ETV Bharat / state

Banyan tree: మోడు వారిన మర్రికి ప్రాణం పోసి చిగురింపజేశాడు.. కానీ..

author img

By

Published : Dec 17, 2021, 2:54 PM IST

banyan tree
మర్రి చెట్టు

Banyan tree: చెట్టు జీవరాశికి ప్రాణవాయువు అందిస్తుంది. కానీ ఆక్సిజన్​ ఇచ్చే మహా వృక్షానికే ఆయువు పోశాడు ఓ ప్రకృతి ప్రేమికుడు. భారీ వర్షాలకు కూకటి వేర్లతో సహా కుప్పకూలిపోయిన మర్రి చెట్టును అచేతన స్థితిలో చూడలేని ఆ వ్యక్తి.. రెండు నెలల పాటు శ్రమించి ఆ చెట్టు చిగురించేలా చేశారు.

Banyan tree: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు పేట మండలం సుద్దాల గ్రామ శివారులో ఓ మర్రి చెట్టు ఉంది. మూడు నెలల క్రితం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆ చెట్టు కూకటి వేర్లతో సహా కూలిపోయింది. గ్రామానికి చెందిన బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్​ల వ్యవసాయ భూమిలో ఉన్న ఈ చెట్టు వయసు 70 ఏళ్లు. చెట్టు కూలిపోవడంతో వేర్లకు నీరు అందక కొద్ది రోజులకు మర్రి చెట్టు మోడుగా మారి చూపరులకు నిర్జీవంగా దర్శనమిచ్చింది. అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు.. డాక్టర్ దొబ్బల ప్రకాష్​ను ఈ దృశ్యం కదిలించింది. మొన్నటి వరకూ ఠీవీగా నిలబడి ఎంతో మందికి నీడనిస్తూ, ప్రాణులు, పక్షులకు గూడుగా నిలిచిన మహా వృక్షం.. ప్రకృతి వైపరీత్యానికి నిస్సహాయంగా, నిర్జీవంగా ఉండటం చూసి కలత చెందారు. ఈ చెట్టుకు నీరందించి పునరుజ్జీవం చెందేలా చేయొచ్చని భావించారు.

banyan tree
మర్రి చెట్టుకు నీరందిస్తున్న దొబ్బ ప్రకాశ్​

చిగురించిన ఆశ(కు)లు

అనుకున్నదే తడవుగా ప్రకాశ్..​ రైతులతో తన ఆలోచనను పంచుకున్నారు. మోడు వారిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసి అక్కడి నుంచి మరో చోటికి తరలిస్తానని తెలిపారు. పక్క పొలంలోని బావి నీటిని వాడుకునేందుకు అనుమతి తీసుకున్నారు. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చెట్టుకు నీరందించారు. దీంతో ప్రకాష్​ కృషి ఫలించింది. క్రమంగా చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. ఇది గమనించిన ప్రకాష్ నీరు పోయడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఫలితంగా ఎండిన చెట్టు చిగురించిన ఆకులతో పచ్చగా దర్శనం ఇస్తోంది.

ట్రాన్స్​ప్లాంటేషన్​ చేయాలి

మర్రి చెట్టును తమ గ్రామంలోని పాఠశాలకు తరలించి విద్యార్థులకు నీడ నిచ్చేలా ట్రాన్స్​ప్లాంటేషన్ చేయాలన్నది ప్రకాష్ ఆలోచన. ఈ ప్రక్రియకు చెట్టును ట్రిమ్ చేయడం, లిఫ్ట్ చేయడం, వాహనంలో తరలించడం, తిరిగి నాటడం చేయాలి. అందుకు రూ.50 వేల ఖర్చు అవుతుంది. మర్రి చెట్టుకు ప్రాణమైతే పోయగలిగారు గానీ.. అంత ఖర్చును వెచ్చించే స్తోమత లేకపోవడంతో.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి: MLA Etela Fires on KCR: 'కేసీఆర్​కు.. అధికారం చేతిలో ఉందనే అహంకారం పనికిరాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.