ETV Bharat / state

పరిహారం చెల్లించాకే.. పనులు మొదలుపెట్టండి మహాప్రభో

author img

By

Published : Jan 31, 2023, 12:24 PM IST

Road Expansion Works In Narayanapet
Road Expansion Works In Narayanapet

Road Expansion Works In Narayanapet: రోడ్ల విస్తరణ కోసం మున్సిపాలిటీ అధికారులు చేపట్టిన కూల్చివేతలు.. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు శాపంగా మారింది. రహదారి విస్తరణలో తాము కోల్పోతున్న భూమికి, నివాసాలకు, దుకాణాలకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినా.. స్పందన కరువైంది. పూర్తిగా ఇళ్లు కోల్పోతున్న వారికి కనీసం రెండు పడక గదుల ఇళ్లిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినా వారి వేదన అరణ్య రోదనగానే మారింది. నారాయణపేట జిల్లా కోస్గి పురపాలికలో నిరుపేదల గోడుపై ఈటీవీ భారత్‌ ప్రత్యేక కథనం.

నారాయణపేట జిల్లాలో రహదారి విస్తరణతో రోడ్డున పడుతున్న జనం

Road Expansion Works In Narayanapet: తుంకిమెట్ల నుంచి నారాయణపేటకు వెళ్లే రహదారి కోసం నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాల్టీలో కిలో మీటరున్నర మేర రోడ్డును 66 అడుగులకు విస్తరించాల్సి ఉంది. అందుకోసం రెండు వైపులా 33 అడుగుల మేర అక్రమణల్ని తొలగించాలని2022 మార్చిలో కోస్గి మున్సిపాల్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న సుమారు 153 ఇళ్లు, దుకాణాలు, భవనాలకు పురపాలిక అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమణల్ని తొలగించాల్సిందిగా కోరినా స్పందిచకపోవడంతో అధికారులు పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు.

"ముందస్తూ సమాచారం లేకుండనే జేసీబీ తీసుకొచ్చి ఇళ్లు కూల్చివేస్తున్నారు. ఇంట్లో సామన్లు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. కనీసం వాటిని తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ఉన్న పలంగా ఇళ్లు కూల్చివేస్తే మేము ఎక్కడకి వెళ్లిపోతాం చెప్పండి. చాలా సంవత్సరాలు నుంచి మేము ఇక్కడనే బతుకుతున్నాం."- స్థానిక మహిళ

ముందస్తు సమాచారం లేకుండానే ఇళ్లు కూల్చారని కొందరు ఆరోపిస్తుండగా.. ఉన్న గూడు పోయి రోడ్డున పడ్డామని మరికొందరు వాపోయారు. పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం చెల్లించాలంటూ 16మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిరుపేదలనే కారణంతో మరో 16 ఇళ్ల జోలికి వెళ్లలేదు. మిగిలిన ఆక్రమణల్ని మున్సిపల్ అధికారులు యంత్రాలతో నేలమట్టం చేశారు. 66 అడుగులకు విస్తరించాల్సిన రోడ్డును స్థానికులు, ప్రజాప్రతినిధులు, ఒత్తిడితో 50 అడుగులకు పరిమితం చేశారు.

"మాకు నష్టం పరిహారం కూడా ఇవ్వలేదు. ఇలా సడన్‌గా వచ్చి ఇళ్లు కూల్చివేస్తున్నారు. మేము రోడ్డు విస్తరణలో భాగంగా మా స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నష్ట పరిహారం ఇవ్వకుండా ఇలా కూల్చడం సరికాదు. ఇక్కడ ఉన్న వారందరూ నిరుపేదలే.. ఎట్టిపరిస్థితిలో మేము మా స్థలం వదులుకోలేం. దీనికోసం ఎంత వరకైనా పోరాడుతాం".- స్థానికుడు

రెండు వైపులా 25 అడుగుల వరకు ఆక్రమణల్ని తొలగించారు. భూమి ఇచ్చేందుకు ఇళ్ల యజమానులు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. భూమి, పూర్తిగా ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. రెండు పడక గదుల ఇళ్లు, స్థలం ఉన్నవారికి డబ్బులు అందించాలని వేడుకుంటున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు, భూమి, భవనాలు కోల్పోతున్న వారికి.. రిజిస్ట్రేషన్ ఆస్తులు ఎవరికీ లేవని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

అన్నిరకాల అధికారిక దస్త్రాలుంటేనే పరిహారం కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చని సూచిస్తున్నారు. రోడ్డు విస్తరణ చేసిన చాలా మున్సిపాలిటీల్లో ఇళ్లకు పరిహారం చెల్లించారని..., అలాగే తమకూ చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.

"కలెక్టర్‌ ఆదేశాలు మేరకు మేము ఇళ్లు కూల్చివేస్తున్నాం. ఒక 16 మంది నిరుపేదల ఇళ్లు కూల్చడం లేదు. ఇక్కడ మిగత వారికి నష్టపరిహారం ఇవ్వడానికి వారి దగ్గర ఇంటికి సంబంధించి సరైనా పత్రాలు లేవు. అవి గ్రామకంఠం భూములు అందుకే మా పై అధికారులు ఆదేశాలు మేరకు మేము ఇళ్లు కూల్చివేస్తున్నాం."-పూ‌ర్ణచందర్‌, కోస్గి మున్సిపల్‌ కమిషనర్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.