ETV Bharat / state

పరిహారంలో హెచ్చుతగ్గులపై ఉదండపూర్ వాసుల ఆవేదన

author img

By

Published : Dec 13, 2022, 9:32 AM IST

Agitation of Udandapur residents: రేకుల షెడ్డుకు 40లక్షల పరిహారం.. 6గదులు, ప్రహరీతో ఉన్న పక్కా ఇంటికి మాత్రం 13లక్షలే. భూసేకరణ ముందు లక్షలు వెచ్చించి నిర్మించుకున్న గృహాలకు.. ఇప్పుడిచ్చే పరిహారం చాలా తక్కువే. ఒకే కొలతలు, ఒకే నిర్మాణాలున్నా అధికారులు ప్రతిపాదించిన పరిహారంలో హెచ్చుతగ్గులున్నాయి. ఇళ్ల పరిహారంలో పాలమూరు జిల్లా ఉదండపూర్ గ్రామస్తుల ఆవేదనపై కథనం.

Udandapur
Udandapur

పరిహారంలో హెచ్చుతగ్గులపై ఉదండపూర్ వాసుల ఆవేదన

Agitation of Udandapur residents: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లమండలం ఉదండపూర్ జలాశయంలో నిర్వాసితుడవుతున్న యాదయ్య తనకు చెల్లించాల్సిన ఇంటిపరిహారంలో అన్యాయం జరిగిందని ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 10లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇంటికి... కేవలం 4లక్షల 20వేలే లెక్కించారని, జరిగిన అన్యాయంపై పోరాడినా ఫలితం లేకపోవడంతో... ఆవేదనకు గురై జలాశయం కోసం తవ్విన నీటి గుంతలోపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొందరికి ఒకలా, ఇంకొందరికి మరోలా పరిహారం లెక్కించారని... అందరికి సమన్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

యాదయ్య ఒక్కరే కాదు ఉదండపూర్ గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న చాలామందికి సరైన పరిహారాన్ని జాబితాలో పొందుపర్చలేదని... గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉదండపూర్ నిర్వాసితుల ఇళ్ల పరిహారానికి సంబంధించిన జాబితా బయటకొచ్చింది. అందులో ఇళ్లేలేని మొండిగోడలు, రేకుల ఇళ్లు, పూరీ గుడిసెలకు లక్షల్లో పరిహారం చెల్లించాలని... పిల్లర్లు, స్లాబ్‌లు వేసి పక్కాగా నిర్మించుకున్న ఇళ్లకు తక్కువ పరిహారం వచ్చేలా జాబితా రూపొందించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకే కొలతలతో, నిర్మాణాలతో కూడిన ఇళ్లకు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువగా పరిహారం ఇచ్చారని ఇదెక్కడి న్యాయమని నిలదీస్తున్నారు.

ఓ సామాజికవర్గానికి చెందిన రేకుల షెడ్డుకు 40లక్షల పరిహారం ప్రతిపాదించడాన్ని చూసి అంతా కంగుతిన్నారు. 6గదులు, ప్రహరీ ఉన్న పక్కా ఇంటికి 12లక్షల 45వేలు ప్రతిపాదిస్తే, పక్కనే ఉన్న మరో రేకుల ఇంటికి 15లక్షలు ప్రతిపాదించారు. పరిహారాల్లో తేడాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. అనుమానాలు ఉండి తమ వద్దకు వచ్చిన గ్రామస్తుల సందేహాలు నివృత్తి చేస్తున్నామని, సంతృప్తి చెందకపోతే రీ సర్వేకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

ప్రస్తుతం బయటకు పొక్కిన జాబితా తుదినివేదిక కాదని, కంగారుపడాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయంగా పలుకుపడి ఉన్న వాళ్లకు ఎక్కువ పరిహారం ప్రతిపాదించారని, సామాన్య జనాన్ని అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.