ETV Bharat / state

మునుగోడులో స్పీడ్​ పెంచిన ప్రధాన పార్టీలు.. ప్రచారంలోకి అగ్రనేతలు..!

author img

By

Published : Oct 9, 2022, 7:57 AM IST

Munugode Bypoll Campaign: అభ్యర్థులెవరో తేలిపోయారు. ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చింది. దీంతో మునుగోడు ఉపఎన్నికపై ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌, భాజపా ప్రచార వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. భాజపా వైఫల్యాలను ఎండగడుతూ.. తెరాస సర్కార్‌ విజయాలు ఇంటింటికి చేర్చాలని నేతలకు కేటీఆర్​ దిశానిర్దేశం చేశారు. దిల్లీ నాయకత్వం భాజపా రాష్ట్ర నాయకత్వానికి సమీక్షలతో కార్యోన్ముఖులను చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌, భట్టి సహా ఇతర నేతలు ప్రచారబరిలో దిగనున్నారు.

Munugode by election
Munugode by election

మునుగోడులో స్పీడ్​ పెంచిన ప్రధాన పార్టీలు.. ప్రచారంలోకి అగ్రనేతలు

Munugode Bypoll Campaign: రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా తెరాస, కాంగ్రెస్‌, భాజపాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తెరాస సర్కార్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. ప్రచారం ప్రణాళికబద్ధంగా సాగాలని టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రచార ఇన్‌ఛార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు. ఫ్లోరైడ్‌ విముక్తికి తెరాస సర్కార్‌ కృషిని వివరించాలని తెలిపారు. భాజపా, కాంగ్రెస్‌ వైఫల్యాలను గడపగడపకూ తీసుకెళ్లాలని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి తీరు, భాజపా వల్ల దేశం, రాష్ట్రానికి జరుగుతున్ననష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేటీఆర్​ సూచించారు. మీటర్లు పెట్టే భాజపా కావాలా? మీటర్లు పెట్టమని కొట్లాడుతున్న కేసీఆర్ కావాలా? అనే నినాదంతో ప్రజల్ని చైతన్యపరచాలని సూచించారు.

రాజగోపాల్‌రెడ్డిని గెలిపించే పనిలో భాజపా: మరోవైపు భాజపా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో పని చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్, సహ ఇన్‌ఛార్జీ అరవింద్‌ మీనన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం అయ్యారు.

ప్రచారసరళి, విజయావకాశాలపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. తెరాస సర్కార్ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మునుగోడుపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆర్​ఎస్​ఎస్​ ప్రతినిధులూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ముఖ్యనేతలకు సంఘ్‌ నేతలు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు.. ఎన్నికల స్టీరింగ్ కమిటీ సహా ఇతర నేతలతో బండి సంజయ్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ప్రచారం ముమ్మరం చేసిన కాంగ్రెస్​: అధికార, పోలీస్ యంత్రాంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చర్చించారు. కుల సంఘాలతో ప్రత్యేకంగా భేటీ కావాలని, శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జీల సేవలను వినియోగించుకోవాలని సంజయ్‌ సూచించారు. సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్‌ ప్రచారం ముమ్మరం కానుంది. ఈ నెల 14 వరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్యనాయకులు అంతా నియోజక వర్గంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

భాజపా, తెరాస వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక సమస్యలను వివరిస్తూ.. వాటిని పరిష్కరించడంలో రెండు పార్టీలు వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. మండలాలకు ఇన్‌ఛార్జిలుగాఉన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, దామోదర రాజనర్సింహ, వీహెచ్​, శ్రీధర్‌బాబు, జీవన్‌ రెడ్డిల పర్యవేక్షణలో నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం కొనసాగనుంది. అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చౌటుప్పల్‌ మండలం, మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.