ETV Bharat / state

YS Sharmila on CM KCR: 'అన్నదాత ఆత్మహత్యలకు కేసీఆరే కారణం'

author img

By

Published : Dec 19, 2021, 7:52 PM IST

YS Sharmila on CM KCR: పండించిన పంటలను ప్రభుత్వం కొనకపోవడం, యాసంగిలో వరి వేయెద్దని చెప్పడం, రుణాలు మాఫీ చేయకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్​ షర్మిల అన్నారు. అన్నదాతల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊసరవెళ్లిలా మాటలు మారుస్తున్నారని.. ఒకసారి సన్న బియ్యం వేయాలని, ఇంకోసారి అసలు వరి వేసుకోవద్దని, మరోసారి ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని చెబుతున్నారని ధ్వజమెత్తారు.

YS Sharmila on CM KCR: 'అన్నదాత ఆత్మహత్యలకు కేసీఆరే కారణం'
YS Sharmila on CM KCR: 'అన్నదాత ఆత్మహత్యలకు కేసీఆరే కారణం'

YS Sharmila on CM KCR: వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్​ షర్మిల చేపట్టిన 'రైతు ఆవేదన యాత్ర' ఆదివారం ప్రారంభమైంది. మొదటిరోజు మెదక్ జిల్లాలోని నర్సాపుర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలోని కంచన్ పల్లి, లింగంపల్లి గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగింది. ఆత్మహత్యలు చేసుకున్న ముగ్గురు రైతుల కుటుంబాలను వైఎస్​ షర్మిల కలిసి పరామర్శించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు గుండ్ల శ్రీకాంత్, శేఖర్, మహేష్ కుటుంబాలకు షర్మిల ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చారు.

రైతు కుటుంబాలకు పరామర్శ

YS Sharmila Raithu Aavedhana yatra: కంచన్ పల్లి గ్రామానికి చెందిన రైతు గుండ్ల శ్రీకాంత్(25) అప్పులు పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్​కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన మరో రైతు మహేష్ తనకున్న రెండు ఎకరాల్లో భూమి ఉండగా 10 బోర్లు వేసినా నీళ్లు రాలేదు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు కూడా రాలేదు. దీంతో అప్పులు పెరిగి ఆత్మహత్య చేసుకున్నాడు. లింగంపల్లి గ్రామంలో షేకులు అనే రైతుకు రెండెకరాల భూమి ఉండగా ఫైనాన్స్ కింద ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. మధ్యంతరంగా ఫైనాన్స్ పెంచడం, పంట సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగాయి. ఈ ముగ్గురు కుటుంబాలకు ప్రభుత్వ ఎలాంటి సాయం చేయకపోగా, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం వచ్చి చూడలేదు. ఆయా కుటుంబాలను వైఎస్​ షర్మిల పరామర్శించి, ధైర్యం చెప్పారు.

ఆ పాపం కేసీఆర్​దే..

YS Sharmila: పండించిన పంటలను ప్రభుత్వం కొనకపోవడం, యాసంగిలో వరి వేయెద్దని చెప్పడం, రుణాలు మాఫీ చేయకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్​ షర్మిల అన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ పాపం కేసీఆర్​దేనని... ఈ ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఊసరవెళ్లిలా మాటలు మారుస్తున్నారని.. ఒకసారి సన్న బియ్యం వేయాలని, ఇంకోసారి అసలు వరి వేసుకోవద్దని, మరోసారి ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని చెబుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. వరి వేయొద్దని చెప్పే ముఖ్యమంత్రి కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినట్టు? లక్షల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారని వైతెపా అధినేత్రి షర్మిల ప్రశ్నించారు.

ఆ బాధ్యత ప్రభుత్వానిదే..

ఆ భారాన్ని అంతా రాష్ట్ర ప్రజలపై మోపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు బిల్లులే వేలకోట్లు అవుతున్నాయి. కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతూ రైతులను నట్టేట ముంచుతున్నాడు. ఇలా ఎంత మంది రైతులను ఆత్మహత్య బాట పట్టిస్తూ.. ఇంకెంత మంది రైతులను పొట్టన పెట్టుకుంటావు కేసీఆర్?. బావులు, చెరువులు, కాల్వల కింద తెలంగాణలో భూములు వేల ఎకరాల్లో ఉన్నాయి. తాతల కాలం నుంచి చెరువు కింద భూములు ఉన్న రైతులు వరినే పండిస్తున్నారు. ఎవరిని అడిగి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసి ఇచ్చారు. వరి వేయబోమని కేసీఆర్ కేంద్రానికి లేఖలో సంతకం ఎలా చేస్తాడు?. కేసీఆర్​కు ఏ హక్కు ఉందని ఈరోజు వరి వేసుకోవద్దని చెబుతున్నాడు. మద్దతు ధర ఉంది అంటే దాని అర్థం వరి వేసుకునే హక్కు ఆ రైతుకు ఉంది. వరి వేసిన ఆ రైతు పంట కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. -వైఎస్​ షర్మిల, వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

బాధిత కుటుంబాల‌కు రూ.25ల‌క్ష‌లు ఇవ్వాలి..

YS sharmila padayatra: వరి వేయవద్దని చెప్పే హక్కు కేసీఆర్​కు ఎక్కడిదని వైఎస్​ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ అనుచిత నిర్ణయాలు, దిక్కుమాలిన పాలనతో ఈరోజు ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 70 రోజుల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఈ పాపం కేసీఆర్​ది కాదా అంటూ ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ.25లక్షలు అందజేయాలని వైఎస్​ షర్మిల డిమాండ్ చేశారు. యాసంగిలో వరి కొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను డిమాండ్​ చేశారు.

తెలంగాణ రైతులవి ప్రాణాలు కావా..

వైఎస్సార్​ తెలంగాణ పార్టీ స్థాపించిందే రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు.. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండుగ చేస్తానని.. రైతును రాజును చేస్తామని, బంగారు తెలంగాణ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 7 ఏండ్లు అవుతున్నా రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ అంటున్నాడు. అమ్మకు అన్నం పెట్టడు గానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. మన రాష్ట్రంలో ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని కేసీఆర్ హర్యానాలో రైతులు చనిపోతే ఒక్కొక్కరికీ రూ.3లక్షలు ఇస్తానని అన్నాడు. తెలంగాణ రైతులవి ప్రాణాలు కావా. -వైఎస్​ షర్మిల, వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

ఎన్నికల హామీలో ఇచ్చిన ఒక్కమాట కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని వైఎస్​ షర్మిల ఆరోపించారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మూడెకరాల భూమి ఇలా ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని విమర్శలు గుప్పించారు. పింఛన్ కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటూ ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:

YS Sharmila Padayatra:నేడు రైతు ఆవేదన యాత్ర.. కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.