ETV Bharat / state

ఆ ఘటనతోనే కేసీఆర్‌ ‘కల్యాణ లక్ష్మి’ తీసుకొచ్చారు: ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Dec 22, 2022, 1:31 PM IST

Reason for Kalyana Lakshmi Scheme implementation : తెలంగాణలో ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులకు వారి పెళ్లి బాధ్యత భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే నిజామాబాద్​ జిల్లాలో ఇవాళ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కవిత.. ఆ పథకం ప్రవేశపెట్టడానికి గల కారణాన్ని తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

Reason for Kalyana Lakshmi Scheme implementation: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ సహృదయంతో రూపకల్పన చేసినవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయాలను చూడకుండా ప్రజలకు పనికొచ్చేవే చేస్తారని చెప్పారు. కల్యాణలక్ష్మి ఆలోచనకు వరంగల్‌ జిల్లాలో జరిగిన ఓ ఘటన కారణమని వివరించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున అందించే ఆర్థికసాయం చెక్కులను కవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

‘‘ఆడబిడ్డకు పెళ్లి చేయడం బాధ, కష్టంతో కూడుకున్న పని. ఆడబిడ్డ పెళ్లి కోసం రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచిపెట్టుకునే కుటుంబాలు మన దేశం, రాష్ట్రంలో ఎన్నో ఉంటాయి. అటువంటి కుటుంబాలకు చన్నీళ్లకు, వేడినీళ్లు తోడు అన్నట్లు మన ఇంట్లో జరిగే శుభకార్యానికి ప్రభుత్వం తరఫున ఆశీర్వాదం కింద కేసీఆర్‌ ఈ కార్యక్రమాలను చేపట్టారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌లోని ఓ తండాలో కేసీఆర్‌ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి బిడ్డ పెళ్లికి దాచిన సొమ్ము కాలిపోయిందని చెప్పారు. ఆనాడు కేసీఆర్ రూ.50వేలు సేకరించి ఆయనకు సాయం చేశారు. కులమతాలకు అతీతంగా పేదవారికి సాయపడాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ఆనాడే నిర్ణయించుకున్నారు. లబ్ధిదారులకు అందించే సాయాన్ని రూ.50వేలతో ప్రారంభించి ఇప్పుడు రూ.లక్షకు పెంచారు. ఆయా కుటుంబాలకు ఇది ఎంతో కొంత ఆసరా అవుతుంది. ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం లేదు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు అమలవుతోందనేది ప్రజలంతా ఆలోచించుకోవాలి.

బీఆర్​ఎస్​ ప్రకటన వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రం నుంచి అద్భుత స్పందన వస్తోంది. మేం వచ్చి చేరతామని ఎంతోమంది కోరుతున్నారు. బీఆర్ఎస్​తో తెలంగాణ భూమి పుత్రుడు దేశవ్యాప్తంగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టే ఆస్కారం కనిపిస్తోంది. దీనికి ప్రజల ఆశీర్వాదమే కారణం.. దాన్ని అలాగే కొనసాగించాలని కోరుతున్నా’’ అని కవిత అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.