ETV Bharat / state

యూట్యూబ్​లో చూసి నేర్చుకుని.. దుమ్ములేపే సంగీత దర్శకుడయ్యాడు..

author img

By

Published : Jun 25, 2022, 1:23 PM IST

Virataparvam and chorbazar movies music director suresh bobbili story
Virataparvam and chorbazar movies music director suresh bobbili story

Music Director Suresh Bobbili: రేకు డబ్బాలపై దరువేస్తూ పాటని హత్తుకున్నాడు... కూలి పనులు చేస్తూ సరిగమల్ని ఆరాధించాడు... అంతర్జాలాన్నే గురువులా మార్చుకొని బాణీలు పేర్చాడు... కడగండ్లు ఎదురీదుతూ కడకు కల నెరవేర్చుకున్నాడు... తనే సంగీత దర్శకుడు సురేశ్​ బొబ్బిలి... "విరాటపర్వం"తో వెలుగులోకి వచ్చిన ఈ తెర సాధకుడి ప్రయాణం చదివేద్దాం రండి..

Music Director Suresh Bobbili: సురేశ్​ది మహబూబాబాద్‌ జిల్లా గౌరారం. నాన్న శంభయ్య రంగస్థల కళాకారుడు. అమ్మ కాంతమ్మ గాయకురాలు. వారి వల్లే తనకి పాటపై మమకారం మొదలైంది. అమ్మ పాడుతున్నప్పుడు తను వంత పాడేవాడు. గురువులాంటి ఆ అమ్మ అనారోగ్యంతో, ఐదేళ్ల కిందట నాన్న విద్యుదాఘాతంతో చనిపోయారు. వాళ్లు పోయినా వారసత్వంగా అందిన పాటని వదల్లేదు సురేష్‌. తను బాగా పాడటంతో స్కూల్లో హీరోలా చూసేవారు. టీచర్లకీ తనంటే ఇష్టం. మహబూబాబాద్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకునేటప్పుడు సెలవుల్లో సైతం ఇంటికెళ్లేవాడు కాదు. దుస్తులు భద్రపరచుకునే ఇనుప పెట్టెలపై కొడుతూ పాడుకునేవాడు. ఎక్కడున్నా పాటతోనే సహజీవనం చేసేవాడు.

సురేష్‌ అన్నయ్య నందన్‌రాజ్‌ సంగీత దర్శకుడు చక్రితో కలిసి అప్పట్లో ‘చక్రి సాహితీ కళా భారతి’ పేరుతో ఆర్కెస్ట్రా ప్రారంభించాడు. అప్పుడప్పుడు ఆ గ్రూపుతో కలిసి వెళ్లేవాడు సురేష్‌. తర్వాత చక్రికి సినిమాల్లో మంచి పేరు రావడంతో ఆయనలా పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావాలనే కోరిక మొదలైంది. దానికోసం ఓ స్నేహితుడితో కలిసి వరంగల్‌లో కొన్నాళ్లు సంగీతం నేర్చుకున్నాడు. ఆపై కెరియర్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. అప్పటికే వాళ్ల అన్నయ్యకు అక్కడ ఓ స్టూడియో ఉండేది. అందులో పని చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. తనకేమో సరిగమల ప్రపంచంలోనే విహరించాలని కోరిక. ఆ ఆశ చంపుకోలేక హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. మరోవైపు పూట గడవని పరిస్థితి. దాంతో ఒక కంపెనీలో చేరి పాల ట్రేలు ఎత్తి వ్యాన్లలో పెట్టే పనిలో కుదిరాడు. ఇంకొన్నాళ్లు కొత్త ఇళ్లకు లప్పం పెట్టే పనులు చేశాడు. అవీఇవీ చేస్తూ.. కొన్నాళ్లకు మళ్లీ అన్నయ్య దగ్గరికెళ్లాడు. ఎంతో బతిమాలి స్టూడియోలోనే ఆఫీస్‌బాయ్‌గా చేరాడు. పొద్దంతా పనులు చేస్తూనే టెక్నీషియన్లని గమనించేవాడు. వాళ్లు వెళ్లిపోయాక రాత్రి సిస్టమ్‌ ఆన్‌ చేసేవాడు. అలా ఆరేడు నెలల్లోనే సౌండ్‌ ఇంజినీరింగ్‌ పని మొత్తం సొంతంగా నేర్చుకున్నాడు. కొన్నాళ్లయ్యాక అక్కడి సౌండ్‌ ఇంజినీర్‌ వెళ్లిపోడంతో ఆ బాధ్యతలు అందుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి వయొలిన్, కీబోర్డు నేర్చుకున్నాడు. ఈ అనుభవంతో జానపద పాటలకు సరిపోయేలా కొన్ని బాణీలు కట్టాడు. వాటిని రచయిత మిట్టపల్లి సురేందర్‌కి వినిపిస్తే.. బాగున్నాయని చెప్పి ట్యూన్‌కి తగ్గట్టు పాట రాశాడు. అదే ‘నన్ను కన్న నా తల్లి జన్మభూమి..’ ఆ పాట పెద్ద హిట్‌ అయ్యింది. ఆ ఊపులో చాలా జానపద, బతుకమ్మ పాటలకు బాణీలు సమకూర్చాడు. ఈక్రమంలో దర్శకుడు వేణు ఊడుగుల ఒక యాడ్‌ఫిల్మ్‌ నేపథ్య సంగీతం కోసం స్టూడియోకు వచ్చారు. ఆ పని వేగంగా చేసి ఇవ్వడంతో ఆశ్చర్యపోయి ‘ఒక పాటకి ట్యూన్‌ కంపోజ్‌ చేసి ఇవ్వగలవా?’ అని అడిగారు. అప్పటికప్పుడే చేసి ఇవ్వడంతో అది నచ్చి తన తొలి సినిమా ‘నీది నాదీ ఒకే కథ’కి అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంతోపాటు సంగీతానికీ మంచి పేరు రావడంతో సురేష్‌కి వరుస అవకాశాలొచ్చాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘మా అబ్బాయి’, ‘జార్జిరెడ్డి’, ‘గువ్వా గోరింక’లకి సంగీత దర్శకుడిగా మెప్పించాడు. తాజాగా ‘విరాటపర్వం’, ‘చోర్‌ బజార్‌’ చిత్రాలకు పని చేశాడు.

