ETV Bharat / state

గిరిజన రైతు ఆవేదన... పదేళ్లు దాటినా అందని పరిహారం

author img

By

Published : Nov 3, 2020, 2:03 PM IST

రైతుల సాగుకు నీళ్లందించడానికి కృషి చేసే భారీ నీటి పారుదల శాఖే ఏజెన్సీ మండలంలోని ఓ గిరిజన గ్రామంలో పదేళ్ల క్రితం గిరిజనుల భూములు లాక్కోవడమే గాక.. వాటిని తమ అవసరాలకు ఎలాంటి అంగీకారం లేకుండా ఉపయోగించుకుంటున్నారు. సదరు గిరిజన రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించకుండా పదేళ్లకు పైగా తిప్పించుకుంటున్నారు. ఈ విషయమై బాధిత రైతులు ఆ శాఖ ఉన్నతాధికారులను నిలదీయగా మాకు తెలియదంటూ తప్పించుకుపోతున్నారు. దానితో ఆ రైతుల గోడు అరణ్యరోదనగా మిగిలింది.

helipad land victim difficulties in mulugu
గిరిజన రైతు ఆవేదన... పదేళ్లు దాటినా అందని పరిహారం


దేవాదుల ప్రాజెక్టు వద్ద రైతుల పొలాల్లో నిర్మించిన హెలిప్యాడ్‌


రైతుల పొలాల్లో వేసిన అప్రోచ్‌ రోడ్డు

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుట్టలగంగారంలో జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఇన్‌టేక్‌వెల్‌ పనులను దాదాపు పది సంవత్సరాల క్రితం అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వచ్చి ప్రారంభించి వెళ్లారు. అయితే అప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండడం కారణంగా రోడ్డు మార్గంలో వస్తే భద్రత కల్పించడం కుదరదు అనే కారణంగా నీటి పారుదల శాఖ అధికారులు తాత్కాలికంగా పక్కనే ఉన్న గిరిజనుల పొలంలో హెలిప్యాడ్‌ను నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పదేళ్లుగా సదరు గిరిజనుల 5 ఎకరాల పొలాన్ని వీవీఐపీల హెలికాప్టర్‌లను ల్యాండింగ్‌ చేయడానికి ఉపయోగించుకున్నప్పటికీ రూపాయి కూడా పరిహారం చెల్లించలేదని బాధిత రైతులు కోరం నారాయణ, కె.సత్యం, సమ్మయ్య, నారాయణ, కనకయ్య, వెంకటనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల మరొకటి నిర్మించినా..

ప్రస్తుతం ఆ ప్రాంతంలో మరో హెలిప్యాడ్‌ను నిర్మించారు. అయినా సదరు రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది జనవరిలో సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్‌ దేవాదుల ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చినప్పుడు సదరు రైతులు తమ గోడును వెళ్లబోసుకోవడానికి ప్రయత్నించగా పోలీసు అధికారులు వద్దని వారించినట్లు సమాచారం. అటు పరిహారం ఇవ్వక హెలిప్యాడ్‌లను తొలగించక ఇబ్బందులు పెడుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. పొలాలను సాగు చేసుకోవడం కష్టంగా మారిందని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ప్రభుత్వం ముందుకొచ్చేసరికే…రైతులు అమ్మేశారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.