ETV Bharat / state

కాంగ్రెస్ హయాంలో కనీసం తాగునీరూ ఇవ్వలేదు: బాల్క సుమన్

author img

By

Published : Mar 24, 2021, 7:52 PM IST

సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ అన్నారు. నల్గొండ జిల్లా కుంకుడు చెట్టు తండాలో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ఆయన సమీక్షించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

mla-balka-suman-review-on-kunkudu-chettu-thanda-lift-irrigations-works-on-field-level-in-nalgonda-district
కాంగ్రెస్ హయాంలో కనీసం తాగు నీరు ఇవ్వలేదు: బాల్క సుమన్

నల్గొండ జిల్లా కుంకుడు చెట్టు తండాలో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ సూచించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం పరిధిలోని తండాలో దాదాపు రూ.2.47కోట్లతో చేపట్టిన లిఫ్ట్​ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్​తో 14 గ్రామాల పరిధిలోని 7,163 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు.

వానాకాలంలో నీళ్లు

కుంకుడు చెట్టు తండా, చలకుర్తి, బెట్టెల తండా, గాత్ తండా, తుటుపేట తండా, రంగుళ్ల తండా, పాషవారి గూడెం, పెద్ద భాయ్ తండా, శ్రీరామ్​పల్లి, ఎల్లాపురం, గరికనేటు తండా, బోయగూడా, ఆల్వాల్, కొంపల్లి గ్రామాల రైతులకు మేలు జరగనుందని పేర్కొన్నారు. వచ్చే వానా కాలంలోపు పనులు పూర్తి చేసి నీరు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ ఇంజినీరింగ్ చీఫ్ మురళీధర్ రావు, స్థానిక ఎస్​ఈ అజయ్​తో పనుల పురోగతిపై చర్చించారు.

తాగునీరూ కరవే

రూ.70కోట్లతో నిర్మిస్తున్న నెళ్లికల్ లిఫ్ట్ పనులను త్వరలోనే సందర్శిస్తామని బాల్క సుమన్​ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో సాగు నీరుకాదు కదా కనీసం తాగునీరూ ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని కొనియాడారు. ప్రజలందరూ తెరాసని భారీ మెజారిటీతో గెలిపించాలి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కన్నుల పండువగా యాదాద్రీశుడి చక్రస్నాన ఘట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.