ETV Bharat / state

రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి.. అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్

author img

By

Published : Nov 27, 2022, 3:13 PM IST

Updated : Nov 27, 2022, 8:16 PM IST

CM KCR Review Meeting: ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా సమన్వయంతో పనిచేస్తే సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధి వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. స్వరాష్ట్రంలో ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా.. ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. ఇంతటితో ఆగిపోకుండా ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించినపుడే... గుణాత్మక ప్రగతిని మరింతగా ప్రజలకు చేరవేయగలమని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

kcr
kcr

CM KCR Review Meeting : మున్సిపల్‌ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులు సహా నిజామాబాద్‌లో మౌలిక వసతులు మెరుగుపరచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మాట్లాడిన కేసీఆర్‌... అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. తెలంగాణలో పెరుగుతున్న ఆర్థిక వనరులు, సంపదకు అనుగుణంగా ప్రజావసరాలు పెరుగుతున్నాయని... అందుకు అనుగుణంగా ప్రజలకు అందాల్సిన నాణ్యమైన సౌకర్యాల కోసం అంతా కలిసి పని చేయాలని కేసీఆర్‌ సూచించారు.

CM KCR Review Meeting Updates : ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేని పరిస్థితి నుంచి అన్ని రంగాల్లో గుణాత్మకఅభివృద్ధి సాధించామన్న కేసీఆర్‌... వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, విద్య, వైద్య మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ గుణాత్మక ప్రగతిని సాధించిందని అందుకు అనుగుణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయన్న ఆయన.. ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. ఆ అంచనాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస.. ప్రజల ఆకాంక్షలు పెరుగుతున్నాయంటే.. వారికి ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే కారణమని సీఎం చెప్పారు. ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశలో శ్రమించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇందుకు.. రేపు మరింత మెరుగ్గా ఎలా పనిచేయగలమని ఆలోచించాలని... ఒక్కో పనిని మరింత శాస్త్రీయంగా పూర్తిచేసే నూతన ప్రక్రియలు ఆవిష్కరించాలని సూచించారు. తెలంగాణలో ఒకప్పుడు ప్రజాదరణ లేని ప్రభుత్వ ఆసుపత్రులు.. ఇప్పుడు అత్యంత రద్దీగా ఉంటున్నాయని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఒకప్పుడు తెలంగాణ నుంచి వలసలు ఉంటే.. ఇప్పుడు దాదాపు 30 లక్షల మంది పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసవచ్చి బతుకుతున్నారని వివరించారు.

నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదు.. నిజామాబాద్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న పట్టణాన్ని మరింత ద్విగుణీకృతమై కళ్లకు కట్టాలని స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులు పూర్తిచేయాలని... స్వయంగా పర్యటించి పరిశీలిస్తానని వెల్లడించారు. అన్ని శాఖలు సమన్వయంతో అభివృద్ధి పనులను పూర్తిచేసేట్లు చూడాలని ఎమ్మెల్యే గణేశ్ బిగాలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన నిధుల్ని విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని సీఎం ఆదేశించారు. తొలుత ఖమ్మం జిల్లాలో పర్యటించి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని నిజామాబాద్ జిల్లా అధికారులు, ఎమ్మెల్యేకు సూచించారు. రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ సహా ప్రభుత్వ భూముల లెక్కలు తీసి వాటిల్లో ప్రజావసరాలకోసం వినియోగించేందుకు ఎన్ని అనువుగా ఉన్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆ శాఖ మంత్రి కేటీఆర్.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వివరించారు. దేశంలో ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో మున్సిపల్ శాఖ చేసిన కృషిని వివరించారు.

మాంసం వినియోగం గణనీయంగా పెరిగింది.. గొర్రెల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం రాజస్థాన్‌ను మించిపోయిందని.. మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి వైపు వేగంగా పయనిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. మొదటి విడతలో రూ.5 వేల కోట్లతో 3.94 లక్షల మందికి 82.74 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో 3.50 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,125 కోట్ల వ్యయంతో 73.50 లక్షల గొర్రెల పంపిణీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గొర్రెల యూనిట్ విలువను లక్షా 25వేల నుంచి లక్షా 75వేలకు పెంచామని సీఎం పేర్కొన్నారు. మాంసం వినియోగం కూడా తెలంగాణలో గణనీయంగా పెరిగిందన్న కేసీఆర్.. గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రానికి మాంసం దిగుమతి తగ్గిందన్నారు. గొర్రెలు, పొట్టేళ్ల మేతకు ప్రభుత్వం 75 శాతం రాయితీని ఇస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకటర్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌తో పాటు, జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, డైరెక్టర్ సత్యనారాయణ, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చిత్రతో పాటు నిజామాబాద్ జిల్లా పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 27, 2022, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.