ETV Bharat / state

మేడారం మహాజాతర.. గిరిజనుల మహా కుంభమేళా..!

author img

By

Published : Feb 14, 2022, 6:30 AM IST

Medaram Jatara 2022 Story : కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర ఏదయినా ఉందంటే... అది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరే. ప్రతి రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగురోజులపాటు కన్నుల పండువగా జరిగే ఈ గిరిజనుల జాతరకు హాజరై... మొక్కులు చెల్లించుకుంటే సర్వ శుభాలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Medaram Jatara 2022 Story, sammakka saralamma jatara
గిరిజనుల మహా కుంభమేళా..!

Medaram Jatara 2022 Story : మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర... తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారంలో రెండేళ్లకోసారి అంగరంగవైభవంగా నిర్వహించే మహా గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దాదాపు కోటిమంది వస్తారని అంటారు.

సమ్మక్క-సారలమ్మ గద్దెలు

జాతర ఎలా మొదలయిందంటే...

ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు కోయదొరలు గోదావరి తీరంలోని అడవికి వేటకు వెళ్తే... అక్కడ ఓ పాప పులుల మధ్య ఆడుకుంటూ కనిపించిందట. వాళ్లు ఆ పాపను తీసుకొచ్చి సమ్మక్క అని పేరు పెట్టారు. ఆమె ఆ గ్రామానికి వచ్చాక తన మహిమలతో అందరినీ కాపాడటంతో ఆమెను వనదేవతగా కొలిచేవారట. కొన్నాళ్లకు ఆమెకు మేడారం ప్రాంతాన్ని పాలించే కాకతీయుల సామంత రాజు పగిడిద్ద రాజుతో వివాహమైంది. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. వారిలో సారలమ్మను గోవిందరాజులు మనువాడాడట. కొన్నాళ్లకు కరవు కారణంగా ఊరివాళ్లు కాకతీయులకు పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వం ఆ తండాలపైన యుద్ధం చేయాలనుకుంది. ఇది తెలిసి ఊరివాళ్లూ పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు... నాగులమ్మ, సారలమ్మ, గోవిందరాజులు మేడారం సరిహద్దులోని సంపెంగవాగు వద్ద నేలకూలారు. జంపన్న కూడా సంపెంగవాగులో ఆత్మార్పణ చేసుకున్నాడట. దాంతో సమ్మక్క అపరకాళికలా కత్తిపట్టి యుద్ధ రంగంలోకి దిగి వీరోచితంగా పోరాడింది. చివరకు ఓ సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడవడంతో ఆమె రక్త మోడుతూ మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టవైపు వెళ్లి ఓ మలుపులో మాయమైందట. విషయం తెలిసిన కోయగూడెం వాసులు దివిటీలతో గాలిస్తే గుట్టమీదున్న నెమలినార చెట్టుకింద పుట్ట దగ్గర ఓ కుంకుమభరిణె కనిపించిందట. అంతలోనే ‘ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తీ వీరుడిగానే రాజ్యాన్ని పాలించాలి. ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే భక్తుల కోర్కెలు నెరవేరుస్తా...’నంటూ ఆకాశవాణి వినిపించిందట. గిరిజనులు ఆ మాటల్నే అమ్మ ఆదేశంగా భావించారట. కొన్నాళ్లకు ప్రతాపరుద్రుడు గిరిజనులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించి, రెండేళ్లకోసారి జాతరను నిర్వహించాలంటూ ఆదేశాలు జారీచేశాడు. అలా ఈ జాతర మొదలయిందని చెబుతారు.

Medaram Jatara 2022 Story, sammakka saralamma jatara
గిరిజనుల మహా కుంభమేళా..!

విగ్రహాలు లేని వేడుక...

ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనున్న ఈ జాతరకు వచ్చే భక్తులు మొదట ఊరి పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేసి జంపన్న గద్దెకు మొక్కి, తరువాత సమ్మక్క- సారలమ్మ దర్శనానికి బయలుదేరతారు. ఈ వేడుకలో వెదురుకర్ర, కుంకుమభరిణెలే ఉత్సవమూర్తులు. మొదటి రోజున సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. కన్నేపల్లి నుంచి సారలమ్మను ఆరుగురు పూజారులు ఊరేగింపుగా తీసుకొస్తే... కొత్తగూడ మండలం పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. గోవిందరాజులును ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి ‘కాక’ వంశస్థులు తీసుకొస్తారు. చివరగా సమ్మక్కను కుంకుమభరిణె రూపంలో చిలకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు ఏ ఆర్భాటాలూ లేకుండా తెచ్చి గద్దెపైన ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున భక్తులు దేవతలకు బంగారం (బెల్లం), పసుపు-కుంకుమ, ఇతర కానుకల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగో రోజున దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.

విగ్రహాలు లేని వేడుక

ఎలా చేరుకోవచ్చు

ఈ జాతరకు వచ్చే భక్తులు వరంగల్‌ వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకుంటే.. అక్కడినుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: Medaram Jatara 2022 : మేడారం జాతరకు కేంద్రం నిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.