ETV Bharat / state

Godavari Flood Effect : గోదారమ్మ గాయం.. ఉన్నదంతా మాయం

author img

By

Published : Jul 19, 2022, 12:38 PM IST

Godavari Flood Effect
Godavari Flood Effect

Godavari Flood Effect : భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరదలు తగ్గినా గోదావరి ముంపు వాసుల కష్టాలు కోకొల్లలు. నీడనిచ్చే గూడు దెబ్బతిని...వేసిన పంటలు నష్టపోయి కన్నీళ్లే మిగిలాయి. సర్వస్వం కోల్పోయి బురదమయంగా మారిన ఇళ్లలో ఉండలేక నానా అవస్ధలు పడుతున్నారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక దుర్భర పరిస్థితులతో సావాసం తప్పడం లేదని వాపోతున్నారు. ఇరుకైన గదుల్లో ఎక్కువమంది ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదముందని వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరద విలయం.. బురద నిలయం

Godavari Flood Effect : భారీ వర్షాలు, వరదలతో కుదేలైన గోదావరి పరివాహక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని జనం ముంపు సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు. వరద తీవ్రత తగ్గుముఖం పట్టడంతో జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. తడిసిన వస్తువులు, బుదరమయంగా మారిన ఇళ్లను బాగుచేసే పనిలోపడ్డారు. ఇళ్లలో సామగ్రి అంతా వరదలో తడిసిపోయాయని... బియ్యం ముక్కపట్టి తినేందుకు పనికిరాకుండా పోయాయని వాపోతున్నారు. పునరావాస కాలనీల్లో వసతులు సరిగా లేవని ఆరోపిస్తున్న బాధితులు ఉడికీ ఉడకని అన్నం పెడుతున్నారని చెబుతున్నారు.

Godavari Flood Effect in bhupalpally : భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముత్తారం, పలిమెల, మహదేవ్ పూర్, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండల వాసులకు వరదలు కడగండ్లనే మిగిల్చాయి. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లోని దాదాపు 11 వేల మంది నిరాశ్రయులయ్యారు. మొండిగోడలుగా మిగిలిన ఇళ్లను చూసి బాధితులు లబోదిబోమంటున్నారు.

ఏటా వరదల వల్ల వచ్చే విపత్తులతో సమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. దుస్తులు, పిల్లల పుస్తకాలు, టీవీ, పరుపులు తడిసిపోయాయని మళ్లీ పడుతున్న భారీ వర్షాలతో జనం జంకుతున్నారు. ఉప్పెనలా విరుచుకుపడ్డ వరద దెబ్బకు గొడ్డుగోధ, కోళ్లు, మేకలను ఉన్నఫలంగా వదిలేసి ప్రాణాలు దక్కించుకున్నామని ప్రకృతి విపత్తును తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

Godavari Flood Effect in Mulugu : ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వరద చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 29 వరకు భారీ వర్షాలుంటాయన్న సీఎం ఆదేశాలతో ములుగు , వరంగల్‌, హన్మకొండ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. బాధిత కుటుంబానికి పదివేలు, 25 కిలోల బియ్యం, 5 కిలోల పప్పు చొప్పున అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. వరదలు చిక్కుకున్నవారిని రక్షించేందుకు హెలికాప్టర్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏటూరునాగారంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో సౌకర్యాలు, భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. వరద బాధితులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.

మహబూబాబాద్ జిల్లాలో వరదలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, విషజ్వరాలు ప్రబలకుండా వైద్యశిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ మండలం కొత్తగూడలో పర్యటించిన ఆయన.. వరదప్రభావిత ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యాధులు రాకుండా నీరు నిల్వలేకుండా చూడాలని, మురికి కాల్వల వద్ద బ్లీచింగ్ వేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రాచలంలో 300 మంది విధులు నిర్వర్తించే సీఆర్పీఎఫ్‌ 141 బెటాలియన్ క్యాంపును వరద చుట్టుముట్టి భారీ నష్టాన్ని కలిగించింది. క్యాంపులోని నిత్యావసరాలు, ఫర్నీచర్, కమ్యునికేషన్‌ పరికరాలు సహా ఇతర కార్యాలయ సామగ్రి దెబ్బతిన్నాయి. వరద ఉద్ధృతి పెరగడంతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో 60 మంది వరదలో చిక్కుకోగా.. సహాయక సిబ్బంది వారిని పడవల ద్వారా మైదాన ప్రాంతానికి చేర్చారు.

Godavari Flood Effect in Bhadradri : భద్రాచలం పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. లోతట్టు ప్రాంతాలైన సుభాష్ నగర్, అయ్యప్ప కాలనీ రామాలయం ప్రాంతాల్లో వరద పరిస్థితిని పరిశీలించారు. సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

బూర్గంపాడు మండలం సారపాకలో నీటమునిగిన కాలనీల ప్రజలకు వికాసతరంగిణి స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు ఉచితంగా భోజనం అందించారు. సమీప గ్రామాల్లోని ప్రజలకు ఐటీసీ పేపర్‌ మిల్‌ సంస్థ ఆహారం అందజేస్తోంది. సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ఆదేశాలతో భద్రాచలం రామాలయం పరిసరాల్లో వరదను భారీ మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. ఇల్లందు నుంచి తెప్పించిన మోటార్ల ద్వారా వరద జలాలను తిరిగి నదిలోకి పంపింగ్‌ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.