విరాటపర్వం చేస్తున్నప్పుడు సురేష్‌ ఆరోగ్యం దెబ్బతింది. ఆసుపత్రిలో చేరాడు. సమయానికి ట్యూన్స్‌ చేయలేకపోయాడు. నిర్మాతలు వేరేవాళ్లని చూసుకుందాం అన్నారు. సాయిపల్లవి, వేణు ఊడుగుల.. ‘సురేష్‌ చేస్తేనే బాగుంటుంద’ని పట్టు పట్టారు. డిశ్చార్చి అయిన వెంటనే నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు. దానికి ఫలితం దక్కింది. ఆ సంగీతం బాగుందంటూ పరిశ్రమలోని చాలామంది పెద్దలు ఫోన్‌ చేసి మెచ్చుకున్నారంటున్నాడు సురేష్‌. ఈ ప్రోత్సాహంతో జనం మెచ్చేలా మరిన్ని మంచి ట్యూన్స్‌ అందిస్తానంటున్నాడు.

* హాస్టల్‌లో ఉన్నప్పుడు రీటా మేడమ్‌ నన్ను బాగా ప్రోత్సహించేవారు. నాతో ప్రత్యేకంగా పాటలు పాడించుకునేవారు.

* పదివేలమంది ఉన్న వేదిక మీద నిల్చొని, గిటార్‌ వాయిస్తూ.. సొంతంగా సంగీతం సమకూర్చిన పాట పాడాలనేది నా కల.

* ఇంటర్లో ఒకమ్మాయిని ప్రేమించా. తనకోసం నాలుగు ప్రేమ పాటలు రాశా. కానీ తనకిచ్చే ధైర్యం చేయలేకపోయా. ఆమె వల్లే నాలోని రచయిత బయటికొచ్చాడు.

* జమిడికా, ఒగ్గుడోలు, గ్లార్‌నెట్, మర్ఫా, బూరలాంటి వాయిద్య పరికరాలకు ఆధునిక సంగీతాన్ని అద్ది కొన్ని కొత్త శబ్దాలు పుట్టించాను. వాటినే నా ఆల్బమ్స్, సినిమా పాటలు, నేపథ్య సంగీతంలో వాడుతుంటా.

* ఏ రంగంలో ఉన్నా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి నేను పాప్‌ ఆల్బమ్స్, ఇండిపెండెంట్‌ మ్యూజిక్, మెలోడీలు బాగా వింటుంటా.

* జార్జిరెడ్డి, నీదీ నాదీ ఒకే కథ చిత్రాలకు పాడిన గాయకులకు గుర్తింపు, అవార్డులొచ్చాయి. సినిమాల్లో పని చేయాలనే కోరికను పరిశ్రమ నెరవేర్చింది. అదే నాకు పెద్ద అవార్డు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.