ETV Bharat / state

ముందుగానే వచ్చినా... పరీక్షకు దూరమయ్యారు...!

author img

By

Published : Mar 4, 2020, 3:29 PM IST

INTERMEDIATE STUDENTS NOT ALLOWED TO EXAMS IN MANTHANI
INTERMEDIATE STUDENTS NOT ALLOWED TO EXAMS IN MANTHANI

ఒక్క నిమిషం నిబంధన పలువురు విద్యార్థులను పరీక్షకు దూరం చేసింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో మాత్రం ఇద్దరు ముందుగానే కేంద్రానికి చేరుకున్నా... వాళ్ల స్నేహితుడు ఆలస్యంగా రావటం వల్ల మొత్తం ముగ్గురూ పరీక్షకు దూరమయ్యారు. ఎందుకనుకుంటున్నారా...?

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో సుమారు 600 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలోనే సాగినా... ఒక్క నిమిషం నిబంధన విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొల్పింది. గంట ముందుగానే కేంద్రాల వద్ద విద్యార్థులు బారులు తీరారు. చివరి సమయంలో వచ్చిన కొంత మంది పరుగులు తీశారు. ఓ విద్యార్థిని ఆలస్యంగా రావటం వల్ల నిర్వాహకులు అనుమతించలేదు. ఎంత బతిమాలినా పంపించకపోవటం వల్ల కన్నీటి పర్యంతమైంది.

హాల్​ టికెట్లు లేవు... వచ్చాక టైం లేదు..

ముగ్గురు విద్యార్థులకు మాత్రం విచిత్ర సంఘటన ఎదురై... పరీక్షకు దూరం కావాల్సి వచ్చింది. ముగ్గురు విద్యార్థుల హాల్​టికెట్లు ఒక్కరి దగ్గరే ఉండిపోయాయి. మొదటి ఇద్దరు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకున్నారు. హల్​టికెట్లు ఉన్న అబ్బాయికి మాత్రం ఆలస్యంగా చేరుకున్నాడు. అప్పటి వరకు కేంద్రం వద్దే ఉన్న ఇద్దరిని మాత్రం... హాల్​టికెట్లు లేవని ఉపాధ్యాయులు లోపలికి అనుమతించలేదు. మూడో వ్యక్తి హాల్​టికెట్లు తెచ్చినా... ఆలస్యమైన కారణంగా అనుమతించకపోయేసరికి ముగ్గురూ పరీక్షకు దూరమయ్యారు. ఇక చేసేదేమిలేక ముగ్గురూ తిరుగుముఖం పట్టారు.

ముందుగానే వచ్చినా... పరీక్షకు దూరమయ్యారు...!

ఇవీ చూడండి: ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.