ETV Bharat / state

'సాగునీరు అందుతుందని ఆశపడ్డా... నిరాశే మిగిలేలా ఉంది'

author img

By

Published : Jul 12, 2020, 4:47 AM IST

Etv bharat special story on kli project canel
'సాగునీరు అందుతుందని ఆశపడ్డా... నిరాశే మిగిలేలా ఉంది'

ప్రధాన కాల్వకు ఎగువ ప్రాంతాల రైతుల గండ్లు, అసంపూర్తిగా మిగిలి పోయిన వంతెనలు. పూర్తికాని డిస్టిబ్యూటరీ, మైనర్, సబ్ మైనర్ కాలువలు... వెరసి మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గ ఆయకట్టుకు సాగునీరు అందించడం ప్రహసనంగా మారుతోంది. మొత్తంగా వానాకాలంలో సాగునీరు అందుతుందని ఆశపడ్డా... చివరి ఆయకట్టు రైతులకు నిరాశే మిగిలేలా ఉంది.

'సాగునీరు అందుతుందని ఆశపడ్డా... నిరాశే మిగిలేలా ఉంది'

పేరుకు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకమే అయినా... ఆ నియోజక వర్గ రైతులకు మాత్రం ఆ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ పథకంలోని 29వ ప్యాకేజీ పరిధిలో నియోజకవర్గానికి సాగునీరు సక్రమంగా అందకపోగా... అన్ని మండలాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో తలపెట్టిన డీ-82 పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి.

ఎక్కడికక్కడ గండ్లు..

ఎత్తిపోతల పథకం మూడో దశలో భాగంగా నాగర్​కర్నూల్ జిల్లా గుడిపల్లిగట్టు జలాశయం నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలోని 2 లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. గుడిపల్లిగట్టు నుంచి కల్వకుర్తి నియోజకవర్గానికి వెళ్లాల్సిన ప్రధాన కాల్వలు, పంట కాల్వలు పూర్తి చేసినా.. చివరి ఆయకట్టు రైతులకు మాత్రం నీరందడం లేదు. ప్రధాన కాల్వకు ఎగువ ప్రాంతాల్లోని రైతులు ఎక్కడికక్కడ గండ్లు కొడుతున్నారు. దీంతో ఏటా వానాకాలం, యాసంగిలో చివరి ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.

ప్రజల అవస్థలు..

ప్రధాన కాల్వను తవ్వి వదిలేశారు. లైనింగ్ పనులు పూర్తి కాకపోవడం... డిస్టిబ్యూటరీల వద్ద షటర్లు బిగించకపోవడం... అక్కడక్కడా నిర్మించాల్సిన యూటీలను అసంపూర్తిగానే వదిలేశారు. కాల్వ తవ్విన చోట గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రధాన కాల్వ మీద నిర్మించాల్సిన వంతెనలను పూర్తిగా విస్మరించారు. వంతెనలు లేక రైతులు, గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధాన కాల్వకు రైతులే గండ్లు కొట్టడం, లేదా వరద తాకిడికి దెబ్బతినడం వల్ల గత ఏడాది చాలాచోట్ల నీరు వృథాగా పోయింది.

పరిహారం కూడా లేదు..

29వ ప్యాకేజీ నుంచి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామం వరకు 66 కిలోమీటర్ల పొడవునా కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 2017లో పనులు ప్రారంభించినా.. 2018 డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటికీ పూర్తి కాలేదు. రైతులకు ఇవ్వాల్సిన భూసేకరణ పరిహారం సైతం ఇవ్వలేదు. సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

రూ. 85కోట్ల నిధులు..

పెండింగ్ బిల్లులు, పరిహారం, పెండింగ్ పనుల పూర్తికి సుమారు రూ. 85 కోట్ల నిధులు కావాలని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. నిధులు విడుదల చేయాలని కోరేందుకు జిల్లా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలిసింది. కల్వకుర్తి ఎత్తిపోతలు ప్రారంభం కాకముందే పెండింగ్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.