ETV Bharat / state

యాసంగి ధాన్యం మొత్తం కొనేవరకు మా పోరాటం ఆగదు: కేటీఆర్‌

author img

By

Published : Apr 7, 2022, 3:22 PM IST

Updated : Apr 7, 2022, 3:50 PM IST

Minister KTR Comments: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేడ్కర్‌ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర భాజపా నాయకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

Minister KTR Comments on BJP state leaders and center for paddy procurement issue
Minister KTR Comments on BJP state leaders and center for paddy procurement issue

యాసంగి ధాన్యం మొత్తం కొనేవరకు మా పోరాటం ఆగదు: కేటీఆర్‌

Minister KTR Comments: యాసంగి ధాన్యం మొత్తం కొనేవరకు తమ పోరాటం ఆగదని మంత్రి కేటీఆర్​ ఉద్ఘాటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేడ్కర్‌ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవిందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు, తెరాసకు మంచి పేరు వస్తోందన్న అక్కసుతోనే కేంద్రం కొత్త కిరికిరి పెట్టిందని కేటీఆర్​ ఆరోపించారు. వరి వేయద్దని రైతులకు తాము సూచిస్తే.. రెచ్చగొట్టి మరీ వరి వేసేలా చేశారని రాష్ట్ర భాజపా నాయకులపై ధ్వజమెత్తారు. అప్పుడు రెచ్చగొట్టి పంట వేయించినందుకు గానూ.. ఇప్పుడు ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

కనిపించకుండా పోయారు..

"రైతులంతా వరి వేయాలని బండి సంజయ్‌ రెచ్చగొట్టారు. ధాన్యాన్ని సీఎం కొనాల్సిన పనే లేదని బండి సంజయ్‌ అన్నారు. కేంద్రంతో చెప్పి ప్రతి గింజ కొనిపిస్తామన్నారు. ఇప్పుడు ధాన్యం కొనమంటే కనిపించకుండా పోయారు. భాజపా రెండు నాలుకల వైఖరిని ప్రజలు గమనించాలి. ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదని కేంద్ర మంత్రులు అంటున్నారు. ఏటా కోటి మెట్రిక్‌ టన్నులకు పైగా బియ్యాన్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మూడేళ్ల లెక్క నాదగ్గర ఉంది. తెరాస ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే అక్కసుతోనే ఈ కొత్త కిరికిరి. యాసంగి ధాన్యం మొత్తం కొనేవరకు మా పోరాటం ఆగదు. రైతుల నిరసన సెగ దిల్లీలో ఉన్న మోదీకి తగలాలి. ఈనెల 11న దిల్లీలో ప్రజాప్రతినిధులందరం ధర్నా చేస్తాం." - కేటీఆర్‌, మంత్రి

ఆ రాష్ట్రాలు లేఖలు రాయలేదా..?

ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ లేదని.. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని పార్లమెంటులో కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ చులకనగా మాట్లాడారని కేటీఆర్​ మండిపడ్డారు. ఎక్కడ లేని సమస్య తెలంగాణాలో ఎందుకు వస్తోందని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి లేఖ రాయలేదా..? ఆంధ్రప్రదేశ్‌ సీఎం లేఖ రాయలేదా..? అని నిలదీశారు. కేంద్రప్రభుత్వం మెడలు వంచేందుకు దిల్లీలోని నరెంద్రమోదీ ఇంటికి కూతవేటు దూరంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, అందరం కలిసి నిరసన చేపట్టబోతున్నామని వివరించారు.

ఇదీ చూడండి:'

Last Updated : Apr 7, 2022, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.