ETV Bharat / state

'గత ఎన్నికల్లో ఆధీక్యం రాని ప్రాంతాల్లో ఏం చేద్దాం..?'

author img

By

Published : Oct 30, 2022, 9:18 AM IST

munugode by election
munugode by election

Munugode by election: మునుగోడు ఉపఎన్నికలో విజయం కోసం ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేక ప్రచార వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఆ ఆ పార్టీలకు పట్టున్న చోట్ల మరింత గట్టి ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో ఆధిక్యం కోల్పోయిన ప్రాంతాలపైనా ప్రత్యేక దష్టి సారించాయి. ప్రధాన పార్టీల నాయకులంతా మునుగోడులోనే మకాం వేసి ప్రచార వేడి పెంచుతున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో.. గత ఎన్నికల్లో ఆధీక్యం రాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

Munugode by election: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో ఆధీక్యం రాని మండలాలపై ప్రధాన పక్షాలు ప్రత్యేక దృష్టి సారించాయి. గత ఎన్నికల్లో మునుగోడు, చండూరు మండలాల్లోనే కాంగ్రెస్‌ పార్టీకి తెరాస కంటే 11,280 ఓట్లు అధికంగా వచ్చాయి. మొత్తం మెజార్టీ 22,552 కాగా అందులో రెండు మండలాల్లోనే సగం మెజార్టీ రావడం విశేషం.

మునుగోడు మండలంలో గత ఎన్నికల్లో 6,053 ఓట్లు తెరాస కంటే ఎక్కువ రాగా.. ప్రస్తుతం పురపాలికగా మారిన చండూరులో 5,227 ఓట్లు కాంగ్రెస్‌కు అధికంగా వచ్చాయి. మర్రిగూడ మండలంలోనూ గత ఎన్నికల్లో తెరాస కంటే కాంగ్రెస్‌కు సుమారు 4 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ మూడు మండలాల్లోనూ ఆధీక్యం సాధించే విధంగా అధికార పార్టీ ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటూ ముఖ్య నాయకులు ఇప్పటికే ఇన్‌ఛార్జ్‌లుగా తమకు కేటాయించిన ఎంపీటీసీ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని గత వారం రోజులుగా కొనసాగిస్తున్నారు. ఒక్కో ఇంటికి ఇప్పటికే పదిసార్లు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కొన్ని చోట్ల మూడు వేల ఓట్లు ఉంటే వాటిని 500 చొప్పున ఓట్లను విభజించి ఆరుగురికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ పార్టీది పైచేయి కావాలనే ధీమాతో వారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు భాజపా సైతం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చిన చోట ఆ ఓట్లన్ని భాజపాకు బదిలీ అయ్యే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు ఇప్పుడు భాజపాలో చేరడంతో వారి పరిధిలోని ఓట్లన్నీ భాజపాకు పడాలని, అందుకు ఒక్కో ఓటరును ప్రత్యేకంగా కలవాలని పార్టీ ఆదేశించింది.

పట్టణ ప్రాంతాల్లో పార్టీకి ఆదరణ ఉన్న దృష్ట్యా ప్రస్తుతం పురపాలికలుగా మారిన చౌటుప్పల్, చండూరులో భాజపా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాంతాల్లోనే పార్టీ ముఖ్య నేతల సభలు, రోడ్‌షోలు ఎక్కువగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే సుమారు 40 శాతం ఓటర్లుండటం కూడా పార్టీ ఇక్కడే దృష్టి పెట్టడానికి కారణంగా తెలుస్తోంది.

ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారిన కాంగ్రెస్‌, ఏళ్ల నుంచి పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న గ్రామాలపై దృష్టి సారించింది. గతంలో పార్టీ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డికి మద్దతుగా ఉన్న గ్రామాల్లోనే ఎక్కువ ప్రచారం సాగేలా కార్యాచరణ రూపొందించింది. మొత్తం 162 గ్రామాలుండగా.. గత ఎన్నికల్లో 126 గ్రామాల్లో పార్టీకి ఆధీక్యం వచ్చింది.

ఇప్పటికీ 75 గ్రామాల్లో పార్టీకి సంస్థాగతంగా ఇతర పార్టీల కంటే ఎక్కువ బలం ఉందని గుర్తించిన కాంగ్రెస్‌ ఈ గ్రామాల్లోనే ఎక్కువ సార్లు ప్రచారం నిర్వహించి ప్రతి ఓటరును రానున్న రెండు రోజుల్లో వ్యక్తిగతంగా రెండు సార్లు కలిసే విధంగా క్యాడర్‌కు ఆదేశాలిచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.