ETV Bharat / state

లోలెవల్‌ కల్వర్టులు.. ప్రయాణికుల అవస్థలు

author img

By

Published : Aug 24, 2020, 9:39 AM IST

లోలెవల్‌ కల్వర్టులు.. ప్రయాణికుల అవస్థలు
లోలెవల్‌ కల్వర్టులు.. ప్రయాణికుల అవస్థలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే లోలెవల్‌ కల్వర్టులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి విస్తరణకు నోచుకోకపోవడం వల్ల ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కల్వర్టులను విస్తరించడం, వాటిని బాగుచేయడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పల్లెలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. రహదారుల నిర్మాణాలకు పెద్దపీట వేస్తోంది. అందుకు రూ.కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. రవాణా వ్యవస్థ సక్రమంగా ఉంటేనే గ్రామాలు పురోగతి సాధిస్తాయనేది ప్రభుత్వ భావన. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే లోలెవల్‌ కల్వర్టులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి విస్తరణకు నోచుకోకపోవడం వల్ల ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కల్వర్టులను విస్తరించడం, వాటిని బాగుచేయడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్వర్టుల విస్తరణకు ఏళ్లుగా ఎదురుచూస్తున్నా పరిష్కారం కావడం లేదు. కొన్నిచోట్ల కల్వర్టులు శిథిలావస్థకు చేరినా వాటి మరమ్మతులపై దృష్టి సారించడం లేదు.

వరదొస్తే ఆగమే...

ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న లో-లెవల్‌ కల్వర్టులు, రోడ్డుడ్యాంలతో ప్రజలు, ప్రయాణికులకు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. వరద ప్రవాహం ఎక్కువైతే అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆయా గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి. తక్కువ ఎత్తుతో ఉన్న కల్వర్టులు, రోడ్‌ డ్యాంలపై వరద నీటి ప్రవాహానికి వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నందున మారుమూల గ్రామాల ప్రజలు వర్షాకాలంలో నానాపాట్లు పడాల్సిన దుస్థితి తలెత్తుతోంది. అవసరమైన ప్రదేశాల్లో వంతెనలు నిర్మిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించనుంది.

అనేక గ్రామాల్లో ఇబ్బందులు

మండల కేంద్రం సమీపంలో గిద్దెచెరువు కింద ఉన్న వాగుపై ఉన్న లోలెవల్‌ కల్వర్టు నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు ధ్వంసమవగా తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. గిద్దెచెరువు నీరు మత్తడి పారితే వాగులో నీటి ప్రవాహం వల్ల రాకపోకలు స్తంభించిపోతాయి. ఈ వాగు పొంగిపొర్లితే దుమాల, అక్కపల్లి, అల్మాస్‌పూర్‌ గ్రామాలతోపాటు వీర్నపల్లి మండలానికి రవాణా వ్యవస్థ నిలిచిపోతుంది.

ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి నుంచి గంభీరావుపేట మండల కేంద్రం వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం పూర్తయినా కోరుట్లపేట వద్ద వాగుపై నిర్మించిన రోడ్‌డ్యాంపై నుంచి వరద నీరు ప్రవహిస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నారాయణపూర్‌, బండలింగంపల్లి గ్రామాల మధ్యలో పారేటి వాగు, పెద్దమ్మ ఒర్రె వాగులపైన లోలెవల్‌ కల్వర్టుల వద్ద వర్షాకాలంలో వరదనీటి ప్రవాహానికి వాహన రాకపోకలు స్తంభిస్తాయి. కొద్దిపాటి వర్షాలకే వాగుల్లో వరదనీరు పోటెత్తుతుండటం వల్ల గ్రామాలకు రవాణా స్తంభించిపోవడం పరిపాటిగా మారింది.

గొల్లపల్లి నుంచి రాజన్నపేట మీదుగా అల్మాస్‌పూర్‌, వీర్నపల్లి మండలంలోకి ప్రవేశించే ప్రయాణికులు, ప్రజలు వర్షాకాలంలో ఇబ్బంది పడతున్నారు. వీటిని విస్తరిస్తూ బ్రిడ్జిలు నిర్మించడం ద్వారా రహదారి వ్యవస్థను మెరుగుపర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.