ETV Bharat / state

మహిళా "మణులు": ఈ అతివలు అనన్య సామాన్యులు... ఆదర్శ ప్రాయులు!

author img

By

Published : Sep 27, 2020, 11:36 AM IST

ఆడపిల్ల మన కడుపున పుడితే బాగుండు అనుకునే వారెందరో.. అమ్మాయిల్ని కనడమే కాదు.. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. అలా ఎదిగిన ఆ పుత్రికా రత్నాలు కన్నవారి కలలను నెరవేరుస్తూ వారికి గుర్తింపు తెస్తున్నారు. అలాంటి ఆడపిల్లలను చూస్తే ఎవరికైనా కంటే కూతుర్నే కనాలని అనిపించక మానదు. నేడు కుమార్తెల దినోత్సవం సందర్భంగా ఉన్నత స్థానాల్లో నిలవడమే కాదు.. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న ఆడబిడ్డలపై ప్రత్యేక కథనం.

daughters day
daughters day

ప్రజల కష్టాన్ని తనదిగా భావించి..

ఎంత ఎత్తుకెదిగినా మాకు మాత్రం ‘బుజ్జమ్మే’ అంటున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క(అనసూయ) తల్లిదండ్రులు సమ్మయ్య, సమ్మక్క. ‘ఎన్ని కష్టాలనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటుంది. ప్రజలకు ఏ కష్టమొచ్చినా తనదిగా భావించి వారికి ఆసరాగా ఉంటుంది. కష్టమొచ్చిన వారికి చేయూతనందిస్తుంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఎంతదూరమైనా వెళుతుంది. ఎంత బిజీగా ఉన్నా మాతో గడపడానికి మా జంగాలపల్లి (ములుగు మండలం)కి వస్తుంది. సీతక్క వచ్చిందంటే పండగ వాతావరణమే. సీతక్క ప్రజల మనిషంటూ అందరూ కితాబు ఇస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. అప్పుడు అడవి బాట పట్టినా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజలతోనే ఉంటుంది. వారి కన్నీళ్లు తుడుస్తూ అలుపెరగని సేవకురాలిగా అందరికీ అక్కగా చేయూతనిస్తోంది. మా కడుపున పుట్టినా.. మమ్మల్ని చిన్నపిల్లల్లా కంటికి రెప్పలా చూసుకుంటుంద’ంటున్నారు.

‘అలా’ కలెక్టర్లు అయ్యారు..

వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లికి చెందిన అలా నారాయణ దంపతులకు ఇద్దరూ కుమార్తెలు. రెండో కూతురు శశాంక 2014లో, మొదటి అమ్మాయి ప్రియాంక 2015లో ఐఏఎస్‌ సాధించారు. ప్రియాంక ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అదనపు కమిషనర్‌గా, శశాంక మిజోరాం రాష్ట్రంలోని లాంగ్టలై కలెక్టర్‌గా ఉన్నారు. శశాంక భర్త భూపేష్‌ చౌదరి ఇదే రాష్ట్రంలోని సియాహా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక ప్రియాంక భర్త మణిపాల్‌ కుమార్‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ అని నారాయణ వివరించారు. ‘కలెక్టర్‌ కావాలనే కోరిక నాకు బలంగా ఉండేది. కాలేకపోయాను. నా ఇద్దరు కుమార్తెలు ఐఏఎస్‌ సాధించి నా కలను సాకారం చేశారు. ఒక తండ్రికి ఇంతకు మించి ఏమి కావాలి. నాకు ఎంతో సంతోషంగా ఉందని నారాయణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెలు దేశానికి తమ సేవలందిస్తుండటం తల్లిదండ్రులకు ఇంతకుమించి ఏమి కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

తల్లిగా.. అధికారిగా.. సమాజ సేవకురాలిగా..

తండ్రి సర్వర్‌ ఆశయాల బాటలో నడుస్తూ.. పేద ప్రజలను చేరదీస్తూ.. నేటి తరం యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తస్లీమా. ములుగు మండలం రామచంద్రపురానికి చెందిన తస్లీమా సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తూనే కుమార్తెగా మా గౌరవ మర్యాదలను నిలుపుతుండటం గర్వంగా ఉంటోందంటున్నారు ఆమె తల్లి ఫాతిమా. ‘తన భర్త సహకారంతో మెట్టినింట సంప్రదాయాలను అనుసరిస్తూ, తల్లిగా తన బిడ్డలను చూసుకుంటూ ఎందులోనూ తక్కువ చేయకుండా అన్ని పనులు నిర్వహించుకుంటోంది. ఎందరో అనాథలను చేరదీస్తున్న ఆమెను చూసి అమ్మగా నాకు ఎనలేని సంతోషంగా ఉంటుంది. సమాజంలో తను చేసే సేవలు చూసిన వారు అలాంటి కూతురు ఇంటికి ఒకరున్నా చాలు అంటుంటే ఆనందంగా ఉంటుంది. నా కూతురు తస్లీమా నా కడుపులో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటారు ఫాతిమా.

ఇదీ చదవండి : శ్రీరాంసాగర్​కు వరద ఉద్ధృతి... 40 గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.