ETV Bharat / state

Farmers: అవకతవకలపై ప్రశ్నించినందుకు.. రైతులపై కేసు నమోదు

author img

By

Published : Jul 11, 2021, 1:26 PM IST

ధాన్యం కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆందోళన చేసిన రైతులపై కేసు నమోదు చేశారు నిర్మల్‌ జిల్లా పోలీసులు. సోన్ మండలం కడ్తాల్‌లో ఈ ఘటన జరిగింది.

case filed on kadthal farmers
కడ్తాల్‌ రైతులపై కేసు నమోదు

అన్యాయం జరిగిందని ప్రశ్నించిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌లో జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని.. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బుల విషయంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈ నెల 8న రైతులు ఆందోళన చేశారు. దీనికి మంజులాపూర్ పీఏసీఎస్ సీఈఓ మురళీకృష్ణ బాధ్యుడిని చేస్తూ.. రైతులు గ్రామ పంచాయితీ కార్యాలయంలో అతనిని నిర్బంధించారు. విషయం తెలుసుకున్న సోన్ ఎస్సై ఆసిఫ్.. గ్రామానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిర్బంధించిన పీఏసీఎస్ సీఈఓను కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసు వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.

ముగ్గురు రైతులపై కేసు

ఈ క్రమంలో ప్రభుత్వ అధికారిని నిర్బంధించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని.. గ్రామానికి చెందిన ముగ్గురు రైతులపై ఈ రోజు సోన్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. గుర్రం పోసులు, బర్మ మారుతి, గంగయ్యలపై కేసు నమోదు చేసినట్లు సీఐ జీవన్ రెడ్డి తెలిపారు.

కేసు నమోదు వెనక ఒత్తిళ్లు

ఆందోళన చేసిన రెండు రోజుల తర్వాత కేసులు నమోదు చేయడం ఏంటని గ్రామస్థులు నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లపై గ్రామంలోని రైతులంతా ఆందోళన చేస్తే కేవలం ముగ్గురిపై మాత్రమే కేసులు నమోదు చేయడం వెనక నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.

పోలీసు వాహనాన్ని అడ్డుకుంటూ కడ్తాల్‌ గ్రామస్థుల ఆందోళన

ఇదీ చదవండి: Rains in Telangana: రాష్ట్రంలో జోరు వాన.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.