ETV Bharat / state

TS Crop Loss : వడ్లన్నీ వర్షార్పణం.. లబోదిబోమంటున్న రైతాంగం

author img

By

Published : Apr 26, 2023, 2:40 PM IST

Crop Loss
Crop Loss

Crop Loss in Mahabubnagar : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే తరుణంలో అకాల వర్షం కురిసి తడిసి ముద్దైపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు చాలాచోట్ల ధాన్యం తడిసిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసుకున్న ధాన్యం వర్షార్పణం అయింది. చేతికొచ్చిన పంటంతా నీటిపాలవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

వర్షం ధాటికి తడిసి ముద్దైన ధాన్యం.. లబోదిబోమంటున్న అన్నదాతలు

Crop Loss in Mahabubnagar : అకాల వర్షం అన్నదాతల ఉసురుతీస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే తరుణంలో తడిసి ముద్దైపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి చాలాచోట్ల ధాన్యం తడిసిపోయింది. అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల వరికోతలు పూర్తై కల్లాల్లో ధాన్యం ఉన్నాయి. కొన్నిచోట్ల ధాన్నాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు.

Crop Damage in Mahabubnagar : దేవరకద్ర, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన వరి, మొక్కజొన్న వర్షానికి నానిపోయింది. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. కల్లాల్లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం రాత్రి కురిసిన వర్షానికు తడిసిపోయింది. ఈదురుగాలతో కూడిన వర్షం కురవడంతో పొలాల్లో వడ్లు రాలిపోయాయి. ఈదురుగాలుల ధాటికి వరిచేలు నేలకొరిగాయి.

ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల్లో కలిపి ఈసారి సుమారు 5 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. కోతలు 50 శాతం పూర్తికాగా.. మిగిలిన విస్తీర్ణంలో కోతలు ప్రారంభం కావాల్సి ఉంది. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ, ధరూరు మండలం మార్లబీడులో పిడుగుపాటుకు 2 గేదేలు మృతి చెందాయి.

కేంద్రాల్లో ఉన్న ధాన్యం సైతం వర్షార్పణం: వనపర్తి జిల్లా పరిధిలో రాత్రి కురిసిన అకాల వర్షానికి పెద్దమందడి ఖిల్లా, గణపురం, గోపాల్పేట, వనపర్తి మండలాలలో కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. గత 20 రోజులుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు అకాల వర్షం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. వరి కోతలు ప్రారంభమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గత నెల రోజుల ముందే సూచించిన క్షేత్రస్థాయిలోని అధికారులు మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు. దాంతో కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యం సైతం తడిసి ముద్దైపోయింది.

"మేము మూడు ఎకరాల్లో వరి పంట వేశాం. లక్ష దాకా పెట్టుబడి అయింది. వారం రోజులు అవుతోంది యార్డుకు తెచ్చి.. కేంద్రాలు కొనుగోలు చేయడం లేదు. రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం నీటిపాలైంది. మాకు చాలా నష్టం జరిగింది." -రైతు

ధాన్యపు రాశుల్లోకి చేరిన వర్షపు నీరు: వనపర్తి మార్కెట్ యార్డులో వర్షపు నీరు బయటికి వెళ్లేందుకు తగిన కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో యార్డులో నీరి నిలిచి ధాన్యపు రాశులను ముంచేసింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఒకసారి ఆరిన ధాన్యం తడిస్తే తూకంలో తక్కువ అవుతుందని రైతులు వాపోతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట ఈ యాసంగిలో అంతంత మాత్రంగానే దిగుబడి వచ్చిందని.. అది విక్రయించేందుకే నానా యాతలు పడుతోంటే.. ఇప్పుడు వానొచ్చి అంతా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"మేము ఆరుగాలం కష్టపడి పంటలు పండించి మార్కెట్​ యార్డ్​కు తీసుకొస్తే గిట్టుబాటు ధర లేదు. యార్డులోనే ధాన్యాన్ని నిల్వ చేశాం. రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. చెరువు మాదిరి యార్డంతా నీరు నిల్వ అయింది." -రైతు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.