ETV Bharat / state

పంట అమ్ముకోవడం పరీక్షేనా..?

author img

By

Published : Dec 4, 2019, 6:25 PM IST

Is it a crop selling test in telangana
పంట అమ్ముకోవడం పరీక్షేనా..?

మొన్నటి దాకా అధిక వర్షాల సమస్య. అంతకు ముందు వర్షాధార పరిస్థితులు. ఇప్పుడు పంట చేతికొచ్చినా కొనే వారి కోసం ఎదురుచూపులు. ఇది నారాయణ పేట జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి. సీసీఎస్ కేంద్రాలు తగినన్ని లేక... పత్తి కొనేవారి కోసం కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు.

నారాయణపేట జిల్లాలో పత్తిని అమ్మడం అంత ఈజీ కాదు. పంటను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈసారి పత్తి ఎక్కువగా సాగు చేశారు. అధికారులు మాత్రం ఉట్కూరు మండలం తిప్పరాసుపల్లిలో మాత్రమే సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సుమారు 10 మండలాల నుంచి రోజుకు వంద నుంచి 150 వాహనాల వరకూ పంటను తెస్తున్నారు. సీసీఐ మాత్రం రోజు 60 నుంచి 70 వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తోంది.

ట్రాక్టర్లు రోడ్డుపై వరుస..

ఈ కేంద్రంలో కొనుగోళ్లు వేగంగా జరగవు. తూకం, నిల్వ అక్కడే కావడం వల్ల పత్తిని తరలించే వరకూ.. కొనుగోలు జరపడంలేదు. తూకం వేసే యంత్రం ఒకటే అందుబాటులో ఉంది. ఫలితంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ట్రాక్టర్లు రోడ్డుపై వరుస కడుతున్నాయి. పత్తిని అమ్ముకోవాలంటే రెండు, మూడు రోజులు కొనుగోలు కేంద్రంలోనే వేచిచూడాలి. మధ్యలో సెలవులు వస్తే అంతే సంగతి. రోజుకు రూ.1500 నుంచి రూ. 2వేల వరకూ ట్రాక్టర్​ కిరాయి అవుతుండటం వల్ల వచ్చే లాభాలు ఖర్చులకే సరిపోతున్నాయి.

కొనుగోళ్లు ఆలస్యం..?

సీసీఐ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్ల వేచిచూడలేని రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. తేమ శాతం తూచకుండానే క్వింటాకు రూ.4వేల 500 మాత్రమే ధర చెల్లిస్తున్నారు. పరిస్థితి గమనించి... మరో చోట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

నారాయణపేట వ్యవసాయ మార్కెట్​లో గోదాం, తూకం యంత్రం, కూలీలు సహా అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నందున అక్కడే మరో కేంద్రాన్ని తెరవాలని రైతులు కోరుతున్నారు.

పంట అమ్ముకోవడం పరీక్షేనా..?

ఇదీ చూడండి : పత్తి రైతుల పాట్లు.. నాణ్యత పేరిట అధికారుల కొర్రీలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.