ETV Bharat / state

'సంగీతం, సినిమా, నాట్యం, మిమిక్రీ.. ఏ రంగమైన రాణించడమే ఆమె లక్ష్యం'

author img

By

Published : Dec 19, 2021, 5:42 PM IST

All Rounder Jahnavi: ఆ బాలిక నాలుగేళ్ల వయసు నుంచే.. తానేంటో నిరూపిస్తోంది. ప్రతి సంవత్సరం ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ప్రతిభకు పూల బాట వేస్తూ వస్తోంది. ఏ రంగంలోనైనా రాణించగలనని ప్రపంచానికి చాటి చెబుతోంది. వయసు 15 ఏళ్లే... కానీ 17 భాషల్లో పాటలు పాడుతోంది. తన గొంతులో పాట ఒదిగిపోతుంది.. మాట మెలికలు తిరుగుతోంది. ముఖంలో హావభావాలు నాట్య మాడుతాయి. సంగీతం, సినిమా, నాట్యం, మిమిక్రీ ఇలా.... రంగం ఏదైనా నేనే "రాణి" అని నిరూపించుకుంటోంది.

All Rounder Jahnavi
జాహ్నవి

'సంగీతం, సినిమా, నాట్యం, మిమిక్రీ.. ఏ రంగమైన రాణించడమే ఆమె లక్ష్యం'

All Rounder Jahnavi: మంచిర్యాలకు చెందిన సుజాత, మురళి దంపతుల ఏకైక కుమార్తె జాహ్నవి. స్థానిక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు చిన్నతనం నుంచే జాహ్నవి పాటలు పాడడంలో ఆసక్తి చూపడంతో.. తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అలా పాటలు పాడటం ప్రారంభించిన ఆమె ప్రస్తుతం 17 భాషల్లో పాటలు పాడుతోంది. తెలుగు, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, మరాఠీ... తమిళ్, నేపాలి, కన్నడ, ఒరియా, ఉర్దూ... హిందీ, బెంగాలీ, లంబాడి, మలయాళం, దక్షిణాఫ్రికా భాషల్లో అద్భుతంగా పాటలు పాడుతోంది.

2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరబ్ దేశాలలో పర్యటించినప్పుడు మన జాతీయ గీతాన్ని అరబ్ భాషలో అక్కడ ఆలపించారు. అరబ్​లో పాడిన పాటలను విని జాహ్నవి నేర్చుకుని పాడుతోంది. ఆన్​లైన్​లో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. అంతేకాకుండా ఆమె ఎంతో చక్కగా హార్మోనీయంను వాయిస్తోంది. తన నాలుగో ఏటే వేదికపై వివిధ అంశాల్లో ప్రదర్శన ఇచ్చింది. చిన్నప్పటి నుంచే నృత్యం చేసేది.. పాటలు పాడేది, డైలాగులు చెప్పేది, మిమిక్రీ చేసేది. ఎక్కడ ఏ పోటీల్లో పాల్గొన్నా ప్రథమ బహుమతి సాధించేది జాహ్నవి.

మిమిక్రీలోనూ రాణిస్తూ..

బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన బాలోత్సవ్ 2021 పాటల పోటీలో జాహ్నవి పాల్గొని ప్రథమ బహుమతి సాధించింది. ప్రథమ బహుమతి సాధించిన ఆమెకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించి ప్రదానం చేశారు. వరుస మూడేళ్లుగా జాహ్నవి బాలోత్సవ్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధిస్తోంది. జాహ్నవి పాటలతో పాటు మిమిక్రీ అదరగొడుతోంది. రాజకీయ నాయకుల్లా డైలాగులు చెబుతుంది. ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక సినిమాల డైలాగులను అద్భుతంగా చెబుతోంది. పాంచాలి... పంచభద్రుక... అంటూ దుమ్ము దులిపేస్తోంది.

'నాకు పాటలు పాడడమంటే చాలా ఇష్టం. చిత్ర, ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం పాటలంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరే నాకు రోల్ మోడల్. ఎన్టీ రామరావు చెప్పిన అన్ని డైలాగులను మిమిక్రీ చేయగలను. మా అమ్మనాన్నలిద్దరు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. నాకు భవిష్యత్తులో మంచి సింగర్ కావాలని ఉంది'

- జాహ్నవి

వెండితెరపై కూడా జాహ్నవి ఆరేళ్ల వయసులో మొట్టమొదటి సారిగా సినిమాలో నటించింది. తెలుగు హీరో సంపూర్ణేష్ బాబు నటించిన సాహసం చేయరా డింబకా సినిమాలో దెయ్యం పాత్రలో అద్భుతంగా నటించింది. మరొక రెండు సినిమాల్లోనూ యాక్ట్​ చేసింది. పలు తెలుగు ఛానెల్స్​లో జాహ్నవి తన ప్రతిభను చాటింది. ఆమె భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి ఎదుగుతుందని.. కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బహుళ కళల్లో రాణిస్తున్న జాహ్నవి.. మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనం కూడా ఆశిద్దాం.

ఇదీ చూడండి: Intermediate Results in TS: పరీక్ష తప్పిన వారిలో.. సర్కారు విద్యార్థులే అధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.