ETV Bharat / state

Cm Tour: ఆగస్టు 2న సాగర్ నియోజకవర్గంలో సీఎం పర్యటన... హామీలపై చర్చ

author img

By

Published : Jul 30, 2021, 4:47 AM IST

CM
సీఎం పర్యటన

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక వేళ హామీల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి... వాటిని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు. వచ్చే నెల 2న హాలియా వెళ్లనున్న కేసీఆర్‌... ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో సమావేశం కానున్నారు. కేసీఆర్ పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

సాగర్‌లో నోముల నర్సింహయ్య తనయుడు, తెరాస అభ్యర్థి భగత్‌ను గెలిపిస్తే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఇచ్చిన హామీమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) మరోసారి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆగస్టు 2న హాలియా చేరుకుని... హామీల అమలు, పథకాల పురోగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించనున్నారు.

హామీల అమలుపై దృష్టి...

నెల్లికల్ లిఫ్టును... ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ లోపు పూర్తికాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేయడంతో సీఎం కూడా ఆయనకు మద్దతు పలికారు. నెల్లికల్ లిఫ్టునకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తైనందున... పనులు మొదలు పెట్టాల్సి ఉంది. హాలియాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించగా... ప్రస్తుతానికి జూనియర్ కళాశాల ఆవరణలోనే... డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. షాదీఖానాకు హామీ ఇచ్చినా ఇంకా మంజూరు కాలేదు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎన్ఎస్పీ ఆధ్వర్యంలోని క్వార్టర్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

మంజూరు కానీ నిధులు...

కొత్తగా ఏర్పడ్డ నందికొండ, హాలియా పురపాలికలకు కోటి రూపాయల చొప్పున... నియోజకవర్గంలోని ప్రతి మండలానికి రూ. 30 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున ఇస్తామని జీవో తెచ్చినా... అడుగు ముందుకు పడలేదు. హాలియాను వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారుస్తామన్నా... నిధులు మంజూరు కాలేదు.

సమస్యలపై చర్చ...

అంతర్గత రహదారులు సరిగా లేకపోవడం, మురుగునీటి సమస్యతోపాటు... త్రిపురారం, గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి, హిల్ కాలనీల్లో ప్రయాణ ప్రాంగణాలు లేవు. ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతున్నా... అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హాలియాలో పశువుల సంత స్థలంలో మినీ స్టేడియం, ఓపెన్ జిమ్ నిర్మాణానికి శిలాఫలకాలు వేశారు. సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి స్థలం గుర్తించినా... పనులు మొదలు కాలేదు. వీటన్నింటిపైనా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది.

కేసీఆర్ చేపట్టే ప్రగతి సమీక్ష సభ కోసం... హాలియాలోని ఐటీఐ ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. సీఎం రాకతోనైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని... నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు ఆశతో ఉన్నారు.

ఇదీ చదవండి: PRC: విద్యాశాఖ ఒప్పంద, పొరుగ సేవ ఉద్యోగుల పీఆర్సీపై కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.