ETV Bharat / state

నేతన్నపై రేషం ధరల పిడుగు.. కూలీ కూడా గిట్టదని కార్మికుల ఆవేదన

author img

By

Published : Mar 21, 2022, 8:59 PM IST

Handloom Workers Facing Difficulties: ముడిసరుకు ధరలు పెరగడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులతో కొత్త వస్త్రాలను తయారు చేయలేకపోతున్నారు. గిట్టుబాటు ధరలేక నేసిన చీరలను అమ్ముకోలేక పోతున్నారు. పట్టు రేషం ధర గతేడాది కంటే అధికంగా పెరగడంతో నేతన్నలు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేం లేక మగ్గం పనికి స్వస్తి చెప్పి వేరే పనులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నేతన్నపై రేషం ధరల పిడుగు.. కూలీ కూడా గిట్టదని కార్మికుల ఆవేదన
నేతన్నపై రేషం ధరల పిడుగు.. కూలీ కూడా గిట్టదని కార్మికుల ఆవేదన

నేతన్నపై రేషం ధరల పిడుగు.. కూలీ కూడా గిట్టదని కార్మికుల ఆవేదన

Handloom Workers Facing Difficulties: ఉమ్మడి మహబూబ్​నగర్‌ జిల్లాలో మొత్తం 13 చేనేత సంఘాలు ఉండగా.. 3వేలకుపైగా మగ్గాలున్నాయి. చీరను నేయడానికి పట్టు రేషం తప్పనిసరి. గతంలో కిలో రేషం ధర రూ.3,200 ఉండగా.. ప్రస్తుతం 7వేలుగా ఉంది. ముడి సరుకు ధరలు పెరగడంతో చీరను తయారు చేసిన కూలీ కూడా గిట్టుబాటు కావట్లేదని నేతన్నలు వాపోతున్నారు.

ధరలు పెరగడంతో ఇబ్బంది

రేషం, వార్పు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు కొన్న ధర, మరుసటి రోజు ఉండటం లేదు. 15 రోజుల వ్యవధిలో కిలో రేషంపై రూ.వెయ్యికిపైగా పెరగడంతో కొనాలంటేనే భయంగా ఉంది. ముడిసరుకు ధరలు పెరిగినా.. చీర ధర రూపాయి కూడా పెరగకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని రేషం ధరలను నియంత్రించాలి. లేదంటే.. చేనేత రంగం కుదేలైపోతుంది. - పరమేశ్‌, మాష్టర్‌ వీవర్‌, రాజోలి

పెట్టుబడి పెట్టలేక..

చేనేత కార్మికులు ఎక్కువగా బెంగళూరు, ధర్మవరం ప్రాంతాల నుంచి పట్టు ముడిసరుకు కొనుగోలు చేస్తుంటారు. అక్కడి దళారులు సిండికేట్‌గా మారి ధరలు విపరీతంగా పెంచేయడంతో...పెట్టుబడి పెట్టలేక నేతన్నలు మగ్గం పనిని నిలిపివేస్తున్నారు. ప్రభుత్వాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు అందట్లేదని నేతన్నలు వాపోతున్నారు.

కూలీ గిట్టుబాటు కావడం లేదు

రోజూ మగ్గం నేస్తేనే మా జీవనం గడిచేది. సొంత పెట్టుబడితో చీరలను తయారు చేస్తా. వచ్చే కూలీ డబ్బులతో పెరిగిన నిత్యావసర సరకులు, కూరగాయల కొనుగోలు ఇంటి అవసరాలకే సరిపోతోంది. ఇలాంటి తరుణంలో చీర తయారీకి అవసరమైన ముడిసరుకు ధరలు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ధరలతో చీర తయారు చేసి అమ్మితే కూలీ గిట్టుబాటు కావడం లేదు. - వెంకటేశ్‌, చేనేత కార్మికుడు, అమరచింత

సకాలంలో రాయితీలు అందక..

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం 2018లో చేనేత మిత్ర పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి కిలో రేషం కొనుగోలుపై 40శాతం రాయితీ సొమ్మును నేరుగా కార్మికుల ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తోంది. గతేడాది నుంచి సకాలంలో రాయితీలు అందక అవస్థలు పడుతున్నారు. ముడి సరుకు ధరలను నియంత్రించకపోతే మగ్గం పనులు కనుమరుగయ్యే అవకాశముందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముడి సరుకు ధరలను నియంత్రించి తమ కుటుంబాలను ఆదుకోవాలని చేనేత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.