామస్థులకు కొవిడ్ ప్రోటోకాల్‌పై అవగాహన కల్పించడం, కొవిడ్‌పై నెలకొన్న అపోహలు, దుష్ప్రచారాలపై స్థానిక భాషలో సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, కొవిడ్ రోగుల పర్యవేక్షణ, సమాచారం ఒకే దగ్గర క్రోడీకరించే విధంగా డ్యాష్‌బోర్డు రూపలకల్పనతో పాటు అందరికీ టీకాల పంపిణీ చేపట్టారు.

rajannapet
ఊరి సరిహద్దుల్లోనే రాపిడ్​ పరీక్షలు

కరోనా పట్ల విస్తృత ప్రచారం

గ్రామంలో పోస్టర్లను విరివిగా అంటించారు. కొవిడ్ రోగులకు దగ్గరలో చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, వాటిలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్‌ల వివరాలు మదద్‌ మ్యాప్స్ రూపంలో అందించారు. కొవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్ వివరాలు అన్నీ ఒకే చోట వైద్య శాఖకు అందుబాటులో ఉండేలా మదద్​ కేర్ డాట్ కామ్ రూపంలో డాటా బేస్‌ను రూపొందించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్దకు రాలేని వారికి ఇళ్ల వద్దకే వెళ్లి టీకాలను వేశారు. అల్మాస్‌పూర్‌, గొల్లపల్లి మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి రాపిడ్ టెస్టులను నిర్వహించాకే లోనికి అనుమతించారు.

గర్భిణులకు మినహా అందరికి టీకా

rajanna pet
ఇంటింటికీ మాస్కులు, కరోనా టెస్టు కిట్ల పంపిణీ

రాజన్నపేటలో మొత్తం ఇళ్లు 440కాగా జనాభా1523 మంది. ఇందులో కరోనా టీకాకు అర్హత కలిగిన వారి సంఖ్య 1120 మంది. గ్రామంలో ప్రాజెక్ట్ మదద్‌ పని ప్రారంభించే సమయానికే 332మందికి ప్రభుత్వం మొదటి విడత టీకాలను పూర్తి చేసింది. ప్రస్తుతం 1120 మందికి రెండో విడత వాక్సినేషన్ కూడా పూర్తి చేశారు. గ్రామానికి అవసరమైన టీకాలను మొత్తం ప్రాజెక్ట్ మదద్‌ బృందం సమకూర్చింది. ఇప్పుడు కరోనా పట్ల గ్రామస్థులంతా సంపూర్ణ అవగాహన కలిగిఉన్నారు.

గ్రామంలో వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులో రావడం తమకు కలిసి వచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. మొదట్లో ఊళ్లో సంపూర్ణ వ్యాక్సినేషన్ జరుగుతుందని నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు. కొంతమంది టీకాలు వేసుకోవడానికి భయపడ్డారు. అయితే తాము స్వయంగా టీకాలు వేసుకున్నామని వైద్యసిబ్బంది అవగాహన కల్పించడంతో అందరూ టీకా తీసుకోవడానికి అంగీకరించారు. ఇప్పుడు గ్రామంలో అర్హులందరికీ మొదటి డోస్ పూర్తయిందని రాజన్నపేట ఆశా కార్యకర్త తెలిపారు.

రాజన్నపేటకు అందరి సహకారం

రాజన్నపేట ప్రయోగం విజయవంతం కావడం వెనుక జిల్లా అధికార యంత్రాంగం కృషి తోడైంది. ప్రాజెక్ట్ మదద్​కు అవసరమైన అన్ని రకాల అనుమతులను ఇచ్చారు. రాజన్నపేట భవిష్యత్తులో కొవిడ్‌ను తట్టుకొని నిలబడుతుందన్న నమ్మకం తమకు ఏర్పడిందని సర్పంచ్​ ముక్కశంకర్ చెప్పారు. అందరికీ శానిటైజర్లు, సర్జికల్‌, ఎన్‌95 మాస్కులు, థర్మామీటర్లు, ఆక్సీపల్స్‌ మీటర్లు, సెల్ఫ్‌ కొవిడ్ టెస్ట్‌ కిట్లు అందించారు.

వైద్యసిబ్బంది సహకారం ఎనలేనిది

గ్రామంలో కరోనాతో ఒకరు చనిపోవడంతో భయాందోళన నెలకొందని గ్రామస్థురాలు సరస్వతి చెప్పారు. దీంతో అందరూ సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. వైద్యులు, ఆశాసిబ్బంది సూచనలు విధిగా పాటించామని వివరించారు. ఇప్పటికీ మాస్క్‌ లేకుండా ఎవరూ బయట సంచరించరని.. భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం వల్లే కొవిడ్​ మూడో దశ పట్ల ధీమాగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: cm kcr review: 'సమాన వాటాకోసం బలమైన వాణి వినిపించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.