ETV Bharat / state

Ramappa temple: ప్రపంచ వారసత్వ హోదాకు.. అడుగు దూరంలో రామప్ప.!

author img

By

Published : Jul 16, 2021, 4:12 PM IST

Updated : Jul 16, 2021, 8:46 PM IST

ramappa temple
రామప్ప ఆలయం

అద్భుత శిల్పసంపదకు చిరునామాగా నిలిచే రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ గుర్తింపునకు క్రమంగా దగ్గరవుతోంది. ఈమేరకు హెరిటేజ్ కమిటీ ప్రతినిధులు ఆన్​లైన్​లో సమావేశమయ్యారు. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలనకోసం ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో జరిగింది. రామప్పకు వారసత్వ హోదా రావాలని స్ధానికులు, పర్యాటకులు కోరుకుంటున్నారు.

అత్యద్భుత శిల్పసంపదకు చిరునామాగా మారి.. అనేక ప్రత్యేకతలకు సమాహారంగా నిలిచిన ప్రఖ్యాత రామప్ప ఆలయం.. ప్రపంచ వారసత్వ గుర్తింపునకు చేరువైంది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలనకోసం ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో జరిగింది. ప్రారంభ సమావేశంలో నిర్వహించిన సాంస్కృతిక సమావేశాలు అందరినీ అలరించాయి. చైనా విద్యాశాఖ మంత్రి తియాన్ యూజెన్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతేడాది జూన్​లోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా అది వాయిదా పడింది. నేటి నుంచి హెరిటేజ్ కమిటీ ప్రతినిధులు ఆన్​లైన్​లో సమావేశం అవుతారు. ఈ నెల 31 వరకూ కమిటీ సమావేశాలు జరుగుతాయి.

రామప్పకు మాత్రమే..

వివిధ దేశాల నుంచి నామినేట్ అయిన కట్టడాలపై చర్చతోపాటు ఓటింగ్ కూడా ఉంటుంది. రామప్ప ఆలయానికి వారసత్వ గుర్తింపుపై కమిటీ ప్రతినిధులు.. ఈ నెల 21 నుంచి 25వరకూ చర్చించే అవకాశాలున్నాయి. 2020, 21 సంవత్సరాలకు గానూ.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా.. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కితే రామప్ప వైభవం విశ్వవ్యాప్తమౌతుంది. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుంది. ప్రపంచం నలుమూలనుంచి పర్యాటకులు రామప్పకు విచ్చేస్తారు.

ఈ ఆలయ నిర్మాణం దాదాపు 40 ఏళ్లపాటు కొనసాగింది. 1173లో ప్రారంభించి 1213లో పూర్తి చేశారు. సాధారణంగా చారిత్రక ఆలయాలు.. అవి కట్టించిన రాజుల పేరుమీద కానీ, ప్రాంతం పేరు మీద కానీ కొనసాగుతాయి. రామలింగేశ్వర స్వామి దయతో ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం. -స్థానికుడు, పాలెంపేట

ఈ ఆలయ నిర్మాణం చాలా గొప్పది. 25 ఏళ్ల తర్వాత ఈ ఆలయానికి మళ్లీ వచ్చాను. ప్రభుత్వం రామప్ప ప్రాంగణాన్ని చాలా అభివృద్ధి చేసింది. ప్రఖ్యాత కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించి ఆదరించాలని కోరుకుంటున్నాను. -పర్యాటకుడు

సజీవ శిల్పాల్లా

ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో కొలువైన రామప్ప ఆలయం శిల్పసంపదకు చిరునామాగా చెప్పాలి. 1213లో నిర్మించిన ఈ కాకతీయ కట్టడంలో ఆలయంలో చెక్కిన శిల్పాలు.. సజీవ ప్రతిమల్లా కనిపించటం రామప్ప ప్రత్యేకత. పీఠం నుంచి పైనున్న శిఖరం వరకూ సాగిన నిర్మాణ కౌశలం చూపరులను అబ్బురపరుస్తుంది. ఆలయ శిఖరం బరువు లేకుండా ఉండేందుకు.. నీటిలో తేలిపోయే ఇటుకలతో ఈ కట్టడాన్ని నిర్మించారు. వారసత్వ హోదా దక్కించుకునేందుకు రామప్ప... కీలకమైన ఎన్నో దశలను దాటి ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది.

రామప్ప ఆలయం మా ఊళ్లో ఉండటం మాకు గర్వకారణం. రెండేళ్ల క్రితం యునెస్కో ప్రతినిధులు రామప్ప కట్టడాన్ని పరిశీలించారు. ఈ ఆలయానికి వారసత్వ హోదా దక్కితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ప్రస్తుత కాలంలో ఇలాంటి కట్టడాలు లేవు. స్థానికంగా దొరికే రాళ్లతోనే ఇంత అద్భుతమైన శిల్పాలు చెక్కడం దేశానికే గర్వకారణం. ఇలాంటి కట్టడాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. దేశంలో ఎక్కడెక్కడో తిరుగుతాం. కానీ రాష్ట్రంలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. రామప్పను యునెస్కో గుర్తించి మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఆశిస్తున్నాం. పర్యాటకులు

పలుమార్లు నివేదికలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామప్పకు వారసత్వ హోదాకోసం ఎంతో కృషి చేశాయి. ఆలయ విశిష్టతలను తెలుపుతూ.. పలుమార్లు యునెస్కో ప్రతినిధులకు... దృశ్యరూపం, నివేదికల రూపంలో సమగ్ర సమాచారాన్ని పంపించాయి. వారసత్వ హోదా దక్కడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న రామప్ప ఆలయానికి తప్పకుండా హోదా దక్కుతుందని... పర్యాటకులు, స్ధానికులు ఆశాభావంతో ఉన్నారు.

రామప్ప ఆలయం

ఇదీ చదవండి: Raghunandan rao: విభజన చట్టం ప్రకారమే నోటిఫికేషన్: రఘునందన్​ రావు

Last Updated :Jul 16, 2021, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.