ETV Bharat / state

Joyful Learning: ఆచరణాత్మక బోధనకు జాతీయ స్థాయి గుర్తింపు..

author img

By

Published : Feb 26, 2022, 5:55 AM IST

Joyful Learning: పాఠశాలలోని బోధనా సామాగ్రితో విద్యార్థులకు ఉపాధ్యాయులు సైన్స్ నేర్పుతుంటారు. సామాగ్రి లేకపోతే బ్లాక్ బోర్డుపై పాఠాలతో సరిపెట్టేస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీధర్‌ మాత్రం.... వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు, తక్కువ ధరకు దొరికే సామాగ్రిని విద్యార్ధులతోనే సేకరింపజేస్తూ... సైన్స్ నేర్పిస్తున్నారు. 'జాయ్ ఫుల్ లర్నింగ్ విత్... సెల్ఫ్ కలెక్టెడ్ మెటిరీయల్' పేరిట శ్రీధర్‌ సమర్పించిన పరిశోధనా పత్రానికి జాతీయస్థాయిలో వెండిపతకం లభించింది.

Silver Medal to mahaboobnagar teacher For  Joyful learning with self-collected material
Silver Medal to mahaboobnagar teacher For Joyful learning with self-collected material

ఆచరణాత్మక బోధనకు జాతీయ స్థాయి గుర్తింపు..

Joyful Learning: బోధనా సామాగ్రితో ప్రయోగాలు చేయడం కంటే... పిల్లలతోనే వస్తువుల్ని సేకరింపజేసి, వారితోనే ప్రయోగాలు చేయిస్తే.... ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిరూపించారు మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్. నవాబుపేట మండలం ఎన్మన్‌గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీధర్ సొంతంగా సేకరించిన వస్తువులతో విద్య నేర్చుకోవడమనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించి జాతీయ స్థాయిలో వెండి పతకానికి ఎంపికయ్యారు.

జాతీయ మండలిలో శాశ్వత సభ్యత్వం..

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ శాస్త్రవేత్తల జాతీయ మండలి రెండో భారతీయ సైన్స్ టెక్నో ఉత్సవాలను వర్చువల్‌గా నిర్వహిస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల నుంచి వినూత్న బోధన రీతులపై ఆన్‌లైన్‌లో పరిశోధన పత్రాలు కోరింది. ఉత్తమ పత్రాల్లో 10మందిని ఎంపిక చేయగా అందులో శ్రీధర్ చోటు సంపాదించుకున్నారు. ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పతకంతోపాటు జాతీయ మండలిలో శాశ్వత సభ్యత్వం అందుకోనున్నారు.

సొంతగా ప్రయోగాలు చేస్తూ..

పరిశోధన కోసం 54 మంది తొమ్మిదో తరగతి విద్యార్ధులను... శ్రీధర్ ఎంచుకున్నారు. ముందుగా సామర్ధ్య పరీక్ష నిర్వహించారు. 0-34 మార్కులు వచ్చిన వారికి ఈ-గ్రేడ్, 35- 40 వచ్చిన వారికి డీ-గ్రేడ్.... అలా ఏ, బీ, సీ, డీ, ఈ గ్రేడులు కేటాయించారు. ఒక్కో గ్రేడు విద్యార్ధులను రెండు బృందాలుగా విభజించి... ఒక బృందానికి బోధనా సామాగ్రిని తానే స్వయంగా అందించారు. మరో బృందాన్ని ఇంటి వద్ద నుంచి సేకరించమని చెప్పారు. వాటితో 60రోజులు ప్రయోగాలు చేయించారు. మళ్లీ పరీక్షలు నిర్వహించగా... సొంతంగా సామాగ్రిని సేకరించి, స్వతహాగా ప్రయోగాలు చేసిన పిల్లలు... మార్కులు అధికంగా సాధించారు. పరిశోధనకు ముందు సగటుకంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్ధులు... మంచి మార్కులు పొందారు. చదువులో అప్పటికే ముందున్న విద్యార్ధుల నేర్చుకునే సామర్థ్యాలు.... గతం కంటే అధికమయ్యాయి. సైన్స్ అంటే ఆసక్తి చూపని విద్యార్ధులు సైతం ప్రస్తుతం సొంతగా ప్రయోగాలు చేస్తూ పాఠాలు నేర్చుకుంటున్నారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..

సైన్స్ బోధనారీతులపై పరిశోధనలు చేసిన శ్రీధర్... 2017లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. దక్షిణ భారత సైన్స్ ఫేర్‌లో 2011లో స్పెషల్ జ్యూరీ, 2009లో ఇస్రో ద్వారా ప్రత్యేక నగదు బహుమతి, 2007 స్పెషల్ పబ్లిషర్ అవార్డు అందుకున్నారు. 2017 ఔత్సహిక భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా జాతీయ కార్యశాలకు ఎంపికయ్యారు. 2020లో రాష్ట్ర స్థాయి సైన్స్ సేవా రత్న, 2019లో తెలంగాణ ఇన్నోవేషన సెల్ ద్వారా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ ఇన్నోవేటర్ అవార్డు, ఇంటింటా ఇన్నోవేటర్ అవార్డు సహా పలు పురస్కారాలు అందుకున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.