ETV Bharat / state

ఫామ్‌హౌస్‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దు: బండి సంజయ్​

author img

By

Published : Dec 20, 2020, 7:46 PM IST

ఫామ్‌హౌజ్‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దు: బండి
ఫామ్‌హౌజ్‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దు: బండి

రైతుల్లో భాజపాకు ఆదరణ రాకూడదనే... ప్రతిపక్షాలు సాగు చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ప్రధాని మోదీ... రైతులకు అన్యాయం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. సాగు చట్టాల ద్వారా రైతులకు లాభాలు వస్తాయని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

నారాయణపేట జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనకు.. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పంపల్లిలో స్వామి వివేకానంద విగ్రహాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు. కొందరు భాజపాను మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారని.. హిందూ ధర్మ రక్షణ కోసమే పనిచేస్తున్నామని బండి సంజయ్​ పునరుద్ఘాటించారు. 2023లో గోల్కొండ కోటపై.. భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నారాయణపేట్‌లో జరిగిన రైతు సమ్మేళనానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాగు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు.

అన్ని వర్గాల్లో భాజపాకు ఆదరణ వస్తున్న విధంగానే... రైతుల్లో భాజపాపై నమ్మకం కలగకుండా.. సాగు చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బండి సంజయ్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ దిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీలో రైతులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్​‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసేందుకు కూడా సీఎం సమయం ఇవ్వరని విమర్శించారు. 2023లో గోల్కొండ కోటపై.. భాజపా జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు.

రైతులను ఆదుకుంటాం..

కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సమ్మాన్‌ యోజన ద్వారా రైతులను ఆదుకుంటుందని... భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌ బీమాను అమలు చేయకుండా... రైతులను మోసం చేసిందని ఆమె ఆరోపించారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా విజయం తర్వాత... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన నారాయణపేట్‌ జిల్లా పర్యటనతో... శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. సమావేశంలో ఉమ్మడి జిల్లా భాజపా నాయకులు, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఫామ్‌హౌస్‌ నుంచి పాలన చేసే సీఎం ఇక వద్దు: బండి సంజయ్​

ఇదీ చూడండి: కేసీఆర్​కు భాజపా భయం పట్టుకుంది: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.