ETV Bharat / state

కందనూలులో కనిపించని ప్రగతి.. కలెక్టర్ సీరియస్

author img

By

Published : Aug 10, 2020, 9:58 AM IST

Updated : Aug 10, 2020, 1:09 PM IST

నాగర్​కర్నూల్ జిల్లాలో పల్లె పనుల ప్రగతి చతికిలబడుతోంది. మొక్కలు నాటడం, శ్మశాన వాటిక, డపింగ్ యార్డు, ప్రకృతి వనాల ఏర్పాటులో పల్లెలు వెనకబడుతున్నాయి. ఇంటింటికీ ఇంకుడు గుంతలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వాహణలోనూ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైన సర్పంచ్​లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేయడమే అందుకు నిదర్శనం. నివేదికల్లో కనిపించిన ప్రగతి క్షేత్రస్థాయిలో లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

nagarkarnool collector serious on palle pragathi works
పల్లె ప్రగతి పనులపై కలెక్టర్ సీరియస్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి నాగర్​కర్నూల్ జిల్లాలో ఒక్క అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. పల్లెప్రగతిలో హరితహారం, ఇంటింటికీ ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, తాగునీరు, డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, చెత్త వేరుచేసే షెడ్ల నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. ఇంటింటికీ చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వాహణ బాధ్యతలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. మండల, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. అయినా పల్లెప్రగతి పనుల్లో జిల్లాలు పురోగతి సాధించడం లేదు. లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతున్నారు.

బాధ్యులకు నోటీసులు..

హరితహారంలో భాగంగా 78లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా... ఇప్పటి వరకు 55లక్షల మొక్కలే నాటారు. 71శాతం మాత్రమే పూర్తైంది. ఉపాధి హామీ కింద లక్షా 67వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా... 7వేలు మాత్రమే పూర్తి చేశారు. 362 ప్రకృతి వనాలకుగానూ... 6 పూర్తయ్యాయి. 461 గ్రామాల్లో 128 గ్రామాల్లో చెత్తవేరు చేసే షెడ్ల నిర్మాణం చేపట్టనే లేదు. 158 గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో 158 మంది సర్పంచ్​లు, పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు పంపించారు. బాధ్యత వహిస్తున్న 15 మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలకు కూడా కలెక్టర్ శర్మన్ నోటీసులు జారీ చేశారు.

అయినా మార్పు లేదు..

జులై 17న కలెక్టర్​ శర్మన్​ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి... ఉదయాన్నే పలు మండలాలు, గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేపట్టారు. క్షేత్రస్థాయియలో పారిశుద్ధ్య నిర్వాహణ, హరితహారంలో నిర్లక్ష్యాన్ని ప్రత్యక్షంగా గమనించారు. ప్రత్యేక అధికారుల నివేదికల ఆధారంగా పనుల తీరును పలుమార్లు సమీక్షించారు. అయినా పనితీరులో మార్పు రాకపోవడం వల్ల నోటీసులు జారీ చేశారు. నాగర్​కర్నూల్ జిల్లాలోనే కాదు జోగులాంబ గద్వాల జిల్లాలో 12 మందికి, నారాయణపేట జిల్లాలో 18 మందికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటీసులు జారీ చేశారు. కాని క్షేత్ర స్థాయిలో పనిచేసే ప్రజాప్రతినిధులు, అధికారుల తీరులో మార్పు రావడం లేదన్న విమర్శలున్నాయి.

నివేదికల్లోనే ప్రగతి..

ముఖ్యంగా శ్మశాన వాటిక, డపింగ్ యార్డు, చెత్త వేరు చేసే షెడ్ల నిర్మాణంలో స్థలాల కొరత, స్థానిక రాజకీయాలు ఇబ్బందిగా మారుతున్నాయి. వివాదాల్లోకి వెళ్లలేక సర్పంచ్​లు పట్టించుకోవడం లేదు. ఇక సర్పంచ్ లు సరిగా పట్టించుకోకపోవడం వల్ల... గ్రామాల్లో హరితహారం, పారిశుద్ధ్య నిర్వాహణ, చెత్త సేకరణ, తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు నివేదికల్లో చూపిస్తున్న పనుల పురోగతి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.

జిల్లాల స్థానాలివి..

ఉపాధి హామీ కింద చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో మహబూబ్​నగర్ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానం, వనపర్తి జిల్లా 9, నాగర్​కర్నూల్ జిల్లా 11వ స్థానంలో ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కందనూలుపై ప్రత్యేక దృష్టి సారించి పల్లెప్రగతి పనులను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Last Updated : Aug 10, 2020, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.