ETV Bharat / state

Youth on Notifications: ఉద్యోగ భర్తీపై నిరుద్యోగ యువతలో మిశ్రమ స్పందన

author img

By

Published : Mar 12, 2022, 4:26 AM IST

Youth on Notifications: ఉద్యోగాల భర్తీపై శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటనపై ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నిరుద్యోగ యువతలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కేసీఆర్​ ప్రకటనను స్వాగతిస్తూనే కొన్ని అంశాలపై ఉద్యోగార్థులు అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడగా కాకుండా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్ నాటికి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉచిత శిక్షణ, వసతి సౌకర్యాలను సైతం కల్పిస్తే నిరుపేద అభ్యర్ధులు, అందరితో సమానంగా పరీక్షల్లో పోటీ పడతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Youth on Notifications: ఉద్యోగ భర్తీపై నిరుద్యోగ యువతలో మిశ్రమ స్పందన
Youth on Notifications: ఉద్యోగ భర్తీపై నిరుద్యోగ యువతలో మిశ్రమ స్పందన

Youth on Notifications: ముఖ్యమంత్రి కేసీఆర్​ శాసనసభలో చేసిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటనపై ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నిరుద్యోగ యువత నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 4,429 ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు కేసీఆర్​ ప్రకటనను స్వాగతిస్తూనే, ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు గతంలో చేసిందని, ఇప్పుడు కూడా ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్న అంశాన్ని స్పష్టం చేయలేదనే వాదన వినిపిస్తున్నారు. కేవలం ఎన్నికల ఎత్తుగడ కాకుండా వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఖాళీల భర్తీ ప్రక్రియ సైతం పూర్తి చేయాలని యువత డిమాండ్ చేస్తున్నారు.

అర్హులైన వారంతా పోటీపడే అవకాశం

ఏ ఉద్యోగాల భర్తీని ఎప్పుడు చేపడతారు, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు.. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో క్యాలెండర్​ని సైతం ప్రకటిస్తే ఉద్యోగార్థులు అందుకు సిద్ధం కావడానికి సులువుగా ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల్లో కలిపి సుమారు 95వేల మంది ఉపాధి కల్పన కార్యాలయంలో ఉపాధి కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 30వేల మంది ప్రైవేటు సంస్థల్లో కొలువు చేస్తున్నారు. మిగిలిన వాళ్లు చిన్నచితకా పనులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. వీరిలో అర్హులైన వారంతా పోటీపడే అవకాశం ఉంది. వయోపరిమితిని పదేళ్లు సడలించడంతో ఎక్కువ మంది పోటీపడే అవకాశం ఉంది. ఒక్కో అభ్యర్థి రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తారని అందువల్లే గ్రూప్-1, డీఎస్సీ, ఇతర ఉద్యోగాల పరీక్షల మధ్య సహేతుకమైన గడువు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉచిత శిక్షణ, మెటీరియల్​ను అందించాలి..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ప్రక్రియ ప్రారంభిస్తే నోటిఫికేషన్​తో సంబంధం లేకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 జిల్లా కేంద్రాల్లో ఉచిత వసతి సౌకర్యంతో పాటు శిక్షణ, మెటీరియల్​ను అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లు ప్రధానంగా వినిపిస్తున్నారు. అందరి ఆర్థిక స్తోమత, చదివే సామర్థ్యాలు, పరీక్షల సన్నద్ధత ఒకే స్థాయిలో ఉండవని, అందరూ పరీక్షల్లో పోటీ పడాలంటే ప్రభుత్వమే ఉచిత శిక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. స్టడీ సర్కిళ్లు, స్టడీ హాళ్లు, కోచింగ్, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెటీరియల్​ని సైతం విస్తృతంగా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నిరాశ వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్థులు

కొత్త జోన్ల వ్యవస్థ, 95శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించడం, వయోపరిమితి సడలింపు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ నిర్ణయాలను యువత స్వాగతించారు. పోలీసు ఉద్యోగాల భర్తీలో వయో పరిమితి సడలింపు లేకపోవడంపై కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.