ETV Bharat / state

Mahabubnagar-Visakha Train Started : మహబూబ్‌నగర్ టు విశాఖ రైలు ప్రారంభం.. ఇక నుంచి రోజూ..

author img

By

Published : May 20, 2023, 7:55 PM IST

kishanreddy
kishanreddy

Mahabubnagar-Visakha Express Train Started : మహబూబ్​నగర్ నుంచి కాజీపేట-వరంగల్ మీదుగా విశాఖపట్నం వెళ్లాలనుకునే ప్రయాణికుల కష్టాలు నేటితో తీరనున్నాయి. మహబూబ్​నగర్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్లే ఎక్స్​ప్రెస్ రైలును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్​నగర్ రైల్వేస్టేషన్‌లో నేడు ప్రారంభించారు. కొద్ది రోజులుగా వారాంతపు రైలుగా ఉన్న ఈ ట్రైన్‌.. ప్రస్తుతం రోజూ నడపనున్నారు. మహబూబ్​నగర్ నుంచి వరంగల్ భద్రకాళి దేవాలయం, అన్నవరం, సింహాచలం లాంటి పుణ్యక్షేత్రాలకు, వైజాగ్, అరకు లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు రాకతో ప్రయాణం సులభతరం కానుంది.

Mahabubnagar - Visakha Express Train Started : మహబూబ్​నగర్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్లే రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మహబూబ్​నగర్ రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటి వరకు పాలమూరు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు నేరుగా వెళ్లేందుకు ఎలాంటి రైలు సౌకర్యం లేదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ రైలు వల్ల మహబూబ్​నగర్ నుంచి నేరుగా కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాజమండ్రి, విశాఖపట్నం వరకు ప్రయాణించే అవకాశం లభించింది.

ఆ ఎక్స్​ప్రెస్​ను షాద్​నగర్​లో నిలిపే అంశాన్ని పరిశీలిస్తాం : ఇప్పటికే మహబూబ్​న​గర్-హైదరాబాద్ డబ్లింగ్ పనులు రూ.1400 కోట్లతో పూర్తి చేసి మోదీ జాతికి అంకితం చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును సైతం మహబూబ్​నగర్​లో ఆపే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని.. త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని కిషన్​రెడ్డి అన్నారు. చెంగల్​పట్టు-కాచిగూడ చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను షాద్​నగర్‌లో నిలిపే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తెలంగాణలో వెయ్యి కిలోమీటర్ల జాతీయ రహదారుల్ని విస్తరించాల్సి ఉందన్న కిషన్​రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి ఇస్తే పనులు వేగవంతం చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌కు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.

రైల్వే సమస్యలను ప్రస్తావించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ : మహబూబ్​నగర్-విశాఖపట్నం రైలును ప్రారంభించడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైల్వే శాఖకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని తెలిపారు. వీరన్నపేట, టీడీ గుట్టల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర నిధులతోనే ఆ అవసరాలు తీర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు రైల్వే శాఖ అనుమతులు ఇచ్చి సహకరించాలని శ్రీనివాస్​గౌడ్ కోరారు.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రావడంపై ప్రయాణికుల హర్షం : మహబూబ్ నగర్-విశాఖపట్నం రైలును ప్రారంభించడం పట్ల ఈ ప్రాంత ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం వెళ్లే వెసులుబాటు కలిగిందని సంతోషపడుతున్నారు. దూర భారం, ప్రయాణ సమయం ఆదా అవుతాయని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తయిన తర్వాత తొలిసారి పూర్తి విద్యుత్ రైలును ఈ మార్గంలో నడుపుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.