ETV Bharat / state

Srivalli Township: 'ఈ-వేలం' ద్వారా రాజీవ్‌ గృహకల్ప ప్లాట్ల విక్రయం

author img

By

Published : Feb 22, 2022, 8:07 PM IST

Srivalli Township: మధ్య తరగతి, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నల్గొండ జిల్లా దాసరిగూడెంలో నిర్మించిన శ్రీవల్లి టౌప్‌షిప్‌లోని రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్ల అమ్మకానికి రంగం సిద్ధమైంది. వచ్చేనెల 14 నుంచి 17 వరకు వీటిని 'ఈ-వేలం' ద్వారా విక్రయించనున్నారు. అయితే ప్లాట్లను స్థానికంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Township
Township

'ఈ-వేలం' ద్వారా రాజీవ్‌ గృహకల్ప ప్లాట్ల విక్రయం

Srivalli Township: ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి వారికి గృహ వసతి కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టింది. నల్గొండ జిల్లాలో దాసరిగూడెంలో భూమి సేకరించి ఇళ్ల నిర్మాణం తలపెట్టారు. కొన్ని గృహాలు పూర్తయి మరికొన్ని నిర్మాణంలో ఉండగా.. లబ్ధిదారులు కొనుగోలుకు ముందుకు రాకపోవడం వల్ల పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజీవ్‌ స్వగృహ ఇళ్లను ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేసింది.

మంత్రి మండలి నిర్ణయం...

హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించింది. జిల్లాల్లోని గృహాలు, స్థలాలు మాత్రం ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతగా దాసరిగూడెంలోని 240 ప్లాట్లను హెచ్‌ఎండీఏ ద్వారా అమ్మేందుకు అధికారులు సిద్ధం చేశారు.

ప్రీ-బిడ్ సమావేశం...

నల్గొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఇప్పటికే ఓసారి ప్రీ-బిడ్‌ సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 7న మరో సమావేశం నిర్వహించనున్నారు. ప్లాట్లకు చదరపు గజానికి 10వేల కనీస ధర నిర్ణయించారు. వేలానికి ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్లాట్లను విక్రయించడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. రాజీవ్‌ గృహకల్ప స్థలాలు పేదలకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వీటిని అందించాలని కోరుతున్నారు. హెచ్‌ఎండీఏ ప్లాట్లు కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా పూర్తి భద్రత ఉంటుందని.. వేలానికి పెద్దఎత్తున తరలిరావాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : 'బయ్యారంపై కేంద్రానిది తుక్కు సంకల్పం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.