ETV Bharat / state

Nagarjuna sagar dam: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసు భద్రత

author img

By

Published : Jun 30, 2021, 7:42 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర సరిహద్దు వద్ద భద్రతను మరింత పెంచారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ అక్కడి పరిస్థితులను సమీక్షించారు. స్వయంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఆయన సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్నారు.

telangana andhra pradesh water dispute
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం క్రమంగా ముదురుతోన్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్​ ప్రాజెక్టులోని ప్రధాన విద్యుత్​ ఉత్పత్తి కేంద్రం వద్దకు భారీగా బలగాలను పంపింది. ప్రాజెక్టు వద్దకు వెళ్లిన నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని ఎస్పీ రంగనాథ్​ తెలిపారు. ఇప్పటికే విధుల్లో ఉన్న ఎస్​పీఎఫ్​ సిబ్బందితో పాటుగా మరో 100 మందిని అదనంగా మోహరించామని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశామని స్పష్టం చేశారు.

ఎందుకు ఈ వివాదం

రాష్ట్ర రైతుల అవసరాల దృష్ట్యా సంపూర్ణ సామర్థ్యం మేరకు జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జెన్​కోను ఆదేశించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇంధనశాఖ ఉత్తర్వులు వెలువరించింది. దాదాపు 2500 మెగావాట్ల విద్యుత్​ను నీటి ద్వారా ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. కాని ఆంధ్రప్రదేశ్​​ ప్రభుత్వం ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కృష్ణా రివర్​ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని భావించిన అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్​ విద్యుత్ కేంద్రాల్లో 100 శాతం విద్యుత్​ను ఉత్పత్తి చేయాలని రాష్ట్ర సర్కారు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదంవండి: AP-TS Water Dispute: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద భద్రత కట్టుదిట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.