ETV Bharat / international

లేజర్‌ బీమ్‌ ప్రయోగమా? వారసత్వ పోరా? రైసీ మరణంపై ప్రచారంలో కుట్రకోణాలు - Iran President Helicopter Crash

author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 1:36 PM IST

Iran President Death Controversy : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంపై కుట్ర కోణం ఉందంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ప్రమాదం వెనక ఇజ్రాయెల్‌ హస్తం ఉందని ఇప్పటికే ప్రచారం చేస్తుండగా ఇప్పుడు వారసత్వ పోరు రైసీ మరణం వెనక ఉండొచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి. అత్యాధునిక లేజర్‌ భీమ్‌ను అంతరిక్షం నుంచి ప్రయోగించి రైసీ హెలికాఫ్టర్‌ను కూల్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడి మరణంలో అమెరికా పాత్ర ఉందన్న ఆరోపణలను అగ్రరాజ్యం ఖండించింది.

Iran President Death Controversy
Iran President Death Controversy (Associated Press)

Iran President Death Controversy : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలోనే మరణించారని ఆ దేశ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నా, ఆయన మరణంపై ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. బెల్‌ 212 హెలికాప్టర్‌ కూలి ఆదివారం సాయంత్రం ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించడంపై పలు రకాల ప్రచారాలు మొదలయ్యాయి. వారసత్వ పోరు కూడా రైసీ మరణం వెనుక ఉండొచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. వారసత్వ పోరు వల్లే రైసీని కుట్ర పన్ని హతమార్చి ఉంటారని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అత్యాధునిక లేజర్‌ బీమ్‌ను అంతరిక్షం నుంచి ప్రయోగించి రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను కూల్చి వేసి ఉండొచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. కానీ ఇరాన్ దర్యాప్తు బృందం మాత్రం ఈ ఘటనపై ఎక్కువ వివరాలను పంచుకోలేదు.

వారసత్వ పోరుపై అనుమానాలు
ప్రస్తుతం ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ వ్యవహరిస్తున్నారు. ఖమేనీ తర్వాత రైసీ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చనే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఖమేనీ కుమారుడు ముజ్తబా కూడా ఈ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. రైసీ మరణంతో ఖమేనీ వారసత్వం ఆయన కుమారుడైన ముజ్తబాకు దక్కడం ఖాయమని అమెరికా విదేశాంగ శాఖ మాజీ సలహాదారు గాబ్రియన్‌ నోర్నహ ఎక్స్‌లో పోస్టు చేశారు. రైసీ-ముజ్తబా మధ్య ఎప్పటి నుంచో పోటీ నెలకొందని వెల్లడించారు. తాజాగా ఖమేనీ ఇరాన్‌ ప్రజలను ఆందోళన చెందొద్దని చెప్పడం కూడా వారి అనుమానాలు దూరం చేసేందుకే అని నోర్నహా అన్నారు. గాబ్రియన్‌ నోర్నహా చేసిన పోస్ట్‌తో ఇబ్రహీం రైసీ మరణం వెనక ఖమేనీ కుమారుడు ఉన్నాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖమేనీ వయస్సు 85 ఏళ్లు. మరి కొన్నేళ్లల్లో ఖమేనీ స్థానంలో ఇరాన్‌ సుప్రీం నేతను ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పుడు రైసీ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు తీసుకొన్న మహమ్ముద్‌ ముఖ్‌బెర్‌ మరో 50 రోజులు ఆ పదవిలో కొనసాగనున్నారు.

అంతరిక్ష లేజర్​తో
ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను అంతరిక్ష లేజర్‌ ఆయధాన్ని వాడి కూల్చేసి ఉండొచ్చనే మరో ప్రచారం ఎక్స్‌లో జోరుగా జరుగుతోంది. ఇప్పటికే పలు దేశాలు ఇటువంటి ఆయుధాలను వాడుతుండటం వల్ల ఈ కుట్రకోణాన్ని కూడా నెటిజన్లు నమ్ముతున్నారు. మరో వైపు ఇరాన్‌ ప్రభుత్వం మాత్రం ఇటువంటి దాడి ఏదీ జరగలేదని వెల్లడిస్తోంది. అయితే ఈ ప్రమాదానికి అమెరికానే కారణమని ఇరాన్‌ విదేశాంగశాఖ మాజీ మంత్రి మహమ్మద్‌ జావెద్‌ జారిఫ్‌ పేర్కొన్నారు. తమ హెలికాప్టర్లకు అవసరమైన విడి భాగాలు కొనుగోలు చేయనీయకుండా విధించిన ఆంక్షలే అధ్యక్షుడి ప్రాణాలను బలితీసుకొన్నట్లు చెబుతున్నారు. రైసీ ప్రమాదంలో అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలను అగ్రరాజ్య రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ ఖండించారు. హెలికాప్టర్ ప్రమాదంలో అమెరికా కుట్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలకు సంబంధించి ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. కచ్చితంగా ఇరాన్ దీనిపై విచారణ చేస్తుందని దాని ఫలితం ఎలా ఉంటుందో చూస్తామని వ్యాఖ్యానించారు.

'మా దేశంపై చైనా సైనిక చర్యలను ఆపాలి'- తైవాన్ అధ్యక్షుడిగా లాయ్‌ చింగ్‌ తె ప్రమాణం - taiwan new president inauguration

'నెతన్యాహు, హమాస్ నేతలపై అరెస్ట్ వారెంట్'- ఐసీసీని కోరిన ప్రాసిక్యూటర్ - Israel Hamas War

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